దసరా మండపంలో దర్జాగా..
భద్రాచలం: భక్త రామదాసు కాలం నాటి దసరా మండపంలో భద్రగిరి రాముడు దర్జాగా దర్శనమిచ్చాడు. అధ్యయనోత్సవాలలో భాగంగా శుక్రవా రం మారుతి పారామెడికల్ కళాశాల ఆధ్వర్యంలో రాపత్తు సేవ నిర్వహించారు. ఈ సేవను ఏటా దసరా మండపంలో జరుపుతారు. ఈక్రమంలో ప్రత్యేకంగా అలంకరించిన స్వామివారిని పల్లకీలో కొలువుదీర్చి కోలాటాలు, వేద మంత్రాలు, మంగళవాయిద్యాలు, భక్తులు శ్రీరామ నామస్మరణల నడు మ కోలాహలంగా శోభా యాత్ర జరిపారు. సీతాలక్ష్మణ సమేతుడైన రామయ్యకు మండపంలో ప్రత్యేక పూజలు చేసి హారతి సమర్పించారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు డాక్టర్ కాంతారావు, అర్చకులు, వేదపండితులు పాల్గొన్నారు.
వాగ్గేయకారోత్సవాల బ్రోచర్ల ఆవిష్కరణ
ఈనెల 23నుంచి ప్రారంభం కానున్న 393 భక్త రామదాసు జయంతోత్సవ కార్యక్రమాల బ్రోచర్లను ఆలయ ఈవో దామోదర్‌రావు శుక్రవారం తన కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రముఖ సంగీత కళాకారులు చిత్రకూట మండపంలో ఐదురోజులపాటు ప్రదర్శనలు ఇస్తారని పేర్కొన్నారు. ఆలయ ఏఈవోలు శ్రావణ్ కుమార్, భవాని రామకృష్ణ పాల్గొన్నారు.
స్వర్ణ కవచాలంకరణలో మూలమూర్తులు
అంతరాలయంలోని మూలమూర్తులు శుక్రవారం స్వర్ణకవచాలతో దర్శనం ఇచ్చారు. తొలుత తెల్ల వారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం మేళతాళాల నడుమ గర్భగుడి నుంచి ఊరేగింపుగా తీసుకొచ్చి బేడా మండపంలో కొలువుదీర్చారు. విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం అనంతరం కంకణధారణ, యజ్ఞోపవీతధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి కల్యాణాన్ని శాస్త్రోక్తంగా జరిపారు.
ప్రతీ ఆదివారం నదీ హారతి
సూపర్‌బజార్(కొత్తగూడెం): ఏరు– ది రివర్ ఫెస్టివల్‌లో భాగంగా భద్రాచలంలో ప్రతీ ఆదివారం గోదావరి నదీహారతి కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ జితేష్ వి.పాటిల్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు, భక్తులు, పండితుల సూచనలు, వినతులను పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. గత రెండు శనివారాల్లో భద్రాచలం గోదావరి ఘాట్ వద్ద నిర్వహించిన నదీహారతి కార్యక్రమాలకు ప్రజల నుంచి స్పందన లభించిందని తెలిపారు. ఇకపై ప్రతీ ఆది వారం నిర్వహిస్తామని పేర్కొన్నారు.
శ్రీసీతారామ చంద్రస్వామివారికి
ఘనంగా రాపత్తు సేవ


