ఒక్కో అవయవం పాడవుతూ..
9 నెలల నరకం తర్వాత భార్య మృతి
దొడ్డబళ్లాపురం: ఓ భర్త అత్యంత క్రూరంగా భార్యను హత్య చేశాడు. పాదరసం ఇంజెక్షన్ ఇవ్వడం ద్వారా.. ఒక్కో అవయవం పాడయ్యేలా చేసి.. 9 నెలల పాటు నరకం చూపించి హతమార్చాడు. ఈ దారుణ ఘటన బెంగళూరులో జరిగింది. విద్య(37), బసవరాజు దంపతులకు నాలుగేళ్ల కుమారుడు ఉన్నాడు. వీరు బెంగళూరులోని అత్తిబెలెలో నివసిస్తున్నారు. కొన్నాళ్లుగా భార్య, భర్త మధ్య గొడవలు జరుగుతున్నాయి.
ఈ నేపథ్యంలో భార్యను ఎవరికీ అనుమానం రాకుండా అంతమొందించాలనుకున్న బసవరాజు.. ఓ డయాగ్నోస్టిక్ సెంటర్‌లో పని చేసే శ్వేత, ఆమె భర్త సాయంతో క్లోరోఫాం, పాదరసం, సిరంజిలు తీసుకున్నాడు. ఈ ఏడాది ఫిబ్రవరి 26న రాత్రి బసవరాజు విద్యతో ప్రేమ గా మాట్లాడుతూ.. క్లోరోఫాం ఇచ్చాడు. కొంచెం మత్తులోకి జారుకున్నాక పాదరసం ఇంజెక్షన్ చేశాడు.
మరుసటి రోజు స్పృహలోకి వచ్చిన విద్యకు కుడి తొడ భాగంపై వాపు, విపరీతమైన నొప్పి వచ్చింది. అప్పటి నుంచి ఆరోగ్యం క్షీణిస్తుండడంతో మార్చి 7న ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరింది. వారు వైద్య పరీక్షలు నిర్వహించి.. ఆమె శరీరాన్ని పాదరసం విషమయం చేస్తున్నట్లు గుర్తించారు. ఒక్కొక్క అవయవం పాడవుతుండగా.. 9 నెలల పాటు నరకం చూసిన విద్య సోమవారం మరణించింది. తన భర్త, మామ కలిసి తనను హత్య చేసేందుకు పాదరసం ఇంజెక్షన్ ఇచ్చారని ముందుగా ఇచ్చిన వీడియో వాంగ్మూలంలో తెలిపింది.


