
శ్రీకృష్ణ జన్మాష్టమి అనేది దేవదేవుడైన శ్రీకృష్ణుడు తన దివ్య ధామం నుండి భూమిపై అవతరించిన పవిత్రమైన రోజు. ఈ పండుగను శ్రావణ మాసంలోని కృష్ణ పక్ష అష్టమి నాడు జరుపుకుంటారు. భగవంతుని అలౌకికమైన ఆవిర్భావం, దివ్య లీలలను అర్థం చేసుకోవడం ద్వారా జీవులు ముక్తిని పొంది, భగవద్దామాన్ని చేరగలరని భగవద్గీత బోధిస్తోంది. శ్రీ కృష్ణుడి జననం మానవ జీవిత సార్థకతకు అవసరమైన అనేక వరాలను లోకానికి అందించింది. మధురలోని కంసుని కారాగారంలో దేవకీ వసుదేవులకు చతుర్భుజ విష్ణువుగా అవతరించటం, ఆపై సామాన్య బాలకుడిగా రూపాంతరం చెందటం, పసిపిల్లాడిగానే అనేక అసురులను మట్టుపెట్టడం, చిటికెన వ్రేలుతో గోవర్ధన గిరిని ఎత్తి పట్టడం తదితర అసాధారణమైన లీలలన్నీ శ్రీకృష్ణుని దివ్యత్వాన్ని చాటిచెబుతున్నవే.

శ్రీకృష్ణుని అవతార లక్ష్యం
శ్రీకృష్ణుని జననం సాధారణ శిశువుల వలె సంభవించినది కాదు. వాస్తవానికి ఆయన పుట్టుక లేనివాడైనప్పటికీ, తన అంతరంగిక శక్తిచేతనే ఈ లోకాన అవతరించి మన మధ్య జన్మించడం ఆయన దివ్య లీలల్లో ఒకటి. దుష్టులను శిక్షించి, శిష్టులను రక్షించి, ధర్మాన్ని పునఃస్థాపించడం వారి అవతార ప్రయోజనాలలో మరొకటి. మనమంతా ఈ భౌతిక దేహాలు కాదని, శాశ్వత ఆత్మ స్వరూపులమని, నిరంతర ఆనందం మన సహజ స్థితి అని తెలుపుతూ భగవద్గీతలో శ్రీకృష్ణుడు అందించిన సందేశం మన సనాతన సంస్కృతికి మూల స్థంభం. మానవ జన్మకు అంతిమ లక్ష్యం భగవంతునితో మన ప్రేమపూర్వక సంబంధాన్ని పునరుద్ధరించుకోవడమే. భగవద్గీతలో శ్రీకృష్ణుడు మానవాళికి అందించిన పరమ సందేశం "సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ" (సమస్త ధర్మాలను త్యజించి నన్నే శరణు పొందుము). ఇది మోక్షాన్ని పొందే అత్యంత సరళమైన మార్గం.
జన్మాష్టమిని ఎలా ఆచరించాలి?
కృష్ణాష్టమి నాడు భక్తులు అర్ధరాత్రి వరకు ఉపవాసం ఉంటారు. ఆరోగ్యం సహకరించనివారు పండ్లు, పాలు వంటి అనుకల్ప ప్రసాదం తీసుకోవచ్చు. మీకు సమీపంలోని శ్రీకృష్ణుని దేవాలయాన్ని సందర్శించి శ్రీకృష్ణుని సేవల్లో పాల్గొనండి. ముఖ్యంగా, ఆ రోజు హరే కృష్ణ మహామంత్రాన్ని జపించడం (కనీసం 108 సార్లు) చాలా శ్రేష్ఠం. పలు కారణాల రీత్యా దేవాలయానికి వెళ్లలేని భక్తులు కూడా హరే కృష్ణ మహామంత్రాన్ని జపించడం ద్వారా శ్రీకృష్ణుని కృపను పొందగలరు. ఈ కలియుగంలో శ్రీకృష్ణుడు తన నామ రూపంలో అవతరించి వున్నారు. హరే కృష్ణ మహామంత్రాన్ని స్పష్టంగా ఉచ్చరించి శ్రద్ధగా వినడం ద్వారా హృదయంలోని కల్మషాలు తొలగి, భగవత్ప్రేమ పెంపొంది, ఆధ్యాత్మిక మార్గంలో పురోగమించగలము. ఈ రోజు భగవద్గీత, శ్రీమద్భాగవతం వంటి గ్రంథాల నుండి శ్రీకృష్ణుని లీలలు, ఉపదేశాలను పఠించడం పుణ్యప్రదం.
విశ్వవ్యాప్తమైన శ్రీకృష్ణ జన్మాష్టమి
శ్రీ కృష్ణ జన్మాష్టమిని విశ్వవ్యాప్త పండుగగా నిలపడంలో ఇస్కాన్ సంస్థాపకాచార్యులు శ్రీల ప్రభుపాదుల కృషి అపారం. 70 ఏళ్ల వయసులో తమ గురువు ఆదేశంతో పాశాత్య దేశాలకు వెళ్లి భగవద్గీత బోధనలను, పవిత్ర కృష్ణ నామాన్ని వ్యాప్తి చేశారు. ప్రపంచవ్యాప్తంగా 108 దేవాలయాలను స్థాపించి, జగన్నాథ రథయాత్రలను ప్రారంభించారు. 70కి పైగా గ్రంథాలను రచించి, వాటిని 25కు పైగా భాషల్లోకి అనువదించి పంపిణీ చేశారు. సామాన్య జీవన శైలితో అత్యున్నత తాత్త్విక చింతనను గలిగి జీవించే విధానాన్ని బోధించి ఎందరో శిష్యులకు మార్గనిర్దేశం చేశారు. యుగధర్మమైన హరినామ సంకీర్తనను ప్రపంచంలోని నగర గ్రామాలకూ వ్యాప్తి గావించి శ్రీచైతన్య మహాప్రభువుల భవిష్యవాణిని సార్థకం చేసిన మహనీయులు భక్తివేదాంత స్వామి శ్రీల ప్రభుపాద.
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే
హరే రామ హరే రామ రామ రామ హరే హరే
హరే కృష్ణ గోల్డెన్ టెంపుల్‌లో కృష్ణాష్టమి వేడుకలు
హరే కృష్ణ గోల్డెన్ టెంపుల్, బంజారా హిల్స్‌లో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు వైభవంగా జరుగుతాయి. భక్తులు రాధా గోవిందుల దర్శనం చేసుకోవచ్చు, చిన్ని కృష్ణుడిని ఉయ్యాలలో ఊపవచ్చు (ఊంజల సేవ). భగవన్నామ జపం చేయటం, నామ సంకీర్తనల్లో పాల్గొనడం, సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకోవడం ద్వారా దివ్య అనుభూతిని పొందవచ్చు. ఈ రోజు దేవాలయంలో వేలాది మందికి ఉచిత అన్నదానం కూడా నిర్వహిస్తారు. అంతేగాక ఈ ఏడాది నార్సింగిలో నిర్మితమవుతున్న హరే కృష్ణ హెరిటేజ్ టవర్, మరియు కందిలోని హరే కృష్ణ కల్చరల్ సెంటర్ వద్ద కూడా ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు నిర్వహించబడతాయి.భక్తులందరూ కుటుంబంతో సహా వచ్చి తీర్థ ప్రసాదాలు స్వీకరించి, స్వామి వారి కృపకు పాత్రులు కావాలని ఆలయం ఆహ్వానిస్తోంది. పాఠకులందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు! హరే కృష్ణ.
-శ్రీమాన్ సత్యగౌర చంద్రదాస ప్రభూజీ
ఎం.టెక్ (ఐఐటి మద్రాస్)
అధ్యక్షులు, హరే కృష్ణ మూవ్‌మెంట్ – హైదరాబాద్