ప్రపంచ ధ్యాన దినోత్సవంపై ప్రత్యేక కథనం!
హైదరాబాద్: ఏటా డిసెంబర్ 21వ తేదీని ప్రపంచ ధ్యాన దినోత్సవంగా జరుపుకోవాలని ఐక్యరాజ్యసమితి ప్రకటించినప్పటి నుంచి ప్రపంచ వ్యాప్తంగా ధ్యానంపై ఆసక్తి పెరుగుతోంది. ధ్యానాన్ని భగవంతుడ్ని చేరే మార్గంగా ఆధ్యాత్మికవేత్తలు నిర్వచిస్తుంటారు. ప్రతిరోజూ కొంచెం సమయమైనా ధ్యానంలో గడిపే సులభమైన అభ్యాసం ద్వారా మనం మన ప్రశాంతత స్థాయిలను, శారీరక ఆరోగ్యాన్ని గణనీయంగా మెరుగు పరుచుకోగలుగుతాం.
పశ్చిమ దేశాలలో యోగ పితామహునిగా విస్తృతంగా గుర్తింపు పొందిన, ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు పొందిన "ఒక యోగి ఆత్మకథ" (Autobiography of a Yogi) గ్రంథ రచయిత అయిన పరమహంస యోగానంద, మానవులందరికీ ధ్యానం అత్యంత ప్రాముఖ్యత కలిగినదని నొక్కి చెప్పారు. క్రియాయోగం లాంటి శాస్త్రీయ ధ్యాన మార్గాన్ని అనుసరించడం వల్ల - ఉన్నత ఆత్మతో అనుసంధానం చెందుతాం. క్రియా యోగం ఒక సమగ్రమైన, వైజ్ఞానిక, సర్వవ్యాప్త పద్ధతి. ప్రతి వ్యక్తి సంపూర్ణ మానసిక శాంతిని పొందడం వైపు అభివృద్ధి సాధిస్తాడు. అంతే కాకుండా, క్రియాయోగ ధ్యాన పద్ధతి, దాని అనుబంధ పద్ధతులు శరీరం, మనస్సు, ఆత్మకు ఎంతో అవసరమైన పునరుజ్జీవనాన్ని అందిస్తాయి.
'యోగ' అనే పదం వాస్తవానికి భగవంతునితో ఐక్యాన్ని సూచిస్తుంది. యోగ మార్గంలో ధ్యాన సాధన ఒక అంతర్భాగం. పరమహంస యోగానంద ద్వారా 1917లో స్థాపించబడిన యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా (వై.ఎస్.ఎస్.) , ఆ మహాగురువు ఉపదేశించిన క్రియాయోగ బోధనలను వ్యాప్తి చేస్తుంది. ఈ బోధనలు ఆత్మసాక్షాత్కారం అనే ఉన్నత లక్ష్యాన్ని సాధించడానికి ప్రాథమిక మార్గంగా క్రమం తప్పకుండా చేసే గాఢమైన ధ్యానానికి అత్యంత ప్రాధాన్యతను ఇస్తాయి.
'ఒక యోగి ఆత్మకథ'లో, పరమహంస యోగానంద క్రియాయోగ ధ్యాన విజ్ఞానం అన్ని ఇతర ఆధ్యాత్మిక సాధనా పద్ధతుల కంటే ఉన్నతమైనదని, భక్తితో కూడినప్పుడు, అది అంతిమ లక్ష్యాన్ని సాధించడంలో ఖచ్చితంగా సఫలం అవుతుందని పేర్కొన్నారు! ధ్యానాన్ని తమ దైనందిన దినచర్యలలో చేర్చుకోవడంలో వాయిదా వేసేవారు వివిధ రకాల వృత్తినిపుణులు తీవ్రంగా పొరపాటుపడ్డారు. తీరిక లేని జీవితానికి, అనివార్యంగా దానితో పాటు వచ్చే ఒత్తిడులను మెరుగ్గా ఎదుర్కోవడానికి ధ్యాన సాధన మరింత అవసరం.
హార్వర్డ్ విశ్వవిద్యాలయం అధ్యయనం ప్రకారం క్రమం తప్పకుండా ధ్యానం చేసే సీఈఓలు వారి వృత్తి జీవితంలో కూడా స్పష్టంగా మరింత విజయవంతంగా ఉంటారని వెల్లడించింది. ఆధునిక మనస్తత్వ సంపూర్ణ ఆరోగ్య నిపుణులు కూడా ఆరోగ్యకరమైన, సంతోషకరమైన, సంతృప్తికరమైన జీవితాలను గడపడానికి ధ్యానాన్ని ఒక అద్భుతమైన మార్గంగా ప్రతిపాదిస్తారు.
ఇప్పటికే నిరంతర ఆధ్యాత్మిక సాధనను అత్యంత ప్రాధాన్యతగా ఎంచుకున్న వారికి, వారు గాఢంగా ధ్యానం చేయడానికి ఎంత ఎక్కువ సమయం కేటాయించగలిగితే అంత మంచిది. సంవత్సరాల తరబడి చేసే ధ్యానం ప్రతి మానవుడిని మరింత ఉల్లాసంగా, సమతుల్యంగా, సమర్థవంతంగా. శారీరకంగా కూడా ఆరోగ్యంగా మారుస్తుంది, ఇది నిశ్చయం.పరమహంస యోగానంద గుర్తుండి పోయేలా ఇలా అన్నారు, "ఇది వేచి ఉండగలదు, అది వేచి ఉండగలదు, కానీ భగవంతుని కోసం మీ అన్వేషణ ఆగకూడదు!" ఆ అన్వేషణను వేగవంతం చేసే మార్గం ధ్యానమే!
పరమహంస యోగానందకు గురువైన స్వామి శ్రీయుక్తేశ్వర్ గిరిగా ప్రసిద్ధి చెందిన వారు, ఎంతో స్ఫూర్తిదాయకంగా ధ్యానం గురించి చెప్పారు: "మీరు ఇప్పుడు ఆధ్యాత్మిక ప్రయత్నం చేస్తే భవిష్యత్తులో ప్రతిదీ మెరుగుపడుతుంది" ఈ జీవితంలో శాశ్వత శాంతిని, ఆనందాన్ని మనం కనుగొనాలంటే ధ్యానం ఒక ఐచ్ఛిక కార్యం కాదని, అది మన జీవితాలలో తప్పనిసరి చర్య అని ప్రపంచ ధ్యాన దినోత్సవం మనందరికీ గుర్తుచేసే విధంగా ఉండాలి. మరింత సమాచారం కోసం: yssofindia.org చూడొచ్చు.


