మత్తు పదార్థాల వ్యసనం అనేది త్వరగా వదిలించుకోలేని దురలవాటు అని చెబుతుంటారు. ఈ ఊబిలో చిక్కుకున్న వారు దానిని వదిలించుకునే క్రమంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటారు. అయితే బెంగళూరులోని నిమ్హాన్స్ (NIMHANS) శాస్త్రవేత్తలు డ్రగ్ అడిక్ట్స్‌కు ఉపకరించే పరిష్కార మార్గాన్ని కనుగొన్నారు. ప్రాచీన భారతీయ విద్య యోగాను ఆధునిక వైద్యానికి మేళవించి, చికిత్స అందించడం ద్వారా, డ్రగ్స్ బానిసలు అతి స్వల్ప కాలంలోనే వ్యసనాల నుంచి విముక్తులవుతున్నట్లు వారి తాజా పరిశోధనల్లో తేలింది.
సాధారణంగా డ్రగ్స్ మానేసే సమయంలో తలెత్తే బాధాకరమైన లక్షణాల నుండి కోలుకునేందుకు బాధితులు వరుసగా కొన్ని రోజుల పాటు ఔషధాలు వాడాల్సి ఉంటుంది. అప్పుడే వారికి ఉపశమనం లభిస్తుంది. అయితే నిమ్హాన్స్ పరిశోధకులు.. మందులతో పాటు యోగాను జోడించి, బాధితులు కేవలం ఐదు రోజుల్లోనే కోలుకునేలా చేయగలిగారు. అంటే బాధితులు కోలుకునే సమయం దాదాపు సగానికి తగ్గింది. ఈ పరిశోధన ఫలితాలు అంతర్జాతీయ వైద్య పత్రిక ‘జామా సైకియాట్రీ’లో ప్రచురితమై, ప్రపంచవ్యాప్తంగా యోగా గొప్పదనాన్ని తెలియజేశాయి.
ఈ చికిత్స కోసం పరిశోధకులు ప్రత్యేక రీతిలో 45 నిమిషాల యోగా విధానాన్ని రూపొందించారు. ఇందులో బాధితులు పడుకుని చేసే విశ్రాంతి భంగిమలు (Supine relaxation), ఉచ్ఛ్వాస నిశ్వాసాలను నియంత్రించే శ్వాస ప్రక్రియలు, ఎడమ ముక్కు ద్వారా శ్వాస పీల్చడం, భ్రామరి ప్రాణాయామం మొదలైనవి ఉన్నాయి. ఈ ప్రక్రియలు డ్రగ్స్ మానేసే సమయంలో రోగికి కలిగే తీవ్రమైన మానసిక, శారీరక ఒత్తిడిని తగ్గించడంలో అద్భుతంగా పనిచేశాయి.
డ్రగ్స్ మానేసే క్రమంలో బాధితులు ఎదుర్కొనే అతిపెద్ద సమస్యలు నిద్రలేమి, తీవ్రమైన ఒత్తిడి, ఒంటి నొప్పులు. యోగా చికిత్స పొందిన బాధితులలో నిద్రపోయే సమయం (Sleep Latency) సగటున ఒక గంట మేరకు మెరుగుపడింది. అలాగే మందులతో తగ్గని మానసిక ఆందోళన (Anxiety) కూడా యోగా వల్ల త్వరగా అదుపులోకి వచ్చినట్లు డాక్టర్ భరత్ హోల్లా వెల్లడించారు.
ఈ పరిశోధనలో శాస్త్రవేత్తలు.. బాధితుల గుండె స్పందనల వేరియబిలిటీ (హెచ్‌ఆర్‌ఏ)ని కూడా లెక్కించారు. యోగా చేయడం వల్ల శరీరంలోని పారాసింపథెటిక్ వ్యవస్థ ఉత్తేజితమై, ఒత్తిడిని కలిగించే హార్మోన్ల ప్రభావం తగ్గుతున్నట్లు వారు గుర్తించారు. ఈ శారీరక మార్పుల కారణంగానే బాధితులు 25 శాతం మేరకు వేగంగా కోలుకుంటున్నారని డేటా విశ్లేషణలో స్పష్టమైంది.
కాగా కర్ణాటకలో యువతలో పెరుగుతున్న మత్తు అలవాట్లపై ఈ అధ్యయనం ఆందోళన వ్యక్తం చేసింది. ప్రస్తుతం యువత ‘టాపెంటాడాల్’ అనే సింథటిక్ డ్రగ్స్‌కు ఎక్కువగా బానిసలవుతున్నారు. ఈ ప్రయోగంలో పాల్గొన్న వారిలో 80 శాతం మంది 20 ఏళ్ల వయసున్న యువకులే కావడం గమనార్హం. వీరిలో ఎక్కువమంది కర్ణాటకకు చెందిన వారు కాగా, పశ్చిమ బెంగాల్, మణిపూర్ రాష్ట్రాల వారు కూడా ఉన్నారని సెంటర్ హెడ్ డాక్టర్ ప్రభాత్ చంద్ తెలిపారు.
ఈ యోగా చికిత్సకు ఎటువంటి ఖరీదైన పరికరాలు లేదా ప్రత్యేక గదులు అవసరం లేదు. శిక్షణ పొందిన థెరపిస్టులు బాధితుని పడక వద్దే ఈ వ్యాయామాలను చేయించవచ్చు. ఇది చాలా తక్కువ ఖర్చుతో కూడిన ప్రక్రియ. ఇప్పటికే ఉన్న వైద్య చికిత్సకు దీనిని అదనంగా చేర్చడం ద్వారా ప్రజారోగ్య రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావచ్చని నిమ్హాన్స్ ప్రతినిధులు చెబుతున్నారు. ప్రస్తుతం ఆరు నెలల పాటు డ్రగ్స్ మళ్లీ వాడకుండా ఉండే దశపై నిమ్హాన్స్ డైరెక్టర్ ప్రతిమ మూర్తి పర్యవేక్షణలో అధ్యయనం కొనసాగుతోంది.
ఇది కూడా చదవండి: విద్యుత్ విప్లవం: వేలాడే వైర్లు.. భయపెట్టే ట్రాన్స్‌మీటర్లు కనుమరుగు


