శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌కు చెక్ పెట్టాలన్నా, జీర్ణక్రియ మెరుగుపడాలన్నా పీచు పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలని అందరూ భావిస్తుంటారు. అయితే అతి అనర్థ దాయకం అన్నట్లుగా గట్ ఆరోగ్యం కోసం అతిగా ఫైబర్ తీసుకోవడం వల్ల ప్రయోజనాల కంటే నష్టాలే ఎక్కువగా ఉంటాయని తాజా పరిశోధనలు హెచ్చరిస్తున్నాయి. ఇంతకీ అసలు రోజుకు ఎంత ఫైబర్ తీసుకోవాలో తెలుసు కుందాం.
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ ప్రకారం, వయస్సును బట్టి మనం తీసుకునే ఫైబర్ పరిమాణం మారుతుండాలి. పెద్దలు రోజువారీ ఆహారంలో సుమారు 30 గ్రాముల పీచు పదార్థం ఉండేలా చూసుకోవాలి. 15 ఏళ్లలోపు పిల్లలకు 20 గ్రాములు, మూడేళ్లలోపు వారికి15 గ్రాముల ఫైబర్ సరి పోతుంది.
అతిగా పీచు పదార్థాలు తీసుకోవడం వల్ల పేగుల్లో చికాకు కలగడం, కడుపు బిగుతుగా ఉండటం వంటి ఇబ్బందులు ఎదురవుతాయి. ముఖ్యంగా ఫైబర్ ఎక్కువైనప్పుడు తగినంత నీరు తాగకపోతే మలబద్ధకం సమస్య మరింత జటిలమవుతుంది. అంతేకాకుండా, ఆహారంలోని క్యాల్షియం, ఐరన్, జింక్ వంటి కీలకపోషకాలను శరీరం గ్రహించకుండా ఈ ఫైబర్ అడ్డుకుంటుంది. దీనివల్ల బరువు విపరీతంగా తగ్గడంతో పాటు పేగుల్లో అడ్డంకులు కూడా ఏర్పడే ప్రమాదం ఉంది.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
ఫైబర్ మాక్సింగ్ డైట్ పాటించేవారు కొన్ని ముఖ్యమైన సూచనలు పాటించడం అవసరం. ఒకేసారి కాకుండా ఆహారంలో ఫైబర్ పరిమాణాన్ని క్రమంగా పెంచుకుంటూ పోవాలి. అప్పుడే జీర్ణాశయం ఆ మార్పుకు అలవాటు పడుతుంది. పీచు పదార్థాలు తీసుకున్నప్పుడు ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. లేకపోతే కడుపు బిగదీసినట్టుగానూ...తిప్పుతున్నట్టు గానూ ఉండే ప్రమాదం ఉంటుంది.
కృత్రిమ ఫైబర్ పైడర్లకు బదులుగా పండ్లు, కూరగాయలు, చిక్కుళ్లు, తృణధాన్యాలను ఎంచుకోవాలి. విభిన్న రకాల ఫైబర్లు అందాలంటే మొక్కల ఆధారిత ఆహారాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. పెరుగు లో గింజలు వేసుకోవడం లేదా సలాడ్స్ తీసుకోవడం మంచి పద్ధతి. పీచు పదార్థాలు ఆరోగ్యంపై సానుకూల ప్రభావం చూపుతాయి. అయితే వాటిని పరిమితికి లోబడి తీసుకున్నప్పుడే ఆ ప్రయోజనాలు లభిస్తాయని మరువ కూడదు.


