న్యూఢిల్లీ: భారత్, బంగ్లాదేశ్ మధ్య కీలకమైన గంగా నదీ జలాల పంపిణీ ఒప్పందం పునరుద్ధరణ అంశం కొత్త మలుపు తిరిగింది. 1996లో కుదిరిన ఫరక్కా గంగా జలాల ఒప్పందం 30 ఏళ్ల గడువు 2026 డిసెంబర్ 12తో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఒప్పందాన్ని బంగ్లాదేశ్ కోరుకున్న నిబంధనలతో ఆటోమేటిక్‌గా పొడిగించేందుకు భారత్ నిరాకరించింది. కొత్త ఒప్పందం కోసం ఇరు దేశాల మధ్య తాజాగా ద్వైపాక్షిక చర్చలు జరగాలని స్పష్టం చేసింది. భారత్‌లోని పశ్చిమ బెంగాల్, బిహార్ రాష్ట్రాల వ్యవసాయం, పరిశ్రమలు, ప్రజల అవసరాలకు తగిన ప్రాధాన్యం ఇచ్చిన తర్వాతే బంగ్లాదేశ్‌కు నీటి కేటాయింపులపై నిర్ణయం తీసుకోవాలని భారత ప్రభుత్వం భావిస్తోంది. దేశీయ నీటి భద్రత విషయంలో రాజీ పడేది లేదని అధికార వర్గాలు సంకేతాలిచ్చాయి.
మారిన రాజకీయ పరిస్థితులు
1996లో షేక్ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ ప్రభుత్వ హయాంలో భారత్-బంగ్లాదేశ్ మధ్య ఈ ఒప్పందం కుదిరింది. అప్పట్లో ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు, సహకార వాతావరణం ఉండేది. అయితే ప్రస్తుతం తారిఖ్ రెహమాన్ నేతృత్వంలోని బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్‌పీ) ప్రభుత్వం హయాంలో పరిస్థితులు మారాయి. నీటి పంపిణీ హామీలను రవాణా మార్గాలతో ముడిపెట్టడం, నిరసనల హెచ్చరికలు వంటి పరిణామాలు చర్చలపై ప్రభావం చూపుతున్నాయి.
80 శాతం నీటి వాటాపై వివాదం
ఎండాకాలంలో గంగా నదిలో నీటి ప్రవాహం తగ్గినప్పుడు బంగ్లాదేశ్‌కు ఎంత నీరు కేటాయించాలన్నది ప్రధాన వివాదంగా మారింది. 1977 నాటి ఒప్పందంలో ఉన్న తరహాలో కనీసం 80 శాతం నీటి వాటాకు హామీ ఇచ్చే నిబంధనను తిరిగి తీసుకురావాలని బంగ్లాదేశ్ కోరుతోంది. అయితే ఇలాంటి స్థిరమైన కనీస హామీలకు భారత్ అంగీకరించడం లేదు.
నీటి లభ్యత ఆధారంగానే కేటాయింపులు
నదిలో వాస్తవంగా ఎంత నీరు అందుబాటులో ఉందో దాని ఆధారంగా కేటాయింపులు జరగాలని భారత్ ప్రతిపాదిస్తోంది. నదీ ప్రవాహంలో మార్పులను బట్టి నీటి విడుదలను సర్దుబాటు చేసుకునే వెసులుబాటు ఉండాలని భావిస్తోంది. తద్వారా ఎగువ ప్రాంతాల్లోని వ్యవసాయ, పారిశ్రామిక, పట్టణ అవసరాలను కాపాడుకోవచ్చని స్పష్టం చేస్తోంది.
ఒప్పంద కాలపరిమితిపైనా భిన్నాభిప్రాయాలు
కొత్త ఒప్పందం ఎంతకాలం అమల్లో ఉండాలన్న అంశంలోనూ ఇరు దేశాల మధ్య ఏకాభిప్రాయం లేదు. దీర్ఘకాలిక లేదా నిరవధిక ఒప్పందం కావాలని బంగ్లాదేశ్ కోరుతుండగా.. తక్కువ కాలపరిమితితో ఒప్పందం చేసుకునే అంశాన్ని భారత్ పరిశీలిస్తోంది. దీనివల్ల భవిష్యత్తులో నదీ ప్రవాహాలు, ప్రాంతీయ రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు మార్చుకునే అవకాశం ఉంటుందని భావిస్తోంది.
ఇతర అంశాలతోనూ ముడిపడి చర్చలు
గంగా జలాల ఒప్పందాన్ని కేవలం నీటి పంపిణీ అంశంగానే భారత్ చూడటం లేదు. వాణిజ్యం, భద్రత, రవాణా మార్గాల వంటి ఇతర ద్వైపాక్షిక అంశాల్లోనూ పురోగతి ఉండాలని భావిస్తోంది. ఈ అంశాల్లో పరస్పర సహకారం ఆధారంగానే తుది ఒప్పందంపై నిర్ణయం తీసుకునే అవకాశముంది. ప్రధాని తారిఖ్ రెహమాన్‌తో ఉన్నతస్థాయి దౌత్య చర్చలు కూడా కీలకం కానున్నాయి.
ఇదీ చదవండి: అమెరికాలో కాల్పుల కలకలం.. ఇద్దరు మృతి!


