చట్టం అమల్లోకి వచ్చిన మూడేళ్లకు ఏర్పాటు చేసిన కేంద్రం
న్యూఢిల్లీ: దేశంలో మధ్యవర్తిత్వ కేసులను నియంత్రించేందుకు ఉద్దేశించిన మీడియేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(ఎంసీఐ) ఎట్టకేలకు ఏర్పాటైంది. ఇందుకు సంబంధించిన మీడియేషన్ చట్టం–2023లోనే అమల్లోకి వచ్చింది. కానీ, మూడేళ్లుగా ఎంసీఐను ఏర్పాటు చేయకపోవడంపై పార్లమెంటరీ కమిటీ ఇటీవల కేంద్రంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ చట్టంతో ఒనగూరే పూర్తి ప్రయోజనాలను పొందేందుకు ఎంసీఐని త్వరగా అందుబాటులోకి తీసుకురావడం చాలా కీలకమని కమిటీ పేర్కొంది.
ఈ నివేదిక ఈ నెలారంభంలో పార్లమెంట్ ముందుకు వచ్చింది. అయితే, అర్హులైన న్యాయ నిపుణుల కొరత కారణంగా ఇప్పటి దాకా ఎంసీఐను ఏర్పాటు చేయలేకపోయినట్లు కేంద్రం తెలిపింది. ఈ నేపథ్యంలోనే గురువారం రాత్రి ఎంసీఐ ఏర్పాటుపై కేంద్ర న్యాయశాఖ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ కౌన్సిల్ సంస్థాగత వివాద పరిష్కార విధానాన్ని క్రమబదీ్ధకరించడంతోపాటు మధ్యవర్తిత్వ ప్రక్రియను ప్రోత్సహిస్తుంది. అలాగే, మధ్యవర్తిత్వం ద్వారా కేసులను పరిష్కరించే సంస్థలకు గుర్తింపునిస్తుంది.
ఈ రంగంలో నిపుణులకు శిక్షణ ఇచ్చి, ధ్రువీకరణ పత్రాలు అందించే సంస్థలకు కూడా అనుమతులను మంజూరు చేస్తుంది. వాణిజ్య, సివిల్, కుటుంబ వివాదాలను కోర్టుల వెలుపల పరిష్కరించుకునేందుకు ప్రభుత్వం రెండు విధానాలను ప్రోత్సహిస్తోంది. మొదటిది సంస్థాగత మధ్యవర్తిత్వ తీర్పు, రెండోది మీడియేషన్ అంటే సంప్రదింపుల ద్వారా మధ్యవర్తిత్వం.
సంస్థాగత మధ్యవర్తిత్వంలో కేసులను తీర్పుల ద్వారా పరిష్కరిస్తే, సంప్రదింపుల మధ్యవర్తిత్వంలో కేసులను సయోధ్య ద్వారా పరిష్కరిస్తారు. ఏదైనా సరే ఇవి రెండూ తాత్కాలిక ఏర్పాట్లు మాత్రం కావు. ఆర్బిట్రేషన్, మీడియేషన్ వ్యవస్థలు సంస్థాగతమైనవి. ఇవి చూపే పరిష్కారానికి ఇరుపక్షాలు కచ్చితంగా కట్టుబడి ఉండాల్సిందే. కోర్టుల్లో కేసులు గుట్టలుగా పేరుకుపోవడం, న్యాయం కోసం ఏళ్ల తరబడి ఎదురు చూడాల్సిన పరిస్థితుల నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం మధ్యవర్తిత్వ విధానాలకు ప్రాధాన్యం ఇస్తోంది.


