విదేశీ పెట్టుబడులకు సంస్కరణల కార్పెట్‌! | PM Modi reviews economic resilience strategy amid West Asia uncertainty | Sakshi
Sakshi News home page

విదేశీ పెట్టుబడులకు సంస్కరణల కార్పెట్‌!

Jun 10 2026 4:07 AM | Updated on Jun 10 2026 6:25 AM

PM Modi reviews economic resilience strategy amid West Asia uncertainty

వేగం పెంచనున్న కేంద్రం 

పెట్టుబడుల ఉపసంహరణకూ పెద్దపీట 

ఆస్తుల విక్రయం ద్వారా నిధుల సమీకరణ 

సంక్షోభ కాలంలో వృద్ధిని కాపాడుకునే చర్యలు 

న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితులతో ఏర్పడిన ఆర్థిక అనిశ్చితులను సమర్థవంతంగా గట్టెక్కడం, విదేశీ పెట్టుబడులను తిరిగి ఆకర్షించేందుకు కేంద్రం తన సంస్కరణల అజెండాను మరింత వేగంగా ముందుకు తీసుకుపోనుంది. గత ఏడాదిన్నరగా మన క్యాపిటల్‌ మార్కెట్ల నుంచి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు తరలిపోతుండడం చూస్తున్నాం. హర్మూజ్‌ జలసంధి మూసివేతతో చమురు, గ్యాస్‌ సరఫరాల్లో సమస్యలు ఏర్పడి వాటి ధరలు భారీగా పెరిగిపోవడం తెలిసిందే. 

ఈ పరిస్థితుల్లో దిగుమతుల బిల్లు పెరిగిపోయి రూపాయి విలువ క్షీణిస్తోంది. ఇది విదేశీ పెట్టుబడులను నిరుత్సాహపరిచే అంశం. ఈ తరుణంలో తిరిగి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను (ఎఫ్‌డీఐ) ఆకర్షించడం లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం అదనపు చర్యలను పరిశీలిస్తున్నట్టు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. అదే సమయంలో విదేశీ పెట్టుబడుల ఉపసంహరణపై ఎలాంటి ఆంక్షల ప్రతిపాదనలు లేవని స్పష్టం చేశాయి. 

దేశీ ఆర్థిక మూలాలు పటిష్టంగానే ఉన్నాయని.. బలమైన వినియోగానికి తోడు మెరుగైన జీఎస్‌టీ వసూళ్లు, ప్రైవేటు రంగంలో పెట్టుబడులు మెరుగుపడుతున్న పరిస్థితులను అవి గుర్తు చేస్తున్నాయి. చమురు, ఎరువుల దిగుమతుల బిల్లు పెరిగిపోయిన తరుణంలో దేశీ వృద్ధి పథాన్ని కాపాడుకోవడంతోపాటు ప్రభుత్వరంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణను, ఆస్తుల విక్రయాన్ని మరింత వేగిరపరచాలని సర్కారు యోచిస్తున్నట్టు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.  

ఆర్థికరంగ సంస్కరణలు.. 
ఆర్థిక రంగంలో సంస్కరణలను కొనసాగించడం ద్వారా దీర్ఘకాల విదేశీ పెట్టుబడులను ఆకర్షించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. తద్వారా క్యాపిటల్‌ మార్కెట్లను మరింత బలోపేతం చేయాలనుకుంటోందని తెలిపాయి. అవసరమైన చర్యలను ప్రభుత్వం ఒకదాని తర్వాత ఒకటి చేపడుతుందని, తద్వారా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను (ఎఫ్‌డీఐ) ఆకర్షించనున్నట్టు చెప్పాయి. 

గత వారం ప్రభుత్వ సెక్యూరిటీల్లో (జీ–సెక్‌లు) విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడులను (ఎఫ్‌పీఐ) పెంచడం కోసం చర్యలు తీసుకోవడం తెలిసిందే. వడ్డీ ఆదాయం, దీర్ఘకాల, స్వల్పకాల మూలధన లాభాలపై పన్నుల నుంచి విదేశీ పెట్టుబడిదారులకు మినహాయింపునిస్తూ నిర్ణయం తీసుకోవడాన్ని ఆయా వర్గాలు గుర్తు చేస్తున్నాయి. ఇది రూపాయి బలోపేతానికి కొంతమేర సాయపడినట్టు పేర్కొన్నాయి. బంగారం, వెండి దిగుమతులపైనా సుంకాలను 6% నుంచి 15 శాతానికి పెంచడం ఫలితాన్నిస్తున్నట్టు చెప్పాయి.  బీమాలో 100% ఎఫ్‌డీఐను అనుమతించడం గమనార్హం.

కట్టడిలోనే ద్రవ్యలోటు.. 
ఈ ఏడాది జనవరి–మార్చి త్రైమాసికంలో మాదిరే వృద్ధి కార్యకలాపాలు ప్రస్తుత త్రైమాసికంలోనూ (2026–27 ఏప్రిల్‌–జూన్‌) కొనసాగుతున్నట్టు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. విదేశాల నుంచి వచ్చే రెమిటెన్స్‌లు కూడా స్థిరంగానే ఉన్నట్టు చెప్పాయి. దిగుమతుల వ్యయాలు పెరిగిపోయినప్పటికీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ద్రవ్యలోటును బడ్జెట్‌లో పేర్కొన్న విధంగా జీడీపీలో 4.3 శాతానికి కట్టడి చేయడం ఇప్పటికీ సాధ్యమేనని పేర్కొన్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement