హెచ్‌పీసీఎల్ నష్టం రూ. 12,265 కోట్లు, బీపీసీఎల్ @ రూ. 3,962 కోట్లు
న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలతో అంతర్జాతీయంగా ముడిచమురు రేట్లు భారీగా పెరిగినప్పటికీ దేశీయంగా ఆ స్థాయిలో పెరగకపోవడంతో ప్రభుత్వ రంగ ఇంధన మార్కెటింగ్ దిగ్గజాలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో నష్టాలు చవిచూశాయి. భారత్ పెట్రోలియం కార్పొరేషన్ (బీపీసీఎల్) 15 త్రైమాసికాల్లోనే తొలిసారిగా నష్టాలు నమోదు చేసింది. క్యూ1లో రూ. 3,962 కోట్ల నష్టం ప్రకటించింది.
గతేడాది ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో కంపెనీ రూ. 6,124 కోట్లు, ఈ ఏడాది జనవరి–మార్చి త్రైమాసికంలో రూ. 3,191 కోట్ల లాభాన్ని నమోదు చేసింది. తొలి త్రైమాసికంలో ఆదాయం రూ. 1.35 లక్షల కోట్ల నుంచి రూ. 1.59 లక్షల కోట్లకు పెరిగింది. మరోవైపు హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ (హెచ్‌పీసీఎల్) రూ. 12,265 కోట్ల నష్టం (కన్సాలిడేటెడ్) ప్రకటించింది.
గత క్యూ1లో కంపెనీ రూ. 4,111 కోట్ల లాభం నమోదు చేసింది. తాజాగా ఆదాయం 21 శాతం పెరిగి రూ. 1.45 లక్షల కోట్లకు ఎగిసింది. క్యూ1లో ఎల్‌పీజీపై బీపీసీఎల్ రూ. 3,485 కోట్లు, హెచ్‌పీసీఎల్ రూ. 3,607 కోట్ల మేర ఆదాయం నష్టపోయాయి. 2026 మార్చి 31 నాటికి హెచ్‌పీసీఎల్‌కి రూ. 12,799 కోట్లు, బీపీసీఎల్‌కి రూ. 12,318 కోట్ల మేర ఎల్‌పీజీ సబ్సిడీ బకాయిలు రావాల్సి ఉన్నాయి.
బుధవారం బీఎస్‌ఈలో బీపీసీఎల్ షేరు సుమారు ఒకటిన్నర శాతం నష్టంతో రూ. 314.50 వద్ద, హెచ్‌పీసీఎల్ షేరు దాదాపు మూడు శాతం క్షీణించి రూ. 395.25 వద్ద ముగిశాయి.


