మళ్లీ దాడులు షురూ  | Iran launches drone and missile attacks on Bahrain and Kuwait | Sakshi
Sakshi News home page

మళ్లీ దాడులు షురూ 

Jun 29 2026 4:51 AM | Updated on Jun 29 2026 4:51 AM

Iran launches drone and missile attacks on Bahrain and Kuwait

బహ్రెయిన్, కువైట్‌లపై ఇరాన్‌ డ్రోన్, క్షిపణుల వర్షం 

దుబాయ్‌: పశ్చిమాసియాలో శాశ్వత శాంతి ఒప్పందం కోసం ఓవైపు మధ్యవర్తిత్వం కొనసాగుతుండగా మరోవైపు అమెరికా, ఇరాన్‌లు దాడుల పర్వాన్ని నెమ్మదిగా మొదలెడుతున్నాయి. సరకు రవాణా నౌకపై ఇరాన్‌ దాడిచేసినందుకు ప్రతిగా ఇరాన్‌పై దాడులు చేశామని ప్రకటించిన అమెరికాకు దీటుగా బదులిస్తామంటూ ఇస్లామిక్‌ రెవల్యూషనరీ గార్డ్‌ కార్ప్స్‌(ఐఆర్‌జీసీ) ఆదివారం అమెరికా మిత్రదేశాలైన బహ్రెయిన్, కువైట్‌లపై క్షిపణుల వర్షం కురిపించింది. డ్రోన్లతో తెగబడింది. 

ఇకనైనా అమెరికా దాడులు ఆపకపోతే శాశ్వత శాంతి ఒప్పందం చర్చలకు చరమగీతం పాడతామని ఇరాన్‌ హెచ్చరించింది. హార్మూజ్‌పై ఇరాన్‌ ఆధిపత్యాన్ని గండికొట్టేలా ఒమన్‌ తీరం వెంట ఇరువైపులా రాకపోకలకు వీలుగా కొత్త జలసంధి మార్గాన్ని విస్తృతపరచాలని అమెరికా భావిస్తున్న వేళ ఈ పరస్పర దాడులు జరగడం గమనార్హం. తాజా దాడులపై ఇరాన్‌ విదేశాంగ మంత్రి అబ్బాస్‌ అరాఘ్చీ స్పందించారు. 

ఆదివారం ఇరాక్‌లో పర్యటన సందర్భంగా బాగ్దాద్‌లో ఆయన మాట్లాడారు. ‘‘ఇరాన్‌కు వ్యతిరేకంగా అమెరికా తీసుకునే నిర్ణయాలు హార్మూజ్‌ జలసంధిలో కొత్త ఉద్రిక్తతలను రాజేయడం ఖాయం. గత రెండ్రోజులుగా జరుగుతున్న పరిణామాలే ఇందుకు నిదర్శనం. లెబనాన్‌పై ఇజ్రాయెల్‌ దాడులు ఆపేలా అమెరికా ఒత్తిడితేవాల్సిందే’’ అని అన్నారు. ఆదివారం ఉదయం ఇరాన్‌ నుంచి దూసుకొచ్చిన క్షిపణులను విజయవంతంగా అడ్డుకున్నామని కువైట్‌ తెలిపింది.  

వాళ్లు బుద్ధి తెచ్చుకోరేమో: ట్రంప్‌ 
ఇరాన్‌పై దాడిని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ సమర్థించుకున్నారు. ఈ మేరకు ఆదివారం ‘ట్రూత్‌ సోషల్‌’లో ఒక పోస్ట్‌పెట్టారు. ‘‘ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిన ఇరాన్‌కు బుద్ధిచెప్పేందుకే మేం ఇరాన్‌ క్షిపణి, డ్రోన్‌ స్థావరాలపై, రాడార్‌ వ్యవస్థలపై దాడి చేశాం. ఇరాన్‌ ఎప్పటికీ బుద్ధి తెచ్చుకోదేమో. ఇలాగే కొనసాగితే మేం శాంతియుతంగా ఉండలేం’’ అని అన్నారు.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement