ఈ నెలాఖరులో భారత్‌లో అందుబాటులోకి
న్యూఢిల్లీ: ప్రముఖ పుస్తక ప్రచురణ సంస్థ పెంగ్విన్ రాండమ్ హౌస్ ఇండియా యువ పుస్తక ప్రియులు లక్ష్యంగా వినూత్న ఆలోచనను ఆచరణలోకి తెచ్చింది. జేబులో ఇమిడిపోయేంత చిన్నగా, సులువుగా ఎక్కడికైనా తీసుకెళ్లేందుకు వీలుగా రూపొందించిన ఈ పుస్తకాల విలువ రూ.125 మాత్రమేనని గురువారం విడుదల చేసిన ఓ ప్రకటనలో పెంగ్విన్ రాండమ్ హౌస్ ప్రకటించింది.దేశంలోని అన్ని వర్గాలతోపాటు నేటి తరం పాఠకులకు ప్రసిద్ధి చెందిన సాహిత్యాన్ని మరింత సులభంగా, చౌకగా అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా ’పెంగ్విన్ పాకెట్స్’ పేరుతో కొత్తగా బుక్ సిరీస్‌ను ప్రారంభించినట్లు ప్రకటించింది.
మొదటగా భారతీయ, విదేశీ సాహిత్యం, భాషలు, వివిధ ప్రాంతాలు, వివిధ కాలాలకు చెందిన 16 ప్రముఖ పుస్తకాలను విడుదల చేస్తున్నామన్నారు. ఇవి అక్టోబర్ ఆఖరుకల్లా దేశంలోని పుస్తకాల దుకాణాలతోపాటు ఆన్‌లైన్‌లోనూ అందుబాటులోకి వస్తాయని పెంగ్విన్ తెలిపింది. ‘పెంగ్విన్ పాకెట్స్’ ద్వారా పాఠకుడికి, ఒక మంచి పుస్తకానికి మధ్య ఉండే పుస్తకం ధర, పరిమాణం వంటి వాటన్నింటినీ తొలగించి, పుస్తక పఠనం వైపు నడిపించేందుకు కొత్త మార్గాలను సృష్టించేందుకు మేం ప్రయత్నిస్తున్నాం’అని పెంగ్విన్ రాండమ్ హస్ ఇండియా సేల్స్, ప్రాడక్ట్, మార్కెటింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మనోజ్ సట్టి వెల్లడించారు.
ఆ 16 ప్రముఖ రచనలు ఇవే..
పాకెట్ సైజులో మొదటగా ప్రముఖ భారతీయ రచనలతోపాటు వివిధ దేశాలకు చెందిన ప్రముఖులు రాసినవి కూడా ఉన్నాయి. భారతీయ రచనల్లో పండిట్ చంద్రధర్ శర్మ గులేరి రచన ‘ఉస్నే కహా థా’, ప్రేమ్ చంద్ కలం నుంచి జాలు వారిన ‘పంచ్ పరమేశ్వర్ ఔర్ అన్య కహానియా’, భర్తృహరి రచించిన ‘నీతి శతకం’, ప్రథమ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ రాసిన ‘పితా కె పత్ర్’, మహాత్మాగాంధీ స్వీయ రచన ‘హింద్ స్వరాజ్’. ప్రపంచ సాహిత్య కేటగిరీలో.. విఖ్యాత రచయిత ఖలీల్ గిబ్రాన్ రాసిన ‘ది ప్రొఫెట్’, జార్జి ఆర్వెల్ ‘ఏనిమల్ ఫామ్’, చైనాకు చెందిన సైనికాధికారి, వ్యూహకర్త సన్ ట్జు రచన ది ఆర్ట్ ఆఫ్ వార్, ఫ్రాంజ్ కాఫ్కా రాసిన మెటామార్ఫాసిస్, చారెల్స్ డికెన్స్ రచన ఎ క్రిస్ట్‌మస్ కరోల్, ఫియోదొర్ దోస్తోయెస్కీ రాసిన వైట్ నైట్స్, రవీంద్రనాథ్ ఠాగూర్ విఖ్యాత రచన గీతాంజలి, ఆస్కార్ వైల్డ్ ‘ది ఇంపార్టాన్స్ ఆఫ్ బీయింగ్ ఎర్నెస్ట్’, రాబర్ట్ లూయిస్ స్టీవెన్‌సన్ సైన్స్ ఫిక్షన్ ‘డాక్టర్ జెకిల్ అండ్ మిస్టర్ హైడ్’, లియో టాల్‌స్టాయ్ ‘ది డెత్ ఆఫ్ ఇవాన్ ఇల్యీచ్’, స్వాతంత్య్రోద్యమం సమయంలో జైలు నుంచి కుమార్తె ఇందిరకు జవహర్‌లాల్ నెహ్రూ రాసిన ‘లెటర్స్ ఫ్రం ఫాదర్’ఉన్నాయి.


