మహదేవ్ యాప్‌: ఆరు రాష్ట్రాల్లో సీబీఐ మెరుపు దాడులు! | CBI raids 33 locations in Mahadev betting case | Sakshi
Sakshi News home page

మహదేవ్ యాప్‌: ఆరు రాష్ట్రాల్లో సీబీఐ మెరుపు దాడులు!

Nov 14 2026 11:27 AM | Updated on Nov 14 2026 11:27 AM

CBI raids 33 locations in Mahadev betting case

న్యూఢిల్లీ: మహదేవ్ ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్ అక్రమ కార్యకలాపాలపై సీబీఐ దర్యాప్తు ముమ్మరం చేసింది. దేశవ్యాప్తంగా ఆరు రాష్ట్రాల్లో ఏకకాలంలో 33 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. ఈ తనిఖీల్లో పలు చోట్ల ప్రత్యక్షంగా బెట్టింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు గుర్తించిన అధికారులు బెట్టింగ్‌కు సంబంధించిన డిజిటల్ పరికరాలు, మొబైల్ ఫోన్లు, కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.

అమృత్‌సర్, ఢిల్లీ, నాగౌర్, ధోల్‌పూర్, భోపాల్, రాయ్‌పూర్, దుర్గ్, ఇండోర్, అహ్మదాబాద్, వడోదర, సూరత్, ముంబై, నాగ్‌పూర్ తదితర ప్రాంతాల్లో ఈ సోదాలు జరిగాయి. మహదేవ్ యాప్ ప్రధాన నిర్వాహకుల్లో ఒకరైన సౌరభ్ చంద్రాకర్‌ను ఒమన్ నుంచి భారత్‌కు తీసుకొచ్చిన అనంతరం అతడు వెల్లడించిన వివరాల ఆధారంగా ఈ దాడులు చేపట్టారు. నవంబర్ 1న చంద్రాకర్‌ను సీబీఐ అరెస్టు చేసింది. రాయ్‌పూర్ ప్రత్యేక న్యాయస్థానం అతడిని ఎనిమిది రోజుల పోలీసు కస్టడీకి అనుమతించింది. విచారణ అనంతరం నవంబర్ 12న కోర్టులో హాజరుపర్చగా, నవంబర్ 19 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించింది.

విదేశాల్లో ప్రధాన కార్యాలయం నుంచి యాప్‌ను నిర్వహిస్తూ, భారత్‌లో ప్యానెల్ నిర్వాహకుల ద్వారా బెట్టింగ్ కార్యకలాపాలు సాగించినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఇతరుల పేర్లతో బ్యాంకు ఖాతాలు తెరిచి డబ్బులు సేకరించడం, హవాలా మార్గాల్లో విదేశాలకు తరలించడం వంటి ఆరోపణలపై దర్యాప్తు కొనసాగుతోంది. పరారీలో ఉన్న ఇతర నిందితులను భారత్‌కు రప్పించేందుకు సీబీఐ ప్రయత్నిస్తోంది. బ్యాంకు ఖాతాలు, సిమ్‌కార్డులు, గుర్తింపు పత్రాలను ఇతరులకు అద్దెకు ఇవ్వడం కూడా నేరమని, అలాంటి చర్యలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని సీబీఐ హెచ్చరించింది.

ఇదీ చదవండి: ఉల్లి ధరలకు రెక్కలు.. చిన్నవి చూస్తే ‘చుక్కలు’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement