బ్యాంక్‌కు రూ.80 కోట్లకు పైగా కుచ్చుటోపీ | UK-Based Company Tied to 10Million usd Exim Bank Fraud Faces CBI FIR | Sakshi
Sakshi News home page

బ్యాంక్‌కు రూ.80 కోట్లకు పైగా కుచ్చుటోపీ

Nov 4 2026 2:43 PM | Updated on Nov 4 2026 2:46 PM

UK-Based Company Tied to 10Million usd Exim Bank Fraud Faces CBI FIR

యూకే కంపెనీపై సీబీఐ ఎఫ్‌ఐఆర్‌

ఎక్స్‌పోర్ట్‌-ఇంపోర్ట్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా (ఇండియా ఎగ్జిమ్‌ బ్యాంక్‌) నిధులను గోల్‌మాల్‌ చేసిన కుంభకోణం వెలుగులోకి వచ్చింది. బ్రిటన్‌ (యూకే) కేంద్రంగా కార్యకలాపాలు సాగించి ప్రస్తుతం రద్దయిన (డిసాల్వ్‌డ్‌) ఓ కంపెనీపై సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) అధికారికంగా ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది. ఈ మొత్తం కుంభకోణం సుమారు 10 మిలియన్‌ అమెరికన్ డాలర్ల (భారతీయ కరెన్సీలో దాదాపు రూ.80 కోట్లకు పైగా) మేర ఉన్నట్లు దర్యాప్తు సంస్థ ప్రాథమికంగా గుర్తించింది.

రీసైక్లింగ్ ప్రాజెక్టు పేరుతో టోపీ

అధికారిక వర్గాల సమాచారం ప్రకారం, యూకేకు చెందిన ‘హాంజెర్‌ బయోటెక్‌ ఎరిత్‌ లిమిటెడ్‌’ అనే సంస్థ రీసైక్లింగ్ ప్రాజెక్టును చేపడతామంటూ ఇండియా ఎగ్జిమ్‌ బ్యాంక్‌ను ఆశ్రయించింది. దీన్ని నిజమని నమ్మిన బ్యాంక్‌ అధికారులు 2012 సంవత్సరంలో సదరు కంపెనీకి భారీ మొత్తంలో రుణాన్ని మంజూరు చేశారు. అయితే, రుణం తీసుకున్న నిర్దేశిత లక్ష్యానికి కాకుండా ఆ నిధులను ఇతర మార్గాలకు మళ్లించినట్లు (ఫండ్‌ డైవర్షన్‌) సీబీఐ విచారణలో తేలింది.

మారిన ఎన్‌పీఏ లెక్కలు..

బ్యాంకు నుంచి రుణం పొందిన కొద్దికాలానికే ఆ సంస్థ కార్యకలాపాలు మందగించడం, తీసుకున్న రుణాన్ని తిరిగి చెల్లించకపోవడంతో 2014 నాటికే ఈ ఖాతా నిరర్థక ఆస్తిగా (ఎన్‌పీఏ) మారిపోయింది. బ్యాంక్‌ నిధులను పూర్తిగా పక్కదారి పట్టించి తర్వాత కాలంలో ఆ కంపెనీనే రద్దు చేసినట్లు దర్యాప్తులో తేలడంతో అసలు మోసం వెలుగుచూసింది. దీనిపై బ్యాంక్ అధికారుల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన సీబీఐ ప్రాథమిక విచారణను పూర్తి చేసి కంపెనీపై క్రిమినల్ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది. ఈ ఆర్థిక నేరంలో నిధులు ఎటువైపు మళ్లించారనే కోణంలోనూ, దీని వెనుక ఉన్న వ్యక్తులు, మాజీ ప్రమోటర్ల పాత్రపై దర్యాప్తును వేగవంతం చేశారు.

ఇదీ చదవండి: రిఫ్రిజిరేటర్లపై సైబర్ దాడి!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement