ఎన్డీయే కూటమి ఏలుబడిలో ఆంధ్రప్రదేశ్ చిత్రహింసల కొలిమిగా మారిన నేపథ్యంలో మొన్న మే నెలలో పోలీసు యమకింకరుల చేతుల్లోబడి మాయమైన 25 ఏళ్ల యువకుడు గాదె సాయికృష్ణ అదృశ్యం కేసును సీబీఐకి అప్పగిస్తూ రాష్ట్ర హైకోర్టు శుక్రవారం ఇచ్చిన ఆదేశం హర్షించదగింది. దీంతోపాటు సాయికృష్ణ తల్లి విజయలక్ష్మికి నాలుగు వారాల్లోపు రూ. 25 లక్షల పరిహారం చెల్లించాలని కూడా ధర్మాసనం ఆదేశించింది. కాపుల మద్దతు పుష్కలంగా ఉన్నదని చెప్పుకునే జనసేనతో కలిసి ప్రభుత్వాన్ని నడుపుతూ అదే కులానికి చెందిన యువకుణ్ణి విజయవాడ కృష్ణలంక పోలీసులు లాకప్లో కొట్టి చంపి, బూడిద కూడా మిగలకుండా చేశారంటే వారి బరితెగింపు ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
తన కుమారుణ్ణి మొన్న మే నెల మొదటి వారంలో అదుపులోకి తీసుకుని పోలీస్స్టేషన్లో తీవ్రంగా హింసిస్తున్నారని తెలిసి, రోజుల తరబడి తల్లి స్టేషన్ చుట్టూ తిరిగారు. పోలీసు అధికారుల కాళ్లావేళ్లా పడ్డారు. ఈ క్రమంలో ఒకరోజు సాయికృష్ణ ఆర్తనాదాలు వినబడి పరుగున వెనక్కివెళ్లి విలపించారు. అయినా వాళ్లు కనికరించలేదు. ‘కనీసం బూడిదైనా ఇస్తే అంత్యక్రియలు చేసుకుంటాం...’ అని అడిగినా జవాబిచ్చే దిక్కులేదు. చివరకు సీబీఐ దర్యాప్తు కోరుతూ ఆమె హైకోర్టును ఆశ్రయిస్తే... ఆ తల్లిని ఏమార్చటానికి కోర్టు వెలుపల ఎన్ని ప్రయత్నాలు జరిగాయో జనమంతా చూశారు. ఏపీ పోలీసులకేమైంది? కొట్టి చంపి, శవాన్ని మాయం చేసేంత అపరాధం ఆ యువకుడు ఏం చేశాడు? చట్టప్రకారం అరెస్టు చేసిన వారిని 24 గంటల్లో సమీప మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరచాలి.
కానీ బాబు ఏలుబడిలో ఇది సక్రమంగా అమలైంది లేదు. ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ కార్యకర్తలపైనా, నాయకులపైనా అక్రమ కేసులు పెట్టిఅరెస్టు చేయడం, రోజుల తరబడి అక్రమ నిర్బంధంలో ఉంచటం, బెయిలొస్తే వేరే కేసులో తిరిగి నిర్బంధంలోకి తీసుకోవటం రివాజుగా మారింది. చివరకు కూటమి పాలన అవకతవకలపై పోస్టులు పెట్టే సాధారణ జనాన్ని కూడా వదలడం లేదు. వేలమందిగూండాలనూ, రౌడీలనూ వైఎస్సార్ కాంగ్రెస్ నాయకుల ఇళ్లపై దాడులకు పంపడం, చేయాల్సిన విధ్వంసమంతా పూర్తయ్యాక పోలీసులు బాధితులనే అరెస్టుచేయడంబాబు తీసుకొచ్చిన దుష్ట సంప్రదాయం.
ఈ వాతావరణమే పోలీసులకు ధైర్యాన్నిచ్చింది. తమను అడిగేవాడు లేడని విర్రవీగే స్థాయికి చేర్చింది. వాస్తవానికి పోలీసు ఆగడాలకు బలైంది సాయికృష్ణ మాత్రమే కాదు... వారి చిత్రహింసలకు తాళలేక తనువు చాలిస్తున్నానంటూ దళిత యువకుడు క్రాంతికుమార్ వీడియోలో ప్రకటించి మరీ ఆత్మహత్య చేసుకున్నాడు. అంతకుముందూ, ఆ తర్వాతా గంగమ్మ, తిరుపతమ్మ అనే మహిళల్ని సైతం లాకప్లో కొట్టి చంపినట్టు ఆరోపణలొచ్చాయి. మరో మహిళ కళావతి కూడా వీరి వేధింపులవల్లే ఆత్మహత్య చేసుకున్నదని కథనాలు వచ్చాయి.
ఇలా పలువురు మరణించిన సందర్భాలున్న నేపథ్యంలో కేవలం సాయికృష్ణ అదృశ్యంపై సీబీఐ దర్యాప్తు చేస్తే సరిపోదు. మిగిలిన కేసుల్ని సైతం ఈ దర్యాప్తు పరిధిలోకి చేర్చాలి. అప్పుడు మాత్రమే ఈ ధోరణి కాస్తయినా తగ్గుతుంది. నారా వారి ఏలుబడి ముందూ మునుపూ కూడా ఇలాగే ఉంది. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్లో నక్సలైట్లను అణచే పేరిట తెలంగాణ పల్లెల్లో యువకుల్ని మాయం చేయటం, ఎన్కౌంటర్లలో హతమార్చటం, చట్టబద్ధమైన ఉద్యమాలపై కత్తిగట్టి ప్రైవేటు ముఠాల్ని ప్రోత్సహించి హత్యలు చేయించటం ఆ కాలంలో నిత్యకృత్యం. ఈ ప్రతీకార వాతావరణంలోనే అలిపిరి దగ్గర చంద్రబాబుపై హత్యాయత్నం జరిగింది.
చిత్రమేమంటే దీనివల్ల సానుభూతి వెల్లువెత్తుతుందని భ్రమించి ఎన్నికలకు పోతే జనం టీడీపీని మాత్రమే కాదు... జాతీయ స్థాయిలో టోకున ఎన్డీయే కూటమిని చిత్తుగా ఓడించారు. ‘పీడకు పిశాచం తోడైనట్టు...’ ఇప్పుడు కొడుకు చేతికందిరావటంతో ఆ అరాచకాలు మరిన్నిరెట్లు పెరిగాయి. వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీ గురుమూర్తి ఈ కేసుకు సంబంధించిదాఖలు చేసిన పిటిషన్పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు గత నెలలో ఆందోళన వ్యక్తం చేసింది. సీబీఐ దర్యాప్తు వేగవంతంగా పూర్తయి దోషులకు కఠిన శిక్షలు పడితేనేఈ మాదిరి అరాచకాలు ఆగుతాయి.


