కొట్టి చంపేసి.. బతికున్నట్టు నమ్మించే కిరాతకం | CBI files FIR in court in Saikrishna custodial death case | Sakshi
Sakshi News home page

కొట్టి చంపేసి.. బతికున్నట్టు నమ్మించే కిరాతకం

Oct 25 2026 5:16 AM | Updated on Oct 25 2026 5:16 AM

CBI files FIR in court in Saikrishna custodial death case

కాపు యువకుడు గాదె సాయికృష్ణ లాకప్‌ డెత్‌ కేసులో కోర్టుకు సీబీఐ ఎఫ్‌ఐఆర్

మేజిస్ట్రేట్‌ ఎదుట హాజరుపర్చకుండా కస్టడీలో పోలీసులు చిత్రవధ చేసి చంపేశారు 

ఏడుగురిపై కేసు.. సాక్ష్యాల విధ్వంసంపై తీవ్ర ఆరోపణలు 

సీసీటీవీ హార్డ్‌డిస్క్‌ల మార్పిడి.. ఫుటేజీ మాయం 

మృతదేహాన్ని దహనం చేసినట్టు ఎఫ్‌ఐఆర్‌లో ప్రస్తావన 

హైకోర్టు ఆదేశాలతో రంగంలోకి దిగిన సీబీఐ

కాపు యువకుడు గాదె సాయికృష్ణను మేజిస్ట్రేట్‌ ముందు హాజరు పరచకుండా పోలీసులు కస్టడీలో ఉంచి చిత్రవధ చేశారు. కొట్టి చంపేసిన తర్వాత కూడా సాయికృష్ణ సజీవంగానే ఉన్నాడని నమ్మించే కిరాతకానికి పాల్పడ్డారు. ఆ నేరాన్ని కప్పిపుచ్చుకునేందుకు సాక్ష్యాలను ధ్వంసం చేశారు. సీసీటీవీ హార్డ్‌డిస్క్‌లను మార్చేశారు. 18 నెలలకు సంబంధించిన సీసీ టీవీ ఫుటేజీ మాయం చేశారు. సాయికృష్ణ మృతదేహాన్ని దహనం చేసి తమకు ఏమి తెలియనట్లు వ్యవహరించారు.

విజయవాడ కృష్ణలంక పోలీస్‌స్టేషన్‌లో గాదె సాయికృష్ణ లాకప్‌ డెత్‌ కేసులో విజయవాడ కోర్టుకు సీబీఐ సమర్పించిన ప్రాథమిక దర్యాప్తు నివేదిక(ఎఫ్‌ఐఆర్‌) సారాంశం ఇదీ!

సాక్షి, అమరావతి: ‘కాపు యువకుడు గాదె సాయికృష్ణను మేజిస్ట్రేట్‌ ముందు హాజరుపరచకుండా పోలీసులు కస్టడీలో ఉంచి చిత్రవధ చేశారు. కొట్టి చంపేసిన తర్వాత కూడా సాయికృష్ణ సజీవంగానే ఉన్నాడని నమ్మించే కిరాతకానికి పాల్పడ్డారు. ఆ నేరాన్ని కప్పిపుచ్చుకునేందుకు సాక్ష్యాలను ధ్వంసం చేశారు.’అని విజయవాడ కోర్టుకు సీబీఐ సమర్పించిన ప్రాథమిక దర్యాప్తు నివేదిక(ఎఫ్‌ఐఆర్‌)లో స్పష్టం చేసింది.  గాదె సాయికృష్ణ లాకప్‌ డెత్‌పై హైకోర్టు ఆదేశాలతో రంగంలోకి దిగిన సీబీఐ ఈ నెల 22న ఆర్‌సీ 035/2026/ఎస్‌/0011 కింద ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది. సాయికృష్ణ తల్లి విజయలక్ష్మీ ఫిర్యాదుతో కృష్ణలంక పోలీస్‌స్టేషన్‌లో నమోదైన క్రై మ్‌ నంబర్‌ 107/2026 కేసు హైకోర్టు ఆదేశాల మేరకు సీబీఐకి బదిలీ అయిన నేపథ్యంలో అప్పటి సీఐ నాగరాజుతోపాటు మరో ఆరుగురిపై సీబీఐ కొత్తగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది. 

దీనిపై ఇప్పటికే సిట్‌ నుంచి సేకరించిన దర్యాప్తు వివరాలు, పలు ప్రాథమిక ఆధారాలను ప్రస్తావిస్తూ సీబీఐ విజయవాడ కోర్టుకు 102 పేజీలతో కూడిన ఎఫ్‌ఐఆర్‌లో అనేక అంశాలు ప్రస్తావించింది. సాయికృష్ణను విజ­యవాడ పోలీసులు తీసుకురావడం దగ్గర్నుంచి జరి గిన పరిణామాలు, విజయవాడ సీపీకి విజయలక్ష్మి రాసిన విన్నపం, కేసును సీబీఐకి అప్పగిస్తూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సీబీఐ ఎఫ్‌ఐఆర్‌లో సు­దీర్ఘంగా వివరించడంతోపాటు వాటికి సంబంధించిన రాతపూర్వక ఆధారాలను కూడా జత చేసింది.  

కొట్టి చంపి సాక్ష్యాలు లేకుండా చేశారు..
సాయికృష్ణను అక్రమంగా నిర్బంధించి పోలీసులు తీవ్రంగా కొట్టడం, అతడి మరణానికి కారణమైన పరిస్థితులు, మృతదేహం ఆచూకీ లేకుండా చేయడం, సాక్ష్యాలను ధ్వంసం చేయడం లాంటి తీవ్రమైన ఆరోపణలు ఈ కేసులో ఉన్నట్టు సీబీఐ పేర్కొంది. సీసీటీవీ హార్డ్‌డిస్క్‌లను మార్చడం, ఫుటేజీ అందుబాటులో లేకుండా చేయడం, సాయికృష్ణ మొబైల్‌ ఫోన్‌ను ఇతరుల ద్వారా వినియోగించడం లాంటి అంశాలను ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొంది. 

మేజిస్ట్రేట్‌ ఎదుట హాజరుపరచని పోలీసులు
మార్కాపురంలో ఉంటున్న సాయికృష్ణను 2026 మే 6న తెల్లవారుజామున సుమారు 3 గంటలకు పోలీ­సులు అదుపులోకి తీసుకున్నట్లు దర్యాప్తు వివరాలు వెల్లడిస్తున్నాయని సీబీఐ తెలిపింది. అదే రోజు ఉదయం 7 గంటలకు విజయవాడలోని కృష్ణలంక పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చి అక్కడి సిబ్బందికి అప్పగించారు. అనంతరం అతడి కస్టడీని అప్పటి స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్‌ ఎస్‌ఎస్‌వివి నాగరాజుకు అప్పగించినట్లు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొంది.

చట్టప్రకారం నిర్ణీత గడువులోగా సాయికృష్ణను సంబంధిత మేజిస్ట్రేట్‌ ఎదుట హాజరుపరచలేదని, పోలీసుల కస్టడీ నుంచి కూడా విడుదల చేయలేదని దర్యాప్తులో ప్రాథమికంగా వెల్లడైనట్లు ఎఫ్‌ఐఆర్‌లో ప్రస్తావించింది. పోలీస్‌­స్టేషన్‌లో ఉండగానే సాయికృష్ణపై దాడి చేసి కొట్టినట్టు విచారణ సందర్భంగా సాక్షుల వాంగ్మూలా­లు, ఇతర ఆధారాలు సూచిస్తున్నాయని పేర్కొంది. మే 8న పోలీస్‌స్టేషన్‌లోనే సాయికృష్ణను పరీక్షించిన ఆర్‌ఎంపీ వైద్యుడు అతడి శరీరంపై గాయాలు, వా­పులు ఉన్నాయని తెలిపినట్టు సీబీఐ ప్రస్తావించింది. 

సీసీటీవీ హార్డ్‌డిస్క్‌లు ఎందుకు మార్చారు?
ఈ కేసులో కృష్ణలంక పోలీస్‌స్టేషన్‌లోని సీసీటీవీ వ్యవస్థ అత్యంత కీలకమని సీబీఐ పేర్కొంది. స్టేషన్‌లోని నెట్‌వర్క్‌ వీడియో రికార్డర్‌ (ఎన్‌వీఆర్‌)లోని నాలుగు హార్డ్‌డిస్క్‌లను తొలగించి వాటి స్థానంలో వేరే డిస్క్‌లను అమర్చినట్లు దర్యాప్తులో వెల్లడైందని ఎఫ్‌ఐఆర్‌లో తెలిపింది. సీసీటీవీ వ్యవస్థను ఏర్పాటుచేసిన అధీకృత సంస్థ ఆ డిస్క్‌లను తాము సరఫరా చేయలేదని, వాటిని మార్చటానికి సంబంధించి తమ అనుమతితో ఎలాంటి పనులు జరగలేదని తెలిపినట్లు దర్యాప్తు వివరాలు వెల్లడిస్తున్నాయి. స్వాధీనం చేసుకున్న ఎన్‌వీఆర్‌లో సంబంధిత కాలానికి చెందిన ఫుటేజీతో పాటు అంతకుముందు 18 నెలల ఫుటేజీ కూడా అందుబాటులో లేదని ఫోరెన్సిక్‌ పరిశీలనలో గుర్తించారు. మే 6 నుంచి 9 వరకు సాయికృష్ణ పోలీస్‌స్టేషన్‌లో ఉన్న సమయానికి సంబంధించిన దృశ్యాలు లేకుండా చేయడానికే సాక్ష్యాలను మాయం చేశారని ప్రాథమికంగా నిర్ధారించినట్టు పేర్కొంది. 

బతికే ఉన్నట్లు నమ్మించే యత్నం..
సాయికృష్ణ చనిపోయిన తర్వాత కూడా అతడి మొ­బై­ల్‌ ఫోన్, సిమ్‌కార్డు వినియోగంపై దర్యాప్తులో కీల­క అంశాలు వెలుగులోకి వచ్చాయి. మరో వ్యక్తి సా­యికృష్ణ ఫోన్, సిమ్‌ను ఉపయోగించి గోవాలో వా­టిని యాక్టివేట్‌ చేసినట్లు సాక్షుల వాంగ్మూలాలు, కాల్‌ డేటా రికార్డులు (సీడీఆర్‌), టవర్‌ లొకేషన్‌ వివరాలు సూచిస్తున్నాయని ఎఫ్‌ఐఆర్‌లో సీబీఐ నివేదించింది. మే 30 నుంచి జూన్‌ 9 వరకు సాయికృష్ణ ఫోన్‌ను గోవాలో వినియోగించినట్లు దర్యాప్తులో గుర్తించా­రని, తద్వారా సాయికృష్ణ బతికే ఉన్నాడని, పరారీలో ఉన్నాడని నమ్మించే ప్రయత్నం జరిగింద­ని వెల్లడించింది. అతడి కుటుంబ సభ్యులను రాజీకి ఒప్పించేందుకు ఒత్తిడి చేయడం, బెదిరించడం లాంటి అంశాలనూ దర్యాప్తు అధికారులు ప్రస్తావించారు.

మృతదేహం దహనం చేసినట్లు ఆరోపణలు
సాయికృష్ణ మరణించిన తర్వాత మృతదేహాన్ని మా­యం చేశారనే ఆరోపణ ఈ కేసులో అత్యంత తీవ్రమైనది. ఈ కేసులో నాలుగో నిందితుడైన గులివిందల సురేష్‌ ఇచ్చినట్లు పేర్కొన్న వాంగ్మూలం ఆధారంగా మే 12న మధ్యాహ్నం 2 గంటల తర్వాత సాయికృష్ణ మరణించినట్లు, అనంతరం మృతదేహా­న్ని తరలించి పారవేయాలని అప్పటి సీఐ నాగరాజు ఆదేశించినట్లు దర్యాప్తు నివేదికలో ప్రస్తావించారు.

మే 12–13 మధ్య రాత్రి మృతదేహాన్ని విజయవాడలోని స్వర్గపురి శ్మశానవాటికకు తీసుకెళ్లి మే 13 అర్ధరాత్రి సుమారు 12.30 గంటల సమయంలో దహనం చేసినట్లు ఆరోపణలున్నాయి. సెప్టెంబర్‌ 18న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) సాయికృష్ణను దహనం చేసినట్టు చెబుతున్న ప్రాంతాన్ని పరిశీలించింది. అయితే ఇప్పటివరకు సాయికృష్ణ మృతదేహం, దానికి సంబంధించిన అవశేషాలు లభించలేదని దర్యాప్తు వివరాలను ప్రస్తావించింది. 

ఏడుగురు నిందితులు.. కీలకంగా మారిన ఆధారాలు
సీబీఐ దాఖలు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో అప్పటి కృష్ణలంక సీఐ ఎస్‌ఎస్‌వివి నాగరాజుతోపాటు ముగ్గురు హె­డ్‌ కానిస్టేబుళ్లు, కానిస్టేబుల్, హోంగార్డు, ఓ ప్రైవే­టు వ్యక్తిని నిందితులుగా చేర్చారు. అక్రమ నిర్బంధం, హత్య, నేరపూరిత కుట్ర, సాక్ష్యాల విధ్వంసం, ఎలక్ట్రానిక్‌ ఆధారాల తొలగింపు, ప్రభుత్వ ఆస్తికి నష్టం లాంటి ఆరోపణలకు సంబంధించి వివిధ సె­క్షన్ల కింద కేసు నమోదు చేశారు. 

భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్‌) 61(2), 305, 3(5), 103(1), 127(4), 127(6), 238, 316(5) సెక్షన్లతోపాటు ఐటీ యాక్ట్‌ 65, 66, పబ్లిక్, ప్రైవేట్‌ ఆస్తుల ధ్వంసం పరిరక్షణ యాక్ట్‌  కింద సీబీఐ కేసు నమోదు చేసింది. ఈ కేసులో అసలు సీసీటీవీ ఫుటేజీ ఏమైంది? సా­యికృష్ణ మృతదేహా­న్ని ఎక్కడికి తరలించారు? అత­డి ఫోన్‌ను ఎవరు, ఎందుకు వినియోగించారు? పోలీ­స్‌­స్టేషన్‌లో అతడిని ఎవరు చూశారు? సాయికృష్ణ లాకప్‌ డెత్‌ విషయం ఉన్నతాధికారులకు వాస్తవాలు ఎప్పుడు తెలిశాయి? తదితర పలు కీలక ప్రశ్నలకు సీబీఐ దర్యాప్తులో సమాధానాలు లభించాల్సి ఉంది.

సాయికృష్ణ కేసులో సీబీఐ దూకుడు
రెండో రోజు కృష్ణలంక పోలీస్‌స్టేషన్‌లో విచారణ
సాక్షి ప్రతినిధి, విజయవాడ: కాపు యువకుడు గాదె సాయికృష్ణ కస్టోడియల్‌ టార్చర్‌.. లాకప్‌డెత్‌.. మృతదేహాన్ని మాయం చేసిన కేసులో సీబీఐ దూకుడు పెంచింది. ఈ నెల 22న పలు సెక్షన్‌లతో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిన సీబీఐ అధికారులు 23న విజయవాడ చేరుకున్నారు. సీబీఐ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో సైతం నాటి కృష్ణలంక సీఐ నాగరాజును ఏ 1గా పేర్కొంది. మిగిలిన వారిపై కూడా ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది. సాయికృష్ణ తల్లి గతంలో పోలీస్‌ కమిషనర్, కృష్ణలంక పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులు.. హైకోర్టు ఆదేశాలను పరిగణనలోకి తీసుకుని దర్యాప్తు ముమ్మరం చేసింది. 

సీబీఐ హైదరాబాద్‌ అడిషనల్‌ ఎస్పీ నరేందర్‌దేవ్‌ ఆధ్వర్యంలోని బృందం రెండో రోజు కృష్ణలంక పోలీసుస్టేషన్‌లో విచారణ నిర్వహించింది. మార్కాపురం నుంచి సాయికృష్ణను ఎప్పుడు స్టేషన్‌కు తెచ్చారు? ఎందుకు? ఎక్కడ ఉంచారు? ఎన్ని రోజులు? ఎవరికి అప్పగించారు? ఏ అంతస్తులో ఉంచి థర్డ్‌ డిగ్రీ ప్రయోగించారు? లాంటి అంశాలపై క్షుణ్ణంగా విచారిస్తోంది. సాయికృష్ణను లాకప్‌లో తీవ్రంగా కొట్టిన తర్వాత అపస్మారక స్థితికి చేరుకున్న సమయంలో వారధి సమీపంలోని పాడుబడిన భవనంలోకి తీసుకెళ్లినట్లు సిట్‌ తన చార్జ్‌షీట్‌లో పేర్కొంది. ఈ నేపథ్యంలో సీబీఐ బృందంతో పాటు ఫోరెన్సిక్‌ నిపుణులు అక్కడకు చేరుకుని శాంపిల్స్‌ సేకరించినట్లు తెలిసింది.

దాదాపు రెండు గంటలపాటు భవనం పరిసరాలను శోధించి ఆధారాల కోసం గాలించారు. పాడుబడిన భవనాన్ని పరిశీలించిన అనంతరం సీబీఐ బృందం తిరిగి కృష్ణలంక స్టేషన్‌కు చేరుకుని రాత్రి 8.30 గంటల వరకు అన్ని ఫ్లోర్లను నిశితంగా అన్వేషించినట్లు తెలిసింది. స్టేషన్‌లో కొన్ని రికార్డులను సీబీఐ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. అయితే సిబ్బందిని ఎవరినీ విచారించలేదని తెలిసింది. కాగా సాయికృష్ణ కేసును విచారించిన సిట్‌ అధికారులు శనివారం స్వర్గపురి వద్దకు చేరుకుని ఆదివారం సీబీఐ అధికారులు అక్కడకు వస్తారని సమాచారం ఇచ్చినట్లు తెలిసింది.

ఆ  అధికారుల్లో ఆందోళన!
దేశవ్యాప్తంగా పెను సంచనలం సృష్టించిన గాదె సాయికృష్ణ కస్టోడియల్‌ డెత్‌ కేసు విచారణను సీబీఐ ముమ్మరం చేయడంతో ఈ ఘట­నతో ప్రమేయం ఉన్న కొందరు పోలీసు అధి­కా­రుల్లో ఆందోళన మొదలైంది. సాయికృష్ణను ఎందుకు తీసుకొచ్చారు? ప్రాణాలు పోయేలా  ఎందుకు హింసించారు? అనే విషయాలను ఇన్నాళ్లుగా సిట్‌ తేల్చలేదు. 

సాయికృష్ణ పోలీ­సు­ల దెబ్బలతో మరణించాడని మాత్రమే తేల్చింది. ఎందు­కు అంతలా కొట్టారో సిట్‌ వెల్లడించలేదు. ఈ నేపథ్యంలో ఏడుగురు నిందితులతో పాటు మరికొందరిని సీబీఐ చేర్చుతుందా? సాయికృష్ణ డెడ్‌బాడీని గుట్టుగా దహనం చేయాలనే ఆలోచన ఎవరిది? ఉన్నతాధికారులకు తెలిసే చేశారా? సాయికృష్ణను తేవడంలో ఇతరుల పాత్ర ఉందా? లాంటి అంశాలపై సీబీఐ దృష్టిసారిస్తే కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement