హరిద్వార్: పవిత్ర గంగానది నీరు అద్దంలా స్వచ్ఛంగా, అడుగున ఉన్న రాతి పలకలు సైతం కనిపించేంత నిర్మలంగా మారింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అర్ధ కుంభమేళా నేపథ్యంలో చేపట్టిన భారీ పారిశుద్ధ్య కార్యక్రమం తర్వాత ఈ దృశ్యాలు కనిపించడం విశేషంగా మారింది. అర్ధ కుంభమేళాకు ముందు గంగానది పరిసరాలను శుభ్రం చేసేందుకు అధికారులు భారీ కార్యక్రమం చేపట్టారు. ఇందులో భాగంగా సుమారు 10 కిలోమీటర్ల మేర నదిలో పేరుకుపోయిన దాదాపు 150 మెట్రిక్ టన్నుల వ్యర్థాలను కార్మికులు, స్వచ్ఛంద కార్యకర్తలు తొలగించారు.
20 రోజుల పాటు కాలువ మూసివేత
హరిద్వార్‌లోని కాలువను సుమారు 20 రోజుల పాటు మూసివేయడంతో నదీ గర్భంలో పేరుకుపోయిన బురద, ప్లాస్టిక్, పాత దుస్తులు, పూజా సామగ్రి బయటపడ్డాయి. హర్ కీ పౌరీ వంటి ప్రముఖ ఘాట్ల వద్ద భారీగా చెత్త పేరుకుపోయినట్లు గుర్తించారు. దీంతో పలువురు స్వచ్ఛందంగా ముందుకొచ్చి పారిశుద్ధ్య కార్యక్రమంలో పాల్గొన్నారు. శుభ్రత కార్యక్రమం పూర్తయి తిరిగి నీరు ప్రవహించడంతో హరిద్వార్ ఎగువ ప్రాంతంలో అద్భుతమైన దృశ్యాలు కనిపించాయి. నీరు ఎంతో పారదర్శకంగా ఉండటంతో నదిలో అడుగున ఉన్న రాతి పలకలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ దృశ్యాలను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వేలాది మంది వీక్షించారు. వందలాది మంది స్పందించారు.
🚨 Visuals of crystal-clear water flowing through the Ganga in Haridwar, Uttarakhand. https://t.co/sp6xV0eerJ
— Indian Tech & Infra (@IndianTechGuide) November 13, 2026
నెటిజన్ల ప్రశంసలు.. ప్రశ్నలు
గంగానది స్వచ్ఛతను చూసి పలువురు అధికారులను అభినందిస్తున్నారు. మళ్లీ నదిలో చెత్త వేయకుండా ప్రజలు బాధ్యతగా వ్యవహరించాలని సూచిస్తున్నారు. స్నానాల తర్వాత పాత దుస్తులు, పూజా సామగ్రిని నదిలో వేయకుండా చెత్తబుట్టల్లో వేయాలని కోరుతున్నారు. అయితే వీడియోలో కనిపిస్తున్నది సహజంగా ప్రవహించే ప్రధాన గంగానది కాదని, కాంక్రీటుతో నిర్మించిన కాలువ మార్గమని కొందరు నెటిజన్లు అభిప్రాయపడ్డారు. నీరు పారదర్శకంగా ఉండటమే స్వచ్ఛతకు కొలమానం కాదని, మురుగునీరు, రసాయన వ్యర్థాల కాలుష్యాన్ని అరికట్టడం ముఖ్యమని మరికొందరు పేర్కొన్నారు.
ఇదీ చదవండి: మహదేవ్ యాప్: ఆరు రాష్ట్రాల్లో సీబీఐ మెరుపు దాడులు!


