వర్షపు నీటిని ఒడిసిపట్టండి | Catch the Rain: India push to secure its water future | Sakshi
Sakshi News home page

వర్షపు నీటిని ఒడిసిపట్టండి

Oct 27 2026 6:16 AM | Updated on Oct 27 2026 6:16 AM

Catch the Rain: India push to secure its water future

జల సంరక్షణలో ‘క్యాచ్‌ ద రెయిన్‌’ కీలక అడుగు 

భూగర్భ జలాల పెంపునకూ ప్రత్యేక కార్యాచరణ 

ప్రభుత్వ పథకాలతో జల వనరుల పునరుద్ధరణ 

వివరాలు వెల్లడించిన కేంద్రం

సాక్షి, న్యూఢిల్లీ: వర్షపు నీటిని వృథా కాకుండా ఒడిసిపట్టడం, భూగర్భ జలాలను పెంపొందించడం, చెరువులు, బావులు వంటి సంప్రదాయ జల వనరులను పునరుద్ధరించడం లక్ష్యంగా ‘క్యాచ్‌ ద రెయిన్‌’(వర్షపు నీటిని ఒడిసిపట్టండి)ను అమలు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. నీటి సంరక్షణను ప్రజా ఉద్యమంగా మార్చడంతో పాటు, గ్రామీణ ప్రాంతాల్లో జల భద్రతను బలోపేతం చేయడంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు వెల్లడించింది. ఈ మేరకు ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో (పీఐబీ) సోమవారం ఒక సవివర ప్రకటన విడుదల చేసింది. ఇందులో ప్రచార లక్ష్యాలు, పురోగతిని వివరించింది. 

నీటి లభ్యతను పెంచాలి 
నీటి లభ్యతను పెంచే లక్ష్యంలో భాగంగా ఇళ్లు, అపార్ట్‌మెంట్లు, కార్యాలయాల్లో వర్షపు నీటి సేకరణ వ్యవస్థలను ఏర్పాటు చేయడం, అనువైన ప్రాంతాల్లో ఇంకుడు గుంతలు, షాఫ్ట్‌లు నిర్మించడం, నిరుపయోగంగా ఉన్న బోర్లను పునరుద్ధరించడం వంటి చర్యలను యంత్రాంగం చేపట్టినట్లు పీఐబీ తెలిపింది. చెరువులు, జలాశయాల్లో పూడిక తొలగించడం, పాత బావులు, బావడీలను పునరుద్ధరించడం, నీటి నిల్వ ప్రాంతాల్లో మొక్కలు నాటడం ద్వారా నీటి లభ్యతను పెంచుతున్నట్లు తెలిపింది. 

1.55 కోట్లకు పైగా నిర్మాణాలు 
జల సంచయ్‌ జన్‌ భాగీదారి (జేఎస్‌జేబీ) కార్యక్రమం కింద దేశవ్యాప్తంగా 1.55 కోట్లకు పైగా కృత్రిమ భూగర్భ జలాల రీఛార్జ్, నీటి నిల్వ నిర్మాణాలు చేపట్టినట్లు పీఐబీ వెల్లడించింది. ఈ కార్యక్రమం తొలి దశలో 23 లక్షల నిర్మాణాలపై ప్రభావ అంచనా అధ్యయనం నిర్వహించారు. 2025 జూన్‌ 1 నుంచి డిసెంబరు 31 వరకు నమోదైన వర్షపాత సమాచారాన్ని ఆధారంగా చేసుకున్న ఈ అధ్యయనం ప్రకారం, చేపట్టిన చర్యల ద్వారా 243 కోట్ల ఘనపు మీటర్ల భూగర్భ జలాల రీఛార్జ్‌ జరిగినట్లు అంచనా వేశారు. 2024 ఏప్రిల్‌ 1 నుంచి 2025 మే 31 వరకు అమలైన జేఎస్‌జేబీ తొలి దశలో ప్రజల భాగస్వామ్యం, కార్పొరేట్‌ సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్‌), వ్యయ నిర్వహణకు ప్రాధాన్యం ఇచ్చారు. తక్కువ ఖర్చుతో జల వనరుల అభివృద్ధి, నిరుపయోగ బోర్ల పునరుద్ధరణకు చర్యలు చేపట్టారు. 2025 జూన్‌ 1న ప్రారంభమైన రెండో దశలో భూగర్భ జలాలను అధికంగా వినియోగిస్తున్న, కీలకంగా గుర్తించిన జిల్లాలపై దృష్టి సారించారు. 

ప్రజా భాగస్వామ్యమే కీలకం 
2026 జూన్‌ 1న ప్రారంభించిన జేఎస్‌జేబీ–క్యాచ్‌ ద రెయిన్‌ కార్యక్రమం ద్వారా జలశక్తి అభియాన్‌ను మరింత విస్తరించారు. వ్యవసాయం, జల వనరుల పునరుద్ధరణ, అటవీ అభివృద్ధి తదితర పథకాల సమన్వయంతో నీటి సంరక్షణ పనులు చేపడుతున్నారు. గ్రామ పంచాయతీలు, పట్టణ స్థానిక సంస్థలు, మహిళా సంఘాలు, యువత, విద్యాసంస్థలు, స్వచ్ఛంద సంస్థలను ఇందులో భాగస్వాములను చేస్తున్నారు. కార్యక్రమాల పర్యవేక్షణ, పారదర్శకత, ప్రజల అభిప్రాయాల సేకరణకు ప్రత్యేక పోర్టల్, మొబైల్‌ యాప్‌ను వినియోగిస్తున్నారు.

2021 మార్చి 22న ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా ప్రారంభమైన జలశక్తి అభియాన్‌కు ‘వర్షం పడే చోట, పడే సమయంలోనే నీటిని ఒడిసిపట్టండి’అనేది ప్రధాన నినాదం. 2024లో ‘నారీ శక్తి సే జల్‌ శక్తి’ఇతివృత్తంతో మహిళల భాగస్వామ్యానికి ప్రాధాన్యం ఇచ్చారు. జిల్లాస్థాయిలోని జలశక్తి కేంద్రాలు ప్రజలకు సాంకేతిక మార్గదర్శకత్వం, నీటి సంరక్షణ ప్రణాళికల రూపకల్పనలో సహకరిస్తున్నాయి. ప్రజల భాగస్వామ్యం, శాస్త్రీయ ప్రణాళిక, పథకాల సమన్వయంతో నీటి భద్రతను పెంపొందించి, వాతావరణ మార్పులను ఎదుర్కొనే సామర్థ్యాన్ని బలోపేతం చేయడమే ఈ కార్యక్రమాల ప్రధాన లక్ష్యమని పీఐబీ వివరించింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement