చెరువులకు బతుకునిచ్చెనమ్మా | flowers used in Batukamma have a great quality of purifying water | Sakshi
Sakshi News home page

చెరువులకు బతుకునిచ్చెనమ్మా

Oct 12 2026 4:53 AM | Updated on Oct 12 2026 4:53 AM

flowers used in Batukamma have a great quality of purifying water

బతుకమ్మల వెనుక సైన్స్‌

వివిధ రకాల పూల నిమజ్జనంతో నీటి శుద్ధి

నీటిలోని కాలుష్యాన్ని తగ్గిస్తున్న తంగేడు 

గునుగు, బంతి పూలలో యాంటీ బయాటిక్‌ గుణాలు

ప్లాస్టిక్‌ పూలు వాడకం మంచిది కాదంటున్న నిపుణులు

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ సంస్కృతికి ప్రతీకైన బతుకమ్మ పండుగ కేవలం వేడుక మాత్రమే కాదని, దీని వెనుక అద్భుతమైన సైన్స్‌ ఉందని ‘జర్నల్‌ ఆఫ్‌ ఫార్మాస్యూటికల్‌ అడ్వాన్స్‌డ్‌ రీసెర్చ్‌’ అధ్యయనం స్పష్టం చేసింది. వర్షాకాలం ముగిసిన తర్వాత చెరువుల్లో నిమజ్జనం చేసే రకరకాల పూలతో కూడిన గుత్తులు బురద, బ్యాక్టీరియాతో నిండిన నీటిని శుద్ధి చేస్తాయని, పర్యావరణం మెరుగు పడుతుందని పరిశోధకులు నిరూపించారు. తంగేడు, గునుగు, సీతజడ, రుద్రాక్ష పూలను పేర్చి బతుకమ్మను తీర్చిదిద్దుతారనే సంగతి తెలిసిందే.

నీటి ద్వారా వచ్చే వ్యాధుల నివారణ
బతుకమ్మ పూలపై కె.సుధీర్‌కుమార్, ఎన్‌.రవీంద్ర, ఎస్‌.సీతారామస్వామిల పరిశోధన ‘ట్రెడిషనల్‌ అండ్‌ మెడిసినల్‌ సీక్రెట్స్‌ ఆఫ్‌ బతుకమ్మ: ది ఫ్లోరల్‌ ఫెస్టివల్‌ ఆఫ్‌ తెలంగాణ’ పేరిట ఆ పత్రికలో ప్రచురితమయ్యింది. బతుకమ్మ కేవలం ఒక సాంస్కృతిక లేదా ఆధ్యాత్మిక ఆచారం మాత్రమే కాకుండా, ప్రజా ఆరోగ్య పరిరక్షణకు ఉపకరించే ఒక పర్యావరణ హిత చర్య అని ఈ అధ్యయనం స్పష్టం చేసింది.

వర్షాకాలం ముగిసే సమయానికి నీటి కాలుష్యం ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో నిమజ్జనం చేసే పూలు సహజ ఫైటోకెమికల్స్‌ను విడుదల చేసి, హానికారక బ్యాక్టీరియాను తగ్గించి, సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా కాపాడుతాయని పేర్కొంది.

తంగేడు: తంగేడు పూలు (కాసియా అరిక్యులేట) ఆయు­ర్వేదంలో ఓ ఔషధం. ఈ పూలు నీటిలోని కాలుష్యా­న్ని తగ్గించి, పీహెచ్‌ (నీటిలోని హైడ్రోజెన్‌ అయాన్ల సాంద్రతను దీంతో లెక్కిస్తారు)ను సమతూకం చేస్తాయి. నీటిలో ఉండే టానిన్స్, ఫ్లవనాయిడ్స్‌.. టైఫాయిడ్‌ కారక బ్యాక్టీరియాను నిరోధిస్తాయి. ఇది రక్తశుద్ధి, మధుమేహ నివారణ వంటి అంతర్గత ఔషధ గుణాలు కలిగి ఉండటంతో పాటు, నిమజ్జన నీటిలో సహజ బయోమాస్‌గా పనిచేస్తుంది.

గునుగు: గునుగు పూలు (సెలోసియా) అగ్ని ఎరుపు లేదా వెండి రంగులో ఉంటాయి. తీవ్రమైన వాపును తగ్గించే గుణం దీనికి ఉంది. విరేచనాలు, కడుపునొప్పి నివారణకు ఉపయోగిస్తారు. గుమ్మడి, వాము పూలు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. 

బంతి, చామంతి: ఇవి సహజ క్రిమిసంహారక, సూక్ష్మజీవ నాశక గుణాలు కలిగి ఉంటాయి. యాంటీసెప్టిక్‌గా ఉపయోగ పడటంతో గాయాలు మానతాయి. చామంతి శరీరంలో వేడిని తగ్గించి చలువ చేసే గుణం కలిగి ఉంటుంది, శరీరంలో వాపును నియంత్రిస్తుంది. ఇక గుమ్మడి పువ్వులో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. రోగనిరోధక శక్తిని పెంచడానికి, శ్వాసకోశ సమస్యలకు వ్యతిరేకంగా పనిచేస్తుంది.

బతుకమ్మలను బురద గుంటల్లో వేయొద్దు
తంగేడు, గునుగు, బంతి తదితర పూలు సమష్టిగా చెరువుల్లోని హానికారక సూక్ష్మ జీవుల ప్రభావాన్ని తగ్గిస్తాయనేది వాస్తవం. అయితే ఇటీవలి కాలంలో ప్లాస్టిక్‌ పూలు ఉపయోగించి బతుకమ్మలను పేరుస్తున్నారు. వాటినే చెరువుల్లో నిమజ్జనం చేస్తున్నారు. ఇదెంత మాత్రం మంచిది కాదు. ప్లాస్టిక్‌ నీటిని కలుషితం చేస్తుంది. అలాగే సహజ సిద్ధమైన పూలను కూడా నీరు తక్కువగా ఉండే బురద గుంటల్లో వేయకూడదు. దీనివల్ల పూలు కుళ్లిపోయి మేలు జరగకుండా నష్టం జరుగుతుంది. 
– డాక్టర్‌ ఎస్‌.వెంకట మోహన్‌ (సీనియర్‌ సైంటిస్ట్, డైరెక్టర్‌ సీఎస్‌ఐఆర్, ఎన్‌ఈఈఆర్‌ఐ) 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement