ప్రభుత్వ వెబ్‌ సైట్‌లో అశ్లీల కంటెంట్‌ | Obscene Content on Government Website: Telangana | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ వెబ్‌ సైట్‌లో అశ్లీల కంటెంట్‌

Nov 27 2026 1:03 AM | Updated on Nov 27 2026 1:03 AM

Obscene Content on Government Website: Telangana

భూగర్భ జలశాఖ పోర్టల్‌ను హ్యాక్‌ చేసిన సైబర్‌ నేరగాళ్లు 

పోర్న్‌ వెబ్‌సైట్‌తో అనుసంధానం 

గత ఆరు నెలలుగా పనిచేయని ప్రధాన వెబ్‌సైట్‌

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర భూగర్భ జలశాఖ అధికారిక వెబ్‌సైట్‌ (https://gwrms. telangana.gov.in) ను సైబర్‌ నేరగాళ్లు హ్యాక్‌ చేశారు. దానిని ఏకంగా ’ఓన్లీ ఫ్యాన్స్‌’ అనే అశ్లీల వెబ్‌సైట్‌కు అనుసంధానం చేశారు. ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో ప్రస్తుతం రాష్ట్రం అంతటా భూగర్భ జలమట్టాలు ఆందోళనకర స్థాయిలో పడిపోయాయి.

తమ జిల్లా, మండలంలో భూగర్భ జలాల స్థితిగతులు తెలుసుకోవడానికి లేదా బోరుబావుల తవ్వకాలకు అనుమతుల కోసం ప్రజలు, రైతులు, పరిశ్రమల నిర్వాహకులు ఈ కీలక ప్రభుత్వ పోర్టల్‌ను నిత్యం ఉపయోగిస్తుంటారు. ఇప్పుడు దీనిని తెరిచేందుకు ప్రయతి్నస్తే పోర్న్‌ వెబ్‌సైట్‌కు సంబంధించిన లింకులు, అశ్లీల కంటెంట్‌ దర్శనమిస్తుండటంతో వారు విస్తుపోతున్నారు.  

గూగుల్‌ సెర్చ్‌లో విస్తుపోయే దృశ్యాలు 
తెలంగాణ భూగర్భ జల నియంత్రణ, నిర్వహణ వ్యవస్థ (టీజీ–జీడబ్ల్యూఆర్‌ఎంఎస్‌) పోర్టల్‌కు సంబంధించిన వెబ్‌సైట్‌ కోసం గూగుల్‌లో శోధించినప్పుడు ఈ విషయం బయటపడింది. ‘తెలంగాణ స్టేట్‌ పోర్టల్‌’పేరు కింద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అధికారిక డొమైన్‌ ( telangana.gov.in ) పరిధిలోని సబ్‌డొమైన్‌ ( gwrms) నేమ్‌తో వెబ్‌సైట్‌ (https://gwrms. telangana.gov.in) లింక్‌ కనిపిస్తుండగా, దాని కింద ‘ఓన్లీ ఫ్యాన్స్‌’అనే పోర్న్‌ వెబ్‌సైట్‌ శీర్షిక కనిపిస్తోంది.

భూగర్భ జలశాఖ పోర్టల్‌ అనుకుని లింక్‌ను తెరిస్తే అశ్లీల కంటెంట్‌ దర్శనమిస్తుండటంపై నెటిజన్లు సోషల్‌ మీడియా వేదికగా తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. 

పునరుద్ధరణ ఎప్పుడో? 
వాస్తవానికి రాష్ట్ర భూగర్భ జలశాఖ ప్రధాన వెబ్‌సైట్‌ (https://gwd.telangana.gov.in/) గత కొన్ని నెలలుగా పనిచేయడం లేదు. మరోవైపు,  https://gwrms.telangana.gov.in వెబ్‌సైట్‌ను దాదాపుగా ఆరు నెలల కింద సైబర్‌ నేరస్తులు హ్యాక్‌ చేసి పోర్న్‌ వెబ్‌సైట్‌కు రీడైరెక్ట్‌ చేశారు. సుదీర్ఘ కాలంగా పోర్టల్‌ సేవలు నిలిచిపోయినా శాఖ ఉన్నతాధికారులు కనీస చర్యలు తీసుకోవడం లేదు.

వెబ్‌సైట్‌ నిర్వహణలో కనీస భద్రతా ప్రమాణాలు పాటించక పోవడంతోనే సైబర్‌ నేరగాళ్లు ఈ పోర్టల్‌ను సులభంగా హ్యాక్‌ చేసి, అశ్లీల సైట్లకు అనుసంధానం చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్‌ హ్యాకింగ్‌కు గురై, పోర్న్‌ సైట్‌ వివరాలు బహిరంగంగా కనిపిస్తున్నా సంబంధిత శాఖ అధికారులు, ఐటీ శాఖ స్పందించకపోవడంపై విమర్శ లు వ్యక్తమవుతున్నాయి. గతంలో దక్షిణ తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ(టీజీఎస్పీడీసీఎల్‌) వెబ్‌సైట్‌ను సైతం సైబర్‌ నేరస్తులు హ్యాక్‌ చేసి సర్వర్‌ నుంచి మొత్తం డేటాను దొంగిలించారు. డేటాను తిరిగి ఇచ్చేందుకు భారీగా డబ్బును డిమాండ్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement