ఒక్కొక్కరికి రూ.2 వేల జరిమానా విధించిన హైకోర్టు
హోంశాఖ ముఖ్య కార్యదర్శిపై ధిక్కరణ కేసు మూసివేత
సాక్షి, హైదరాబాద్: తాము ఇచ్చిన ఉత్తర్వులను ఉద్దేశపూర్వకంగా అమలు చేయనందుకు సైబరాబాద్ పోలీసు కమిషనర్ ఎం.రమేశ్, మేడ్చల్ జోన్ డీసీపీ ఎన్.కోటిరెడ్డికి హైకోర్టు రెండు వారాల జైలు శిక్ష విధించింది. అలాగే, రూ.2 వేల చొప్పున జరిమానా విధించింది. జరిమానా చెల్లించకపోతే మరో వారం జైలు శిక్ష అనుభవించాలని ఆదేశించింది. దీనిపై అప్పీల్ చేసుకునేందుకు వీలుగా శిక్షను వారం రోజులు నిలిపివేసింది.
ఆలోగా అప్పీల్ చేసుకోకపోతే.. హైకోర్టు రిజిస్ట్రార్ (జ్యుడీషియల్–1) ఎదుట లొంగిపోయి శిక్ష అనుభవించాలని స్పష్టం చేసింది. ప్రకాశం జిల్లాకు చెందిన ఎ.ప్రవీణ్ జీడిమెట్ల గ్రామ పరిధిలోని 6–15 ఎకరాల భూమికి సంబంధించి 2022, అక్టోబర్ 20న హర్షవర్ధన్ ప్రసాద్‌తో విక్రయ ఒప్పందం చేసుకున్నారు. భూమిని రిజి్రస్టేషన్ చేయడానికి ఆయన ముందుకు రాకపోవడంతో ప్రవీణ్ సివిల్ కోర్టును ఆశ్రయించారు.
ఈ కేసు విచారణ సాగుతుండగానే, పోలీసులు జోక్యం చేసుకుంటున్నారంటూ ప్రవీణ్ హైకోర్టును ఆశ్రయించారు. విచారణ చేపట్టిన న్యాయమూర్తి.. సివిల్ వివాదాల్లో జోక్యం చేసుకోవద్దని పోలీసులను ఆదేశించారు. రక్షణ కోసం పిటిషనర్ దరఖాస్తు చేసుకోవచ్చని, దానిపై చర్యలు తీసుకోవాలని సీపీని ఆదేశించింది. సైబరాబాద్ పోలీసు కమిషనర్‌కు, హోంశాఖ ముఖ్య కార్యదర్శికి వినతిపత్రాలు సమర్పించినా.. ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ సీవీ భాస్కర్‌రెడ్డి ధర్మాసనం గురువారం మరోసారి విచారణ చేపట్టింది.
లాంఛనప్రాయ క్షమాపణతో తప్పించుకోలేరు..
సివిల్ కేసులు పెండింగ్‌లో ఉన్నాయన్న కారణం హైకోర్టు ఇచ్చిన నిర్దిష్ట ఆదేశాలను అమలు చేయకపోవడానికి సమర్థన కాబోదని న్యాయమూర్తి స్పష్టం చేశారు. శాంతిభద్రతల సమస్య తలెత్తుతుందన్న ఆందోళన ఉంటే పోలీసులు చట్టప్రకారం ముందస్తు చర్యలు తీసుకోవచ్చని, అయితే ఆ కారణంతో న్యాయస్థానాల ఆదేశాలను పక్కనపెట్టడానికి వీల్లేదన్నారు.
దర్యాప్తును అడ్డుపెట్టుకొని సివిల్ వివాదంలో జోక్యం చేసుకోవడం, న్యాయస్థానాల ఉత్తర్వులకు విరుద్ధంగా వ్యవహరించడం అనుమతించబోమని పేర్కొన్నారు. సీపీ, డీసీపీల వైఖరి ఉద్దేశపూర్వక కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందని తేల్చారు. వారు క్షమాపణకు సిద్ధంగా ఉన్నా.. నిజమైన పశ్చాత్తాపం లేని లాంఛనప్రాయ క్షమాపణతో కోర్టు ధిక్కరణ పరిణామాల నుంచి తప్పించుకోలేరన్నారు. కాగా, హోంశాఖ ముఖ్య కార్యదర్శిపై మాత్రం కోర్టు ధిక్కరణ ఆరోపణలు నిరూపితం కాలేదంటూ కేసును మూసివేశారు.


