అగ్రి వర్సిటీ క్వార్టర్స్ ఖాళీ చేయని ఐపీఎస్‌లు
8 ఏళ్లుగా అద్దెలు, కరెంట్ బిల్లులు చెల్లించని అధికారులు
వేరే జిల్లాలో పోస్టింగ్‌లో ఉన్నా సరే ఖాళీ చేయని వైనం
ఇంటీరియర్‌కు ఏకంగా రూ.30 లక్షలు ఖర్చు చేసిన ఓ అధికారి
తాజాగా బాలికల హాస్టల్స్ కోసం వీటిని కేటాయించిన వీసీ
ఖాళీ చేయాలని కోరుతూ నోటీసులు పంపించినా స్పందన శూన్యం
ప్రిన్సిపల్ సెక్రటరీ, డీజీపీలకు లేఖ రాసిన వీసీ
సాక్షి, హైదరాబాద్: వారు పోలీసు ఉన్నతాధికారులు...రాజేంద్రనగర్‌లోని ప్రొ.జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలోని ఆఫీస్ క్వార్టర్లలో నివాసముంటున్నారు. ఏకంగా ఎనిమిదేళ్లుగా నలుగురు ఐపీఎస్‌లు వాటిని వినియోగిస్తున్నారు. ప్రభుత్వం నుంచి నిబంధనల ప్రకారం హెచ్‌ఆర్‌ఏ పొందుతున్నప్పటికీ వర్సిటీకి చిల్లిగవ్వ కూడా అద్దె చెల్లించడం లేదు. కరెంట్ బిల్లులు, వాటర్ బిల్లులు కూడా బకాయిపడ్డారు. ఇతర జిల్లాలకు బదిలీపై వెళ్లినా కూడా ఇక్కడ క్వార్టర్లు ఖాళీ చేయకుండా గడుపుతున్నారు.
వీటిని వీకెండ్ హోమ్స్‌గా, కుటుంబ, బంధువుల విలాసాల కోసం వినియోగిస్తుండటం గమనార్హం. వీటిల్లో సన్‌ప్రీత్ సింగ్, సైబరాబాద్ జాయింట్ కమిషనర్, ట్రాఫిక్ (ప్రొఫెసర్ క్వార్టర్ నం–బీ2), సునీల్ దత్తు, కమిషనర్, ఖమ్మం (యూనివర్సిటీ ఆఫీసర్స్ క్వార్టర్ నం–2), ఆర్ జగదీశ్వర్ రెడ్డి, ఎస్పీ, ట్రాన్స్‌కో (యూనివర్సిటీ ఆఫీసర్స్ క్వార్టర్ నం–3), పీ సాయి చైతన్య, కమిషనర్, నిజామాబాద్ (టైప్ 6–2) ఉంటున్నారు.
కాగా, కొడంగల్ ప్రాంతంలో బాలికల వ్యవసాయ కాలేజీ, వసతి గృహాల కోసం భవనాలు అద్దెకు దొరక్కపోవడంతో సీఎం ఆదేశాలతో వర్సిటీలోనే వారికి సౌకర్యం కల్పించాలని తాజాగా అధికారులు నిర్ణయించారు. దీంతో క్వార్టర్స్‌లో నివాసముంటున్న నలుగురు ఐపీఎస్‌లకు నోటీసులు ఇచ్చినా ఖాళీ చేయకపోవడం, స్పందించకపోవడంతో ప్రస్తుతం ఈ విషయం తీవ్ర చర్చనీయాంశమైంది.
వీరికెందుకు కేటాయించారో...అంతుచిక్కని రహస్యం?
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అప్పటి వీసీ డాక్టర్ వీ.ప్రవీణ్ రావు వర్సిటీలో డీన్, డైరెక్టర్ పోస్ట్‌లను భర్తీ చేయలేదు. దీంతో ఆయా ఆఫీసర్ల క్వార్టర్స్ ఖాళీగా ఉన్నాయి. దీంతో 2018–19 సమయంలో ఐపీఎస్‌లు అడిగారో లేక తన సొంత నిర్ణయమో తెలియదు గానీ నలుగురు పోలీసు అధికారులకు వర్సిటీ ఆఫీసర్ల క్వార్టర్స్‌ను కేటాయించారు. ఆ తర్వాత డాక్టర్ ఎస్.రఘునందన్ రెడ్డి ఇన్‌చార్జీ వీసీగా ఉన్న 2022 సమయంలో ఈ నలుగురితో సహా మరో ఇద్దరికి క్వార్టర్స్‌ను కేటాయించారు. ఆయా అధికారులు ఈ క్వార్టర్స్ వర్సిటీ అనుమతులు లేకుండా లోపలి గోడలను కూల్చేసి పనివాళ్ల కోసం ప్రత్యేక గదులను నిర్మించారు.
ఓ ఆఫీసర్ అయితే ఏకంగా రూ.20–30 లక్షలు ఖర్చు చేసి సొంతింటి లాగా ఇంటీరియర్ చేయించుకోవడం కొసమెరుపు. 2022 అక్టోబర్‌లో ప్రొఫెసర్ అల్దాస్ జానయ్య వీసీగా నియమితులైన తర్వాత కొన్నేళ్లుగా ఖాళీగా ఉన్న డీన్, డైరెక్టర్ పోస్ట్‌లను భర్తీ చేశారు. దీంతో ఆయా ఆఫీసర్లకు క్వార్టర్స్ కేటాయించక తప్పని పరిస్థితి ఏర్పడింది. క్వార్టర్స్‌లో నివాసముంటున్న అధికారులకు ఖాళీ చేయాలని కోరుతూ నోటీసులు అందజేశారు. దీంతో ఇద్దరు అధికారులు క్వార్టర్స్‌ను ఖాళీ చేశారు కానీ, మిగిలిన నలుగురు ఐపీఎస్‌లు ఇప్పటికీ ఖాళీ చేయలేదు.
ఇప్పుడేం జరిగింది?
ఇటీవల వర్సిటీ నిజామాబాద్, కొడంగల్, హుజూర్‌నగర్ వ్యవసాయ కళాశాలలకు అడ్మిషన్లు జరిగాయి. అయితే నిజామాబాద్, హుజూర్‌నగర్ కాలేజీల కోసం ఆయా ప్రాంతాల్లోనే అద్దె భవనాలలో కాలేజీ, వసతి గృహాలను నడుపుతున్నారు. కొడంగల్ ప్రాంతంలో బాలికల వ్యవసాయ కాలేజీ, వసతి గృహాల కోసం భవనాలు అద్దెకు దొరక్కపోవడంతో ఈ విషయాన్ని వర్సిటీ ఉన్నతాధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు.
దీంతో సీఎం రేవంత్ రెడ్డి రాజేంద్రనగర్‌లోని వర్సిటీలోనే కొడంగల్ వ్యవసాయ కళాశాలను నడపాల్సిందిగా ఆదేశించారు. ప్రస్తుతం ఇక్కడ్నుంచే నడుస్తున్న ఈ కళాశాలలో విద్యారి్థనుల వసతికి తీవ్ర కొరత ఏర్పడింది. వర్సిటీ పరిధిలోని అతిథి గృహాలన్నింటినీ వసతి గృహాలుగా మార్చినప్పటికీ కొరత తీరకపోవడంతో ఐపీఎస్ అధికారుల గుప్పిట్లో ఉన్న స్టాఫ్ క్వార్టర్లను కేటాయించాలని నిర్ణయించారు. దీంతో సత్వరమే క్వార్టర్స్‌ను ఖాళీ చేయాలని కోరుతూ నలుగురు ఐపీఎస్‌లకు నోటీసులు పంపించారు. కానీ, సదరు అధికారులు నోటీసులను ఏమాత్రం పట్టించుకోకుండా మిన్నకుండిపోయారు.
రోడ్ల మీద ఉండాల్సిన దౌర్భాగ్యం వస్తుంది
ఈనెల 26న 70 మంది విద్యార్థినులు హాస్టల్లో చేరేందుకు వారికి అలాట్‌మెంట్ లెటర్లు జారీ చేశాం. ఈలోగా క్వార్టర్స్ ఖాళీ చేయాలని నలుగురు ఐపీఎస్‌లకు ఫైనల్ నోటీసులు ఇచ్చాం. ఈ విషయమై డీజీపీ, ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీలకు పలుమార్లు లేఖలు రాసినా అధికారుల్లో ఎలాంటి చలనం లేదు. విద్యార్థినులు వచ్చేలోగా అధికారులు క్వార్టర్స్ ఖాళీ చేయకపోతే బాలికలకు రోడ్ల మీద, చెట్ల కింద వసతి ఏర్పాటు చేయాల్సిన దౌర్భాగ్య పరిస్థితి దాపరిస్తుంది. – ప్రొఫెసర్ జానయ్య, వీసీ, పీజేటీఏయూ


