సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావ్ పూలే వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి పార్టీ నేతలు నివాళులర్పించారు. ఎమ్మెల్సీలు రమేష్ యాదవ్, చంద్రగిరి ఏసురత్నం, మాజీ మంత్రి జోగి రమేష్, మాజీ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, పలు విభాగాల నేతలు హాజరయ్యారు.
జోగి రమేష్ మాట్లాడుతూ.. పూలే చూపిన సామాజిక న్యాయాన్ని ముందుకు తీసుకెళ్లిన నాయకుడు వైఎస్ జగన్.. బడుగు, బలహీన వర్గాల వారిని రాజ్యసభకు పంపిన ఘనత ఆయనదేనన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీలకు కేబినెట్‌లో ప్రాధాన్యం ఇచ్చారు. ఉప ముఖ్యమంత్రి పదవిని సైతం బీసీలకు ఇచ్చారు. బీసీలు లేనిదే మా పార్టీ లేదు అంటూ చంద్రబాబు ముసలి కన్నీరు కారుస్తున్నారు. లోకల్ బాడీ ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్ ఇస్తామని చంద్రబాబు మోసం చేశారు’’ అంటూ జోగి రమేష్ మండిపడ్డారు.
మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో చంద్రబాబుపై బీసీ, ఎస్సీ, ఎస్టీలు తిరుగుబాటు చేశారు. చంద్రబాబు సర్కార్ పతనం ప్రారంభం అయ్యింది. చంద్రబాబు కేబినెట్‌లో ఒక్క బీసీకి ఎందుకు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వలేదు?. బీసీలు ఉప ముఖ్యమంత్రి పదవికి పనికి రారా?. సామాజిక న్యాయాన్ని చంద్రబాబు తుంగలో తొక్కారు. జ్యోతిరావు పూలేకి నివాళులు అర్పించే అర్హత చంద్రబాబుకి లేదు. పంచాయతీ రెండో, మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెబుతారు. డిప్యూటీ సీఎంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఇవ్వాలి. లేదంటే చంద్రబాబు సామాజిక న్యాయాన్ని తుంగలో తొక్కినట్లే’’ అని జోగి రమేష్ వ్యాఖ్యానించారు.
బీసీలకు మేలు చేసిన ఘనత వైఎస్ జగన్‌దే: రమేష్ యాదవ్
ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ మాట్లాడుతూ.. ‘‘బీసీలకు మేలు చేసిన ఘనత వైఎస్ జగన్‌దే.. చంద్రబాబు బీసీలను ఓటు బ్యాంక్‌గా చూస్తారు. వైఎస్ జగన్ మాత్రమే బీసీలు అంటే బ్యాక్ బోన్ కాస్ట్ అంటూ పెద్ద పీట వేశారు. దేశంలో 33 లక్షల అక్క చెల్లెమ్మలకు ఇళ్ల పట్టాలు ఇచ్చారు వైఎస్ జగన్. ఎన్నికల సమయంలో చంద్రబాబు బీసీల మీద తెగ ప్రేమ చూపిస్తారు. కానీ ఆయన ఏనాడూ బీసీలకు మేలు చేసిందేమీ లేదు
..అధికారంలోకి వచ్చాక బీసీలను అనేక ఇబ్బందులు పెడుతున్నారు. బీసీ నేతల గొంతు నులుముతుంది వెన్నుపోటు పార్టీ. మాజీ మంత్రులు జోగి రమేష్, కారుమూరి నాగేశ్వరరావు వంటి వారిని జైలుకి పంపించారు. మాజీ మంత్రి విడుదల రజనీపై అక్రమ కేసులు పెడుతున్నారు. ఎన్ని కేసులు పెట్టినా ప్రభుత్వంపై పోరాటం చేస్తాం’’ అని రమేష్ యాదవ్ పేర్కొన్నారు.
పూలే ఆశయాలతో పాలన సాగించిన వ్యక్తి జగన్: దేవినేని అవినాష్
వైఎస్ జగన్ పాలన అంబేద్కర్, పూలే ఆశయాలకు అనుగుణంగా పాలన సాగింది. కూటమి పాలనలో అంబేద్కర్, పూలే ఆశయాలకు వ్యతిరేకంగా పాలన సాగిస్తున్నారు. బలహీన, ఎస్టీ, ఎస్సీ వర్గాలపై రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేసి దాడులు చేస్తున్నారు. పూలే వర్థంతి కార్యక్రమం ప్రభుత్వం తరపున, అధికార పార్టీ తరపున జరపడం లేదు. గ్రామీణ ప్రాంతాల్లో టీడీపీ నేతలు దౌర్జన్యాలు, దాడులు చేసినా కానీ వైఎస్సార్‌సీపీ తరపున ప్రజలు నిలబడ్డారు. ఎన్నికల్లో వైఎస్ జగన్ కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు. ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు నిర్వహించే కూటమికి వ్యతిరేకంగా పోరాటం చేస్తాం.
ఏపీ మరో బిహార్‌గా మారిపోయింది: మల్లాది విష్ణు
పూలే ఆలోచన విధానానికి అనుగుణంగా పనిచేసిన ప్రభుత్వం వైఎస్ జగన్ ప్రభుత్వం. ఆయన ఆశయాలతోనే పార్టీ పనిచేస్తుంది. స్థానిక సంస్థల ఎన్నికల తరుణంలో ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు 34 శాతం రిజర్వేషన్ పేరుతో డ్రామా చేశారు. ఎన్నికలతో సంబంధం లేకుండా బీసీలకు 50 శాతం స్థానాలు ఇచ్చిన నాయకుడు వైఎస్ జగన్. డీబీటీ ద్వారా ప్రజలను నేరుగా మంచి చేశారు. అమ్మఒడి, ఆసరా, చేయూత వంటి పథకాలు అమలు చేశారు.
ఏపీ మరో బిహార్ గా మారిపోయింది. హింస పెరిగిపోయింది. పోలీస్ వ్యవస్థను అడ్డం పెట్టుకుని గెలవాలని, బడుగు బలహిన వర్గాల గొంతు ప్రభుత్వం నొక్కుతుంది. అన్ని కులాలు ప్రభుత్వం మీద తిరగబడుతున్నాయి. ప్రభుత్వం బుద్ధి తెచ్చుకుని పరిపాలన సాగించాలి. పూలే ఆశయాలతోనే వైఎస్సార్‌సీపీ పార్టీ, రాబోయే ప్రభుత్వం పనిచేస్తుంది.
ఇదీ చదవండి: మార్పు మొదలైంది.. నిజం ఇదే..


