సాక్షి ప్రతినిధి, కాకినాడ: నగర పాలక సంస్థ ఎన్నికల పోలింగ్ ముగిసింది. అభ్యర్థుల భవితవ్యం బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తమైంది. సోమవారం ఓట్ల లెక్కింపు జరిగి, ఫలితాలు వెలువడనున్నాయి. ఈ నేపథ్యంలో మేయర్ అభ్యర్థి గెలుపుపై కూటమి శ్రేణుల్లో ఆందోళన నెలకొంది. గత సెంటిమెంట్లతో పాటు, క్రాస్ ఓటింగ్‌పై వారు గుబులు చెందుతున్నారు. ఈ నేపథ్యంలో మూడు రోజుల అనంతరం వెలువడే ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది.
ఇదీ సెంటిమెంటు
కాకినాడ మున్సిపాలిటీ 1866లో ఆవిర్భవించింది. 2005లో మున్సిపల్ కార్పొరేషన్‌గా అప్‌గ్రేడ్ అయింది. ఇన్నేళ్లుగా చైర్మన్, మేయర్ ఎన్నికలు ప్రత్యక్ష, పరోక్ష విధానంలో జరుగుతున్నాయి. గత నాలుగు దశాబ్దాల ఎన్నికల చరిత్రను పరిశీలిస్తే ఒక్కసారి మినహా పరోక్ష ఎన్నికలు జరిగిన ప్రతిసారీ రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీయే ఇక్కడ చైర్మన్ స్థానాన్ని దక్కించుకుంటోంది. అదే ప్రత్యక్ష ఎన్నికలు జరిగినప్పుడు మాత్రం రాష్ట్రంలో అధికార పార్టీకి ప్రత్యర్థిగా ఉన్న పార్టీ అభ్యర్థి విజయం సాధిస్తున్నారు.కాకినాడ మున్సిపాలిటీగా ఉన్న సమయంలో చైర్మన్ పదవికి రెండుసార్లు ప్రత్యక్ష ఎన్నికలు జరిగాయి. అప్పట్లో రాష్ట్రంలో టీడీపీ అధికారంలో ఉంది. మున్సిపల్ చైర్మన్ పదవిని మాత్రం ఆ రెండుసార్లూ ప్రత్యర్థి పార్టీయే దక్కించుకుంది.
1987లో ప్రత్యక్ష ఎన్నికలు జరగగా అప్పుడు మాత్రమే రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీడీపీ ఈ ఎన్నికల్లో కాకినాడ మున్సిపల్ చైర్మన్ పదవిని దక్కించుకుంది.
1995లో ఎన్టీఆర్ సీఎంగా ఉన్నప్పుడు జరిగిన ప్రత్యక్ష ఎన్నికల్లో అధికార టీడీపీ అభ్యర్థిపై ప్రతిపక్ష కాంగ్రెస్ అభ్యర్థి జోసెఫ్ చైర్మన్‌గా విజయం సాధించారు.
2000 ప్రత్యక్ష ఎన్నికల సమయానికి రాష్ట్రంలో టీడీపీ అధికారంలో ఉండగా కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ బీరక చంద్రశేఖర్ మున్సిపల్ చైర్మన్‌గా ఎన్నికయ్యారు.
మరోవైపు మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్‌గా అప్‌గ్రేడ్ అయిన అనంతరం 2005లో మేయర్ ఎన్నికలు పరోక్ష విధానంలో నిర్వహించారు. అప్పట్లో రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ మేయర్ పీఠాన్ని దక్కించుకుంది. పోలసపల్లి సరోజ తొలి మేయర్‌గా ఎన్నికయ్యారు.
అలాగే, 2017లో రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీడీపీ.. అప్పట్లో పరోక్ష విధానంలో జరిగిన ఎన్నికల్లో మేయర్ సీటును దక్కించుకుంది. సుంకర పావని మేయర్‌గా ఎన్నికయ్యారు.
ఈవిధంగా ప్రత్యక్ష ఎన్నికలు జరిగిన రెండుసార్లు రాష్ట్రంలోని అధికార పార్టీకి కాకినాడలో చుక్కెదురైంది. పరోక్ష ఎన్నికలు జరిగినప్పుడు మాత్రం అధికార పార్టీయే గెలిచింది. ఈ చరిత్ర ప్రస్తుతం కూటమి శ్రేణుల్లో కంగారుకు కారణమవుతోంది. ప్రత్యక్ష ఎన్నికల్లో అధికార పార్టీకి చెందిన చైర్మన్ అభ్యర్థులు ఓటమి పాలవడం.. ప్రతిపక్ష పార్టీలకు కలిసి వస్తోందన్న వాదన నగరంలో చర్చనీయాంశంగా మారింది. ఈ సెంటిమెంటు, అదే సీన్ పునరావృతమైతే పరాభవం తప్పదేమోననే ఆందోళన కూటమి నేతల్లో నెలకొంది. దీనికి తోడు ఎన్నికల సందర్భంగా కూటమి నేతలు అవలంబించిన విధానాలు సైతం వారి విజయావకాశాలపై సందేహాలు రేకెత్తిస్తున్నాయి. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు భిన్నంగా ఉంటాయని, విజయం తమకే దక్కుతుందని కూటమి నేతలు పైకి గంభీరంగా చెబుతున్నా.. అంతర్గతంగా మాత్రం గుబులు చెందుతున్నట్లు సమాచారం.
క్రాస్ కంగారు
మరోవైపు కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ కూటమి నేతలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. పార్టీ టికెట్టు ఆశించిన భంగపడిన మేయర్, కార్పొరేటర్ అభ్యర్థులు రెబల్స్, స్వతంత్ర అభ్యర్థులుగా ఈ ఎన్నికల్లో పోటీ చేశారు. కార్పొరేటర్ ఓటు తమకే వేయాలని, మేయర్ ఓటు మాత్రం వైఎస్సార్ సీపీ అభ్యర్థికి వేయాలంటూ వారు ప్రచారం చేయడం కాకినాడలో చర్చనీయాంశంగా మారింది.
మేయర్ ఓటు వైఎస్సార్ సీపీకి బదిలీ అయిందన్న చర్చతో కూటమి శ్రేణుల్లో మరింత కంగారు నెలకొందని సమాచారం. కార్పొరేషన్‌లో మొత్తం 66 డివిజన్లున్నాయి. బరిలో 323 మంది అభ్యర్థులు నిలిచారు. కూటమి పార్టీల నుంచి సీటు ఆశించి దక్కని పలువురు రెబల్స్‌గా పోటీ చేశారు. స్వతంత్ర అభ్యర్థులు కూడా 80 శాతం మంది ఉన్నారు. తమకు పోటీ చేసే అవకాశం దక్కలేదన్న అక్కసుతో వీరందరూ తమతమ వార్డుల్లో మేయర్ ఓట్లను వైఎస్సార్ సీపీకి భారీగా బదిలీ చేసినట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
మరోవైపు పోలింగ్ శాతం కేవలం 58 శాతం మాత్రమే నమోదు కావడంతో ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తప్పదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. గతంలో జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో 67 శాతం పోలింగ్ జరిగింది. ప్రస్తుతం మాత్రం 58 శాతానికే పరిమితం కావడంపై కూడా చర్చ జరుగుతోంది. నగర ఓటర్లు ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారని, ఓటు వేసి ఏం లాభమంటూ మిన్నకుండిపోయారని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో భిన్నమైన ఫలితాలు లేదా మొత్తానికి తేడా వస్తే తమ పరిస్థితి ఏమవుతోందనని కూటమి నేతలు హైరానా పడుతున్నారు.


