అయ్యలూరు సర్పంచ్‌గా ఎన్నికైన పరిమళ, వైఎస్సార్సీపీ నాయకులతో మాజీ ఎమ్మెల్యే శిల్పారవి
సాక్షి ప్రతినిధి, కర్నూలు: అధికార పార్టీ ఒత్తిళ్లు... అధికారుల ఏకపక్ష మద్దతు... పోలీసుల బెదిరింపులు.. ఓటర్లకు డబ్బుల ఎర, ఇతరత్రా ప్రలోభాలు అన్నింటినీ అధిగమించి వైఎస్సార్సీపీ మద్దతుదారులు మొదటి దశ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. మండల కేంద్రాలు, మేజర్ పంచాయతీల్లో గెలుపొందారు. ‘పచ్చ’ పార్టీతో పోటీ పడి విజయం సాధించారు. వైఎస్సార్సీపీ మద్దతుదారులకు గ్రామ పంచాయ తీ ఓటర్లు ‘జయహో’ అంటూ అండగా నిలిచారు. దీంతో ఉమ్మడి కర్నూలు జిల్లాలో మొదటి దశ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ విజయబావుటా ఎగురవేసింది. పంచాయతీ ఎన్నికల్లో గెలుపుతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది.
97 పంచాయతీల్లో ఘన విజయం
ఉమ్మడి కర్నూలు జిల్లాలో మొదటి దశలో 284 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు జరగ్గా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు 97 పంచాయతీల్లో ఘన విజయం సాధించారు. కర్నూలు జిల్లాలో 148 స్థానాలకు గాను 52 స్థానాల్లో, నంద్యాల జిల్లాలో 136 పంచాయతీలకు గాను 45 పంచాయతీల్లో వైఎస్సార్సీపీ మద్దతుదారులు గెలుపొందారు. గత ఎన్నికల్లో ఓటమి చెందిన స్థానాల్లోనూ ఈ దఫా ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. కర్నూలు జిల్లాలోని ఆదోని, ఆలూరు నియోజకవర్గాల్లో మొదటి దశలో పంచాయతీ ఎన్నికలు జరగగా, ఆదోనిలో 14, ఆలూరులో 36 గ్రామ పంచాయతీల్లో వైఎస్సార్సీపీ మద్దతుదారులు ఘన విజయం సాధించారు.
ఆదోని నియోజకవర్గంలోని ఆదోని మండలం ఇస్వి, చింతకుంటతో పాటు పలు మేజర్ గ్రామ పంచాయతీల్లో వైఎస్సార్సీపీ మద్దతుదారులు గెలుపొందారు. ఆలూరు నియోజకవర్గంలోని 36 గ్రామ పంచాయతీల్లో వైఎస్సార్సీపీ మద్దతుదారులు నేరుగా విజయం సాధించగా సర్పంచులుగా గెలిచిన ఇండిపెండెంట్ అభ్యర్థులు ఇద్దరు వైఎస్సార్సీపీకి మద్దతు పలికారు. ఆలూరు హెడ్ క్వాటర్తో పాటు దేవనకొండ, తెర్నేకల్లు, చిప్పగిరి మండల కేంద్రాల్లోనూ వైఎస్సార్సీపీ మద్దతుదారులే గెలుపొందారు. వీటితో పాటు పలు మేజర్ పంచాయతీల్లోనూ వైఎస్సార్సీపీ మద్దతుదారులు విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ మద్దతుదారుల గెలుపును అడ్డుకునేందుకు ఆలూరు నియోజకవర్గం టీడీపీ ఇన్చార్జి వైకుంఠం జ్యోతి అన్ని రకాల ప్రయత్నాలు చేశారు. పోలీసులను అడ్డుపెట్టి బెదిరింపులకు దిగారు.
పలువురు అభ్యర్థులను ప్రలోభపెట్టే ప్రయత్నం చేశారు. అక్రమ కేసులు పెడతామని బెదిరించారు. అయినా వైఎస్సార్సీపీ మద్దతుదారులు ఏమాత్రం బెదరక పోటీలో నిలిచారు. ఎమ్మెల్యే విరూపాక్షి వైఎస్సార్సీపీ శ్రేణులకు అండగా నిలిచారు. దీంతో ఈ నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ మద్దతుదారులు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అధికార పార్టీని ఢీకొట్టారు. ఆలూరు గ్రామ పంచాయతీలో వైఎస్సార్సీపీ మద్దతుదారుడు తొలుత 280 ఓట్లతో విజయం సాధించగా అధికారులపై వైకుంఠం జ్యోతి ఒత్తిడి తెచ్చి పలుమార్లు రీకౌంటింగ్ చేశారు. వైఎస్సార్సీపీ నాయకులు ఫిర్యాదుతో స్పందించిన ఎస్పీ, ఇతర అధికారులు చివరకు 127 ఓట్ల మెజార్టీతో వైఎస్సార్సీపీ మద్దతుదారుడు విజయం సాధించినట్లు ప్రకటించారు. జెడ్పీటీసీ ఎన్నికల్లో దేవనకొండ జెడ్పీటీసీ అభ్యరి్థగా పోటీ చేసి ఓటమి చెందిన వేదావతి తెర్నేకల్లు సర్పంచ్ అభ్యరి్థగా పోటీ చేసి 2,047 ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించారు.
నంద్యాల జిల్లాలో..
నంద్యాల నియోజకవర్గంలో 30 సర్పంచ్ స్థానాల్లో ఎన్నికలు జరగగా 13 స్థానాల్లో వైఎస్సార్సీపీ మద్దతుదారులు ఘన విజయం సాధించారు. రెండు ఏకగ్రీవాలతో కలిపి నియోజకవర్గంలో మొత్తం 15 గ్రామ పంచాయతీల్లో వైఎస్సార్సీపీ మద్దతుదారులు విజయం సాధించారు. ఆళ్లగడ్డ నియోజకవర్గంలో 80 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగగా 29 గ్రామ పంచాయతీల్లో వైఎస్సార్సీపీ మద్దతుదారులు విజయం సాధించారు. ఒక ఏకగ్రీవంతో కలిపి ఆళ్లగడ్డ నియోజకవర్గంలో 30 గ్రామ పంచాయతీల్లో వైఎస్సార్సీపీ మద్దతుదారులు విజయం సాధించారు. ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అఖిలప్రియ అధికార దుర్వినియోగానికి పాల్పడి వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలపై దాడులకు తెగబడినా ఈ నియోజకవర్గంలో మొదటి దశ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులు పెద్ద ఎత్తున ఘన విజయం సాధించడం విశేషం.
కుట్రలు, కుతంత్రాలు ఎల్లకాలం సాగవు
నంద్యాల(అర్బన్): కుట్రలు, కుతంత్రాలు ఎల్లకాలం సాగవు, ఇది టీడీపీ నాయకులు గ్రహించుకోవాలని నంద్యాల మాజీ ఎమ్మెల్యే రవిచంద్రకిశోర్‌రెడ్డి హితవు పలికారు. నియోజకవర్గంలో నంద్యాల, గోస్పాడు మండలాల పంచాయతీల్లో వైఎస్సార్సీపీ మద్దతుదారులు మెజారిటీ స్థానాలను కైవసం చేసుకోవడంతో పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం నెలకొందన్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం నంద్యాల పట్టణంలోని మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిశోర్‌రెడ్డి నివాసం వద్ద విజయోత్సవ సంబరాలు మిన్నంటాయి. నూతనంగా ఎన్నికైన సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు, వార్డు సభ్యులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చి బాణసంచా కాల్చి, మిఠాయిలు పంచుకుని తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.
ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి
ఆళ్లగడ్డ: ఎన్నికల్లో ప్రజలు అప్పగించిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తించి వారి నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని మాజీ ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి నూతన సర్పంచులకు పిలుపునిచ్చారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో విజేతలుగా నిలిచిన పలువురు నూతన సర్పంచులు శుక్రవారం స్థానిక పార్టీ కార్యాలయంలో ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. నూతన సర్పంచులను ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అధికార పార్టీ ఆదేశాలతో పోలీసులు ఎంత ఒత్తిడి తెచ్చినా, ఎన్ని బెదిరింపులకు పాల్పడినా ధైర్యంగా ఎన్నికల్లో పోటీ చేసిన వైఎస్సార్సీపీ శ్రేణులకు అందరికీ సెల్యూట్ అన్నారు. ఎన్నికల్లో గెలుపోటములు సహజమని, కూటమి నేతల రిగ్గింగ్, సైక్లింగ్, దొంగ ఓట్లతో వైఎస్సార్సీపీ మద్దతుదారులు పోటీ చెందారని, వారంతా అధైర్య పడాల్సిన అవసరం లేదన్నారు. రెండేళ్లలో మన ప్రభుత్వం రాబోతుందని అప్పుడు ఇంతకు రెండింతలు సినిమా చూపిద్దామన్నారు. గెలుపొందిన సర్పంచ్‌లు గ్రామాల్లో పార్టీలకతీతంగా గ్రామాల సమగ్రాభివృద్ధికి అంకిత భావంతో పనిచేయాలని సూచించారు. గ్రామాల అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని భరోసా ఇచ్చారు.
శిరివెళ్ల.. వైఎస్సార్సీపీ ఖిల్లా
బెదిరింపులు.. దౌర్జన్యాలు.. పోలీసులతో రాజీ యత్నాలు.. అన్నీ బెడిసికొట్టాయి. పంచాయతీ ఎన్నికల్లో ఎన్ని అడ్డదారులు తొక్కినా శిరివెళ్ల మండలం వైఎస్సార్సీపీ ఖిల్లాగానే నిలిచింది. మొత్తం 16 గ్రామ పంచాయతీలు ఉండగా వైఎస్సార్సీపీకి పట్టు ఉన్న గోవిందపల్లె, బోయిలకుంట్ల, వెంకటాపురం పంచాయతీలను టీడీపీ నాయకులను పోలీసులను అడ్డుపెట్టుకుని బెదిరింపులకు పాల్పడిన ఏకగ్రీవం చేసుకున్నారు. మిగిలిన 13 పంచాయతీలకు నామినేషన్లు వేయగా మండల కేంద్రం శిరివెళ్ల మేజర్ పంచాయతీలో పోలీసు ఉన్నతాధికారి స్థాయిలో భయభ్రాంతులకు గురి చేయడంతో పోలింగ్ ఒక రోజు ముందు వైఎస్సార్సీపీ మద్దతుదారులు ఎన్నికలను బహిష్కరించడంతో టీడీపీ నేతలు రిగ్గింగ్ చేసుకుని గెలవడంతో ప్రజలు నివ్వెరపోయారు. మిగతా 12 గ్రామ పంచాయతీల్లో ఎన్నికల్లో జరుగగా 7 చోట్ల వైఎస్సార్సీపీ మద్దతుదారులు ఘన విజయం సాధించడంతో టీడీపీ శ్రేణుల గుండెల్లో రైళ్లు పరుగెత్తుతున్నాయి.


