ఆంజనేయస్వామి ఆలయం కూల్చివేత.. విలపిస్తున్న వానరాలు | Bhumana Karunakar Reddy Protests Hanuman Temple Demolition | Sakshi
Sakshi News home page

ఆంజనేయస్వామి ఆలయం కూల్చివేత.. విలపిస్తున్న వానరాలు

Nov 28 2026 9:34 AM | Updated on Nov 28 2026 9:34 AM

Bhumana Karunakar Reddy Protests Hanuman Temple Demolition

తిరుపతి మంగళం : హిందువుల మనోభావాలు దెబ్బతినేలా అభయాంజనేయస్వామి ఆలయాన్నికూల్చివేయడం అత్యంత బాధాకరమని వైఎస్సార్‌సీపీ రీజనల్‌ కో–ఆర్డినేటర్, టీటీడీ మాజీ చైర్మన్‌ భూమన కరుణాకరరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. గత మూడు రోజులుగా తిరుపతి సమీపంలోని శ్రీ అభయాంజనేయస్వామి ఆలయాన్ని కూటమి ప్రభుత్వం కూల్చివేసిన తీరుపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం ధ్వజస్తంభాన్ని సైతం తాగుబోతులతోకూల్చివేయించి తుప్పల్లో పడవేయడంపై ఆయన ఆవేదనకు గురయ్యారు. ఆ పవిత్రమైన స్థలాన్ని శుక్రవారం మరోసారి సందర్శించి ఆంజనేయస్వామి ఆలయం పట్ల కూటమి ప్రభుత్వం, అధికారులు వ్యవహరిస్తున్న తీరును చూసి కుమిలిపోయారు.

ఆయనతో పాటు మాజీ డిప్యూటీ సీఎం కళత్తూరు నారాయణస్వామి కూడా వెళ్లి పరిశీలించారు. అభయాంజనేయస్వామి ఆలయంపై దేవదాయశాఖ మంత్రిచేత 70 ఏళ్లనాటి ఆలయమేనంటూ చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌ పచ్చి అబద్ధాలు చెప్పించడం హిందువుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమేనని భూమన ఆగ్రహం వ్యక్తం చేశారు. దట్టమైన అటవీ ప్రాంతంలో స్వయంభూగా వెలసిన అభయమూర్తి ఆంజనేయ స్వామి దేవాలయాన్ని కూల్చివేయడమే కాకుండా 70ఏళ్ల నాటి ఆలయమని చెప్పడం వారి నీచరాజకీయాలకు నిదర్శనమన్నారు. 14వ శతాబ్దంలో పల్లవ రాజులు ఇక్కడ రాతి మండపాన్ని, పక్కనే పుష్కరిణిని నిర్మించారని, సాక్షాత్తు అగస్త్య మహాముని, లోపాముద్రలు స్వామివారికి అభిషేకం చేసిన క్షేత్రమిదని, అన్నమాచార్యులు తన కీర్తనల్లో ఈ స్వామిని కీర్తించారన్న విషయాలను గుర్తుచేశారు. 

అర్చకులు తప్ప మరెవ్వరికీ ప్రవేశం ఉండకూడని బాలాలయంలోకి మద్యం సేవించిన కూలీలు, చెప్పులు వేసుకున్న వ్యక్తులు వెళ్లి పవిత్రతను మంటగలిపారని భూమన వాపోయారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి హిందూ దేవాలయాలను కూల్చివేస్తూ హింధూ ధర్మాన్ని సర్వనాశనం చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు, పవన్‌కళ్యాన్‌లు హిందూద్రోహులుగా మిగిలిపోతారన్నారు. అనంతరం మాజీ డిప్యూటి సీఎం కళత్తూరు నారాయణస్వామి మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రంలో హింధూ దేవాలయాల కూల్చివేతపై దేశ ప్రధాన మంత్రి నరేంద్రమోదీ చర్యలు తీసుకోవాలని కోరారు.  

ఆంజనేయస్వామి ఆలయాన్ని కూల్చివేయడంతో ఆలయం చుట్లూ తిరుగుతూ ఆవేదన చెందుతున్న వానరాలను చూస్తున్న భూమన కరుణాకరరెడ్డి, మాజీ డెప్యూటీ సీఎం నారాయణస్వామి  

విలపిస్తున్న వానరాలు  
ఆంజనేయపురం వద్ద అభయాంజనేయస్వామి ఆలయాన్ని కూల్చివేయడంతో శిథిలాల వద్దకు వానరాలు వచ్చి ఆవేదనతో విలపించడం కనిపించింది. తన స్వామి ఆలయం కూల్చివేయడంతో అనేక వానరాలు అక్కడికి వచ్చి ఆలయం వద్దే తిరుగుతూ ఆవేదన చెందడాన్ని భూమనతోపాటు స్థానికులు చూసి చలించిపోయారు.  

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement