నంద్యాల(అర్బన్): పంచాయతీ ఎన్నికల్లో భాగంగా గురువారం నంద్యాల మండలం అయ్యలూరు గ్రామంలో జరిగిన ఓట్ల లెక్కింపులో బ్యాలెట్ బాక్స్‌లో ఓ వినతి పత్రం వెలుగు చూసింది. గ్రామంలో ఎన్నో సమస్యలు ఉన్నాయని, వాటిని పరిష్కరించాలని కోరుతూ ఓ ఓటరు లేఖ రాసి బ్యాలెట్ బాక్స్‌లో వేశారు. గ్రామంలో డ్రైనేజీ సమస్య, పాఠశాల ఆటస్థలం, వీధి దీపాలు, విద్యుత్ స్తంభాల ఏర్పాటు, పచ్చదనం పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. పేదలకు ఇంటి స్థలాలు ఇచ్చి సుసంపన్నమైన అయ్యలూరు చేయాలని, 16వ ఆర్థిక సంఘం, నాబార్డు ఇతర పథకాల ద్వారా నిధులు తెప్పించాలని విజ్ఞప్తి చేశారు.


