ధర్మకిరణ్ తల్లిని ఓదారుస్తున్న డిప్యూటీ తహసీల్దార్ అరుణ
కొత్తపల్లి(నంద్యాల): ఆమె ఒక ప్రభుత్వ ఉద్యోగి. విధుల్లో భాగంగా కార్యాలయానికి వచ్చిన ప్రజలకు సేవలందించడమే కాదు.. ఆపదలో ఉన్న వారికి ఆపనహస్తం అందించాలని చాటి చెప్పారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దార్‌గా విధులు నిర్వర్తించే అరుణ మానవత్వం చాటారు.
ఈనెల 24వ తేదీన మండలంలో బలుపాలతిప్పె, చెంచుగూడెంలో ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదంలో సజీవదహనమైన బాలుడు ధర్మకిరణ్ కుటుంబానికి అండగా నిలిచారు. ప్రభుత్వం నుంచి సహాయం అందే వరకు ఆగకుండా, తన సొంత బాధ్యతగా బాధిత కుటుంబానికి కొంత సాయం చేయాలనుకున్నారు. శుక్రవారం బలపాలతిప్ప ఘటనా స్థలానికి చేరుకొని కుమారుడి మృతితో తల్లడిల్లుతున్న తల్లిని చూసి చలించిపోయారు.గుండెలవిసేలా రోదిస్తున్న ఆ బాలుడి తల్లిని ఓదార్చడం ఆమెకు కష్టమైంది.
తన వెంట తీసుకెళ్లిన నిత్యావసర సరుకులు బియ్యం, బెడ్ షీట్లు, దుప్పట్లు, చీరలు, కొత్త వంట పాత్రలు అన్నీ స్వయంగా అందించారు. ఒక అధికారిణిగా కాకుండా ఒక మాతృమూర్తిగా బాధిత కుటుంబానికి ఆపన్న హస్తం అందించిన డిప్యూటీ తహసీల్దార్ అరుణను గిరిజనవాసులు, తోటి ఉద్యోగులు అభినందించారు. ప్రభుత్వం ఈ ఘటనపై విచారణ జరిపి, అడవి బిడ్డల గుడిసెలపై ఏర్పాటు చేసే సోలార్ వ్యవస్థలకు సరైన భద్రతా ప్రమాణాలు పాటించేలా చూడాలని, మృతి చెందిన ధర్మకిరణ్ కుటుంబానికి ప్రభుత్వ పరంగా పూర్తి నష్టపరిహారం అందించేలా చర్యలు తీసుకోవాలని గిరిజనులు ఆమెను కోరారు.


