సాక్షి, తిరుపతి జిల్లా: శ్రీకాళహస్తిలో కూటమి నేతల దౌర్జన్యకాండ కొనసాగుతోంది. శ్రీకాళహస్తి మున్సిపల్ ఎన్నికల్లో ఛైర్మన్ స్థానానికి ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలో దిగిన పాండురంగపై హత్యాయత్నం జరిగింది. రాజీవ్ నగర్ వద్ద కారుతో ఢీకొట్టి చంపేందుకు యత్నించారు. తీవ్ర గాయాలపాలైన పాడురంగ.. ప్రాణాపాయస్థితిలో ఉన్నారు.
సంఘటన స్థలానికి చేరుకున్న మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి.. పాండురంగను తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. శ్రీకాళహస్తిలో ఎప్పుడు హత్యా రాజకీయాలు లేవని.. కూటమి ప్రభుత్వంలో ప్రోత్సహిస్తున్నారంటూ బియ్యపు మధుసూదన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
అనంతపురం జిల్లా తిమ్మాపురంలోనూ టీడీపీ గూండాలు రెచ్చిపోయారు. వైఎస్సార్‌సీపీ సర్పంచ్ గౌని రేణుకపై దాడికి యత్నించారు. సర్పంచ్ ఇంటిపై దాడి చేసిన వంద మంది పచ్చమూకలు.. ఫర్నీచర్, ఇంటి అద్దాలు ధ్వంసం చేశారు. ముగ్గురు వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు గాయపడ్డారు. టీడీపీ గూండాల దాడి నుంచి రేణుక తృటిలో తప్పించుకున్నారు.
కళ్యాణదుర్గం నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు వర్గీయులు దాష్టీకానికి పాల్పడుతున్నారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ మద్దతుదారు గౌని రేణుక 29 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఓటమి జీర్ణించుకోలేక అమిలినేని వర్గీయులు దాడులు చేస్తున్నారు. ఓ వైపు ఆర్వో కాంతరాజుపై బెదిరింపులకు దిగారు. మరో వైపు వైఎస్సార్‌సీపీ మద్దతుదారు సర్పంచ్ రేణుకపై దాడికి యత్నించారు. కళ్యాణదుర్గంలో పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు.
ఇదీ చదవండి: పల్లె తీర్పు బాబుకు షాక్


