ఒకేసారి వాడే వైద్య పరికరాల పునర్వినియోగంపై కేంద్రం ఉక్కుపాదం
లాభార్జనే ధ్యేయంగా సాగుతున్న కొన్ని కార్పొరేట్, ప్రైవేటు ఆస్పత్రుల తీరుపై కేంద్ర ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సింగిల్ యూజ్ (ఒక్కసారి మాత్రమే ఉపయోగించాల్సిన) వైద్య పరికరాలు, డిస్పోజబుల్ సర్జికల్ వస్తువులను రీ-సైక్లింగ్ చేస్తూ రోగుల ప్రాణాలతో బేరాలు ఆడుతున్న ఉదంతాలపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ (డీజీహెచ్‌ఎస్) కఠిన చర్యలకు ఉపక్రమించింది. ఈ అక్రమ ప్రాక్టీస్‌ను తక్షణమే నిలిపివేసి నిషేధాన్ని కఠినంగా అమలు చేయాలని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు స్పష్టమైన మార్గదర్శకాలను జారీ చేసింది.
కొన్ని విభాగాల్లో మరీ దారుణం!
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఆరోగ్య కేంద్రాల్లో ఈ నిషేధం వర్తిస్తుందని డీజీహెచ్ఎస్ స్పష్టం చేసింది. ముఖ్యంగా కార్డియాలజీ, నెఫ్రాలజీ, ఆంకాలజీ, కార్డియోథొరాసిక్ అండ్ వాస్కులర్ సర్జరీలు, న్యూరోసర్జరీ వంటి అత్యంత కీలకమైన విభాగాలు ఉన్న ఆస్పత్రుల్లో ఈ ఉల్లంఘనలు తీవ్రంగా జరుగుతున్నట్లు పసిగట్టింది. ఒక్కసారి వాడి పడేయాల్సిన కేథటర్లు, స్టెంట్లు, సర్జికల్ బ్లేడ్లు, గైడ్‌వైర్లు తదితర పరికరాలను రీ-స్టెరిలైజ్ (క్రిమిసంహారక ప్రక్రియ) చేసి మళ్లీ తదుపరి రోగులకు వాడుతున్నట్లు కేంద్రం గుర్తించింది.
రోగుల ఆరోగ్యానికి ముప్పు
ఇలా పరికరాలను పునర్వినియోగించడం వల్ల రోగులు ఒకరి నుంచి మరొకరికి వ్యాపించే క్రాస్-ఇన్ఫెక్షన్లకు గురయ్యే ప్రమాదం ఉంది. అంతేకాకుండా తయారీదారుల ప్రమాణాలకు విరుద్ధంగా వాడటం వల్ల చికిత్స సమయంలో పరికరాలు విఫలమవ్వడం, సరిగా పనిచేయకపోవడం, శస్త్రచికిత్స సంక్లిష్టతలు పెరిగి ప్రాణాపాయం సంభవించే అవకాశముంది.
ఇందులో మరో దిగ్భ్రాంతికరమైన విషయం ఏమిటంటే.. ఆస్పత్రులు ఈ పునర్వినియోగ పరికరాలను వాడుతూ కూడా రోగుల నుంచి లేదా ప్రభుత్వ ఆరోగ్య భీమా పథకాల (రీయింబర్స్‌మెంట్) నుంచి మాత్రం కొత్త పరికరాల పూర్తి వ్యయాన్ని వసూలు చేస్తున్నాయి. ఇది కేవలం వైద్యపరమైన నేరం మాత్రమే కాక నైతికతను విస్మరించి చేసే దోపిడీ అని అధికారులు మండిపడ్డారు.
చట్టపరమైన చర్యలకు సన్నాహాలు
ఈ చట్టవిరుద్ధమైన చర్యలు డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్ 1940, మెడికల్ డివైజెస్ రూల్స్ 2017, క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్స్ యాక్ట్ 2010తో పాటు ఆస్పత్రి ఇన్ఫెక్షన్ నివారణ ప్రోటోకాల్స్, బయోమెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్ నిబంధనల తీవ్ర ఉల్లంఘన కిందకే వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒరిజినల్ ఎక్విప్‌మెంట్ మ్యానుఫ్యాక్చరర్ (ఓఈఎం) సూచనల ప్రకారమే ప్రతీ పరికరాన్ని ఉపయోగించాలని డీజీహెచ్ఎస్ ఆదేశించింది.
రాష్ట్రాల అదనపు చీఫ్ సెక్రటరీలు, హెల్త్ సెక్రటరీలు, డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ), రాష్ట్రాల డ్రగ్ కంట్రోలర్లు ఆస్పత్రులపై నిరంతరం తనిఖీలు నిర్వహించాలని, నిబంధనలు ఉల్లంఘించిన ఆస్పత్రులపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కేంద్రం నిర్దేశించింది. ఆరోగ్య రక్షణ పేరుతో సాగుతున్న ఈ దోపిడీకి ముగింపు పలకాలంటే తనిఖీ విభాగం పూర్తిస్థాయిలో రంగంలోకి దిగాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ఇదీ చదవండి: స్వల్ప వ్యవధిలోనే వెండి రూ.30,000 డౌన్!


