ముంబై: భారత్‌ను విచ్ఛిన్నం చేయాలని దుష్టశక్తుల కుట్రలు పన్నుతున్నాయని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్‌ను బలహీనపరిచేందుకు ప్రపంచవ్యాప్తంగా ‘రెజీమ్ చేంజ్’ ఆపరేషన్లు జరుగుతున్నాయని ఆరోపించారు. ఈ రోజు (మంగళవారం)నాగ్‌పూర్‌లో జరిగిన ఆర్‌ఎస్‌ఎస్ విజయదశమి వేడుకల్లో ఆయన మాట్లాడారు. తమ స్వార్థ ప్రయోజనాల కోసం ఇతర దేశాల్లో పాలన మార్పునకు ప్రయత్నిస్తున్న శక్తులకు భారత్ అభివృద్ధి చెందడం అడ్డంకిగా మారిందన్నారు.
భారత్, హిందువులు, ఆర్‌ఎస్‌ఎస్‌ను విచ్ఛిన్నం చేసే మార్గాలపై దుష్టశక్తులు ఆలోచిస్తున్నాయని అధికార దాహంతో ఉన్న కొందరు నాయకులు కూడా ఇలాంటి ప్రయత్నాలకు సహకరిస్తున్నారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఇటీవల ఫ్రాన్స్, అల్బేనియా, బంగ్లాదేశ్, నేపాల్‌లో జరిగిన పరిణామాలను ప్రస్తావించారు. పాశ్చాత్య దేశాల నుంచి వస్తున్న తుఫాను ప్రపంచ క్రమాన్ని, సాంస్కృతిక విలువలను దెబ్బతీస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పరిపాలనా వ్యవస్థ మారితే పరిస్థితులు మారతాయన్న వాదన గతంలోనూ నిజం కాలేదని, ఇప్పుడూ కావడం లేదని వ్యాఖ్యానించారు. భారత్‌లోనూ ఇలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయని గత కొన్ని దశాబ్దాలుగా భారత్ అనుసరిస్తున్న దృఢమైన విధానాలు, బలమైన నాయకత్వం ప్రభావం చూపాయని వెల్లడించారు. దేశం, ప్రపంచం పట్ల యువతలో బాధ్యత పెరగడం సానుకూల పరిణామమన్న భగవత్ ..ఆ కారణంగానే సమాజంలో పెరుగుతున్న కుట్రపూరిత ప్రయత్నాలను చైతన్యంతో అడ్డుకోగలిగామని వ్యాఖ్యానించారు.
అభివృద్ధి చెందుతున్న దేశంలో సమస్యలు ఉండటం సహజమేనని ప్రజాస్వామ్యంలో సమస్యలపై నిరసనలు, ఉద్యమాలు సహజమని స్పష్టంచేశారు. అయితే నిరసనలే లక్ష్యం కాకూడదు.. సమస్యలకు పరిష్కారం చూపడమే ఉద్యమాల అసలు ఉద్దేశమై ఉండాలని సూచించారు. శాంతి, శాంతిభద్రతల పరిరక్షణకు ప్రభుత్వం, అధికారులు, రాజకీయ నాయకులు కృషి చేయాలని ఈ సందర్భంగా మోహన్ భగవత్ నాయకులకు సూచించారు.
ఇదీ చదవండి: అభిజిత్ దీప్కే పేరుతో డబ్బులు వసూలు


