సంవిధాన్ రక్షా మార్చ్‌లో సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి, టీపీసీసీ చీఫ్ మహేశ్‌గౌడ్, పార్టీ ఇన్‌చార్జి సందీప్, మంత్రులు శ్రీధర్‌బాబు, వాకిటి, వివేక్, అజహరుద్దీన్, పొంగులేటి, పొన్నం, విప్ ఐలయ్య తదితరులు
నాలుగోసారి అధికారం కోసం మోదీ, షా, అదానీ, అంబానీల యత్నం
దేశంలో 13 కోట్ల మంది ఓట్లు తొలగించారు.. మరో 7 కోట్ల ఓట్ల తొలగింపునకు ప్రయత్నం
సంవిధాన్ రక్షా మార్చ్‌లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ధ్వజం
రాజ్యాంగ పరిరక్షణకు మరో ఉద్యమం: భట్టి
స్వాతంత్య్ర పోరాటంలో ఆర్‌ఎస్‌ఎస్ భాగస్వామి కాలేదు: బీఎం సందీప్
సాక్షి, హైదరాబాద్: ప్రజలకు పాలకులను ఎన్నుకునే హక్కు రాజ్యాంగం కల్పిస్తే... ఇప్పుడు పాలకులే ఓటర్లను నిర్ణయించే ప్రమాదకర పరిస్థితులు దాపురిస్తున్నాయని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఓట్ల తొలగింపు ద్వారా నాలుగోసారి అధికారంలోకి రావాలని ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పారిశ్రామికవేత్తలు అదానీ, అంబానీలు అనే దుష్ట చతుష్టయం కుట్ర పన్నుతోందని ఆరోపించారు. కులమతాల మధ్య విభేదాలు సృష్టిస్తూ, తప్పుడు హామీలతో రెండోసారి, మూడోసారి అధికారాన్ని దక్కించుకున్నారని ఆరోపించారు.
ఇప్పుడు ప్రజల ఓటు హక్కునే దెబ్బతీసి మరోసారి అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. గురువారం ట్యాంక్‌బండ్‌పై అంబేడ్కర్ విగ్రహం నుంచి నెక్లెస్‌రోడ్డులోని ఇందిరాగాంధీ విగ్రహం వరకు నిర్వహించిన ‘సంవిధాన్ రక్షా మార్చ్’లో రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్, రాష్ట్ర పార్టీ ఇన్‌చార్జి సందీప్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం జరిగిన సభలో సీఎం ప్రసంగిస్తూ.. ఇప్పటికే దళితులు, గిరిజనులు, మహిళలు, మైనార్టీలకు చెందిన 13 కోట్ల ఓట్లు తొలగించారని, మరో 7 కోట్ల ఓట్ల తొలగింపునకు ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు.
దేశంలో ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, రాజ్యాంగంపై జరుగుతున్న దాడిని ఐక్యంగా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. రాజ్యాంగ పరిరక్షణకు కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాడుతుందని స్పష్టం చేశారు. గాం«దీ, నెహ్రూ, పటేల్, అంబేడ్కర్ వంటి మహానుభావుల ఆలోచనలతో రూపొందిన రాజ్యాంగం ప్రతి ఒక్కరికీ సమాన అవకాశాలు కల్పించిందన్నారు.
గతంలో రాజులు మరణిస్తే వారి కుమారులు, సోదరులు అధికారంలోకి వచ్చేవారని, ప్రజల చేతుల్లో పాలన ఉండాలంటే రాజ్యాంగం అవసరమని నెహ్రూ, అంబేడ్కర్ భావించారని చెప్పారు. అందుకే కులం, మతం, ప్రాంతం, లింగభేదం లేకుండా గిరిజనులు, దళితులు, మహిళలు, మైనార్టీలు సహా ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించారని వివరించారు.
మోదీ హామీలన్నీ మోసాలే...
అమెరికాకు వందల ఏళ్ల క్రితమే స్వాతంత్య్రం వచ్చినప్పటికీ అక్కడ మహిళలకు ఓటు హక్కు కల్పించేందుకు చాలాకాలం పట్టిందని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. కానీ అంబేడ్కర్ దేశంలోని ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించారని చెప్పారు. నాడు పేదలు, మహిళలకు ఓటు హక్కు కల్పించడాన్ని కొందరు వ్యతిరేకించారని, అలాంటి ఆలోచనలకు రాజ్యాంగ నిర్మాతలు తావివ్వలేదన్నారు. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని, విదేశాల్లోని నల్లధనాన్ని వెనక్కి తీసుకొస్తామని హామీ ఇచ్చి 2014లో మోదీ అధికారంలోకి వచ్చారని విమర్శించారు.
దేశం కోసం మహాత్మాగాం«దీ, ఇందిరాగాం«దీ, రాజీవ్‌గాంధీ ప్రాణత్యాగాలు చేశారని సీఎం గుర్తుచేశారు. దేశ రక్షణ, రాజ్యాంగ పరిరక్షణ కోసం సోనియాగాంధీ, రాహుల్‌గాం«దీ, ప్రియాంకాగాం«దీ, మల్లికార్జున ఖర్గే.. గాంధీ సిద్ధాంతాలతో పోరాడుతున్నారని చెప్పారు. మరోవైపు మోదీ బృందం గాడ్సే వారసత్వంతో పనిచేస్తోందని విమర్శించారు. దేశ ప్రజలు గాంధీ సిద్ధాంతాల పక్షాన నిలిచి మోదీ కౌరవ సైన్యాన్ని ఓడించాలని అన్నారు.
వందేళ్ల క్రితం కాంగ్రెస్ ఉందని, ఇప్పుడూ ఉందని, మరో వందేళ్ల తర్వాత కూడా ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ గతంలో లేదని, భవిష్యత్తులో ఉంటుందో లేదో తెలియదని వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ను 90 అసెంబ్లీ, 15 లోక్‌సభ స్థానాల్లో గెలిపించాలని రేవంత్ ప్రజలకు పిలుపునిచ్చారు.
రాజ్యాంగ పరిరక్షణకు మరో ఉద్యమం: భట్టి
రాజ్యాంగ పరిరక్షణకు కాంగ్రెస్ శ్రేణులు మరో పెద్ద ఉద్యమానికి సిద్ధం కావాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. దేశంలోని ప్రతి పౌరుడి హక్కులను కాపాడుకోవాలంటే రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవడం అత్యంత అవసరమన్నారు. 1949 నవంబర్ 26న రాజ్యాంగ సభ భారత రాజ్యాంగాన్ని ఆమోదించిన రోజు దేశ చరిత్రలో అత్యంత కీలకమైనదన్నారు.
రాజ్యాంగం కేవలం రిజర్వేషన్లకే పరిమితం కాదని, ప్రతి పౌరుడి స్వేచ్ఛ, సమానత్వం, హక్కులకు భరోసా కల్పించే వ్యవస్థ అని వివరించారు. అంబేడ్కర్ మహిళల హక్కుల కోసం మంత్రి పదవిని సైతం త్యాగం చేసిన మహనీయుడని కొనియాడారు. బీజేపీ రాజ్యాంగాన్ని మార్చి, దాని అమలును బలహీనపరిచి ఏకవ్యక్తి పాలన ద్వారా నిరంకుశ విధానాలను తీసుకురావాలని ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. ఖర్గే, రాహుల్‌గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ శ్రేణులు ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు.
రాజ్యాంగ వ్యవస్థలను జేబు సంస్థలుగా మార్చారు: మహేశ్‌గౌడ్
మోదీ ప్రభుత్వం సీబీఐ, ఈడీతోపాటు ఎన్నికల కమిషన్‌ను తమ జేబు సంస్థలుగా మార్చుకుందని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ ఆరోపించారు. రాజ్యాంగ పరిరక్షణ ర్యాలీకి వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేక బీజేపీ కౌంటర్ ర్యాలీలు నిర్వహిస్తోందని చెప్పారు. ఎస్‌ఐఆర్ ప్రక్రియలో అర్హులైన ఓటర్ల పేర్లను తొలగిస్తున్నారని ఆరోపించారు. దేశం కోసం ప్రాణత్యాగాలు చేసిన నెహ్రూ, గాంధీ కుటుంబంపై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు సరికావన్నారు.
13 ఏళ్లుగా రాజ్యాంగానికి ఇబ్బందులు: బీఎం సందీప్
దేశ స్వాతంత్య్ర పోరాటంలో ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తల పాత్ర లేదని ఏఐసీసీ తెలంగాణ ఇన్‌చార్జి బీఎం సందీప్ వ్యాఖ్యానించారు. 13 ఏళ్లుగా దేశంలో రాజ్యాంగం ఇబ్బందులు ఎదుర్కొంటోందని ఆరోపించారు. లాల్‌బహదూర్ శాస్త్రి ఇచ్చిన ‘జై జవాన్.. జై కిసాన్’నినాదానికి భిన్నంగా మోదీ పాలనలో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విమర్శించారు. ఇందిరాగాంధీ ‘గరీబీ హఠావో’నినాదంతో పేదల అభ్యున్నతికి కృషి చేస్తే, ప్రస్తుత పాలనలో పేదల పరిస్థితి మరింత దుర్భరంగా మారిందని ఆరోపించారు. రాజ్యాంగం, ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు కాంగ్రెస్ దేశవ్యాప్తంగా పెద్దఎత్తున పోరాటం కొనసాగిస్తుందని చెప్పారు.


