జమ్మూకశ్మీర్‌లో RSS మార్చ్ చేయగా లేనిది .. ఇక్కడేంటి? | madras high court rss route march permission tamil nadu controversy | Sakshi
Sakshi News home page

జమ్మూకశ్మీర్‌లో RSS మార్చ్ చేయగా లేనిది .. ఇక్కడేంటి?

Oct 14 2026 7:46 PM | Updated on Oct 14 2026 8:07 PM

madras high court rss route march permission tamil nadu controversy

చైన్నై: తమిళనాడు ప్రభుత్వంపై మద్రాస్‌ హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. భారతదేశంలోనే అత్యంత సున్నితమైన, ఉగ్రవాద ప్రభావిత ప్రాంతంగా భావించే జమ్మూకశ్మీర్‌లోనే RSS తన రూట్ మార్చ్‌లను  నిర్వహించినప్పుడు.. తమిళనాడులో ఎందుకు పదే పదే ఆంక్షలు విధిస్తున్నారని ప్రశ్నించింది. ప్రభుత్వం తన స్వంత పౌరులను శత్రువులుగా పరిగణిస్తోందని మద్రాస్ హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. (RSS) రూట్‌ మార్చ్‌కు ప్రభుత్వం అనుమతులు నిరాకరించిడంపై దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు ఈ రోజు (బుధవారం) విచారించింది.

రాష్ట్రవ్యాప్తంగా అక్టోబర్ 18, 25, నవంబర్ 1 తేదీల్లో ఆర్ఎస్ఎస్ ‘రూట్ మార్చ్’ (పథ సంచలన్) ప్రదర్శనలను చేపట్టాలని పోలీసులను అనుమతి కోరింది. అయితే దీనికి పోలీసులు అనుమతి నిరాకరించారు. దీనిపై హైకోర్టులో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) ఉత్తర తమిళనాడు కార్యదర్శి వి.జి. జగదీశన్  పిటిషన్ దాఖలు చేశారు. దీని విచారణ సందర్భంగా హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది.

కోర్టు తన వ్యాఖ్యల్లో.. "రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా సరే, ఇలాంటి ప్రదర్శనల దరఖాస్తులను తిరస్కరించడమే పనిగా పెట్టుకుంటోంది. ప్రజాస్వామ్యంలో ఈ ధోరణి సరైంది కాదు. ప్రతి సంవత్సరం వీరు దరఖాస్తు చేసుకోవడం, పోలీసులు నిరాకరించడం, ఆపై కోర్టులు అనుమతులు ఇవ్వడం సర్వసాధారణంగా మారింది. గడిచిన సంవత్సరాల్లో జరిగిన ప్రదర్శనల్లో ఎక్కడైనా హింస చెలరేగిందా? అలాంటప్పుడు 2026 లో ప్రత్యేకంగా వచ్చిన ఇబ్బంది ఏమిటి? మీకున్న అసలు భయం ఏమిటి?" అని నేరుగా ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.

కేవలం RSS మాత్రమే కాకుండా, ద్రవిడార్ కజగం (DK) లాంటి భిన్న భావజాలాలున్న సంస్థలు లేదా రాజకీయ పార్టీలు నిర్వహించే బైక్ ర్యాలీలు, ప్రదర్శనలను కూడా పోలీసులు ఇలాగే అడ్డుకుంటున్నారని కోర్టు గుర్తుచేసింది. శాంతిభద్రతల పేరుతో పదే పదే అనుమతులు నిరాకరిస్తూ.. పోలీస్ శాఖే స్వయంగా తనపై నెగెటివ్ పబ్లిసిటీని కొనితెచ్చుకుంటోందని కోర్టు వ్యాఖ్యానించింది. ప్రజాస్వామ్య వ్యవస్థలో నిబంధనలకు లోబడి, శాంతియుతంగా ఊరేగింపులు మరియు భావప్రకటన చేయడం పౌరుల ప్రాథమిక హక్కు. అధికారులు పూర్తిగా నిషేధాలు విధించకుండా, కొన్ని షరతులతో కూడిన అనుమతులు ఇవ్వవచ్చని కోర్టు స్పష్టం చేసింది.

గతంలో సుప్రీంకోర్టు, హైకోర్టులు ఇచ్చిన మార్గదర్శకాలను పరిగణనలోకి తీసుకుని, ఈ ప్రదర్శనలకు సంబంధించి ప్రభుత్వం పోలీసులు ఒక శాంతియుతమైన పరిష్కారాన్ని కనుగొనాలని కోర్టు సూచించింది. ఆర్ఎస్ఎస్ ర్యాలీలకు అనుమతి ఇచ్చే అంశంపై పూర్తి స్థాయి నివేదిక మరియు పోలీసుల స్పందనను సమర్పించాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను వాయిదా వేసింది.


ఇదీ చదవండి:దివ్యాంగులకు కేంద్రం గుడ్‌న్యూస్‌

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement