‘సమ్మక్క’ డీపీఆర్‌ వెనక్కి | CWC Returns Sammakka Sagar Project DPR Over Incomplete Ayacut Details: Telangana | Sakshi
Sakshi News home page

‘సమ్మక్క’ డీపీఆర్‌ వెనక్కి

Nov 10 2026 4:28 AM | Updated on Nov 10 2026 4:28 AM

 CWC Returns Sammakka Sagar Project DPR Over Incomplete Ayacut Details: Telangana

అసమగ్రంగా ఉండటంతో సీడబ్ల్యూసీ చర్యలు

100% కమాండ్‌ ఏరియాను వెల్లడించాలని సూచన 

డీపీఆర్‌లో 10 శాతమే పొందుపరచడంపై అభ్యంతరం 

మళ్లీ సవరించిన డీపీఆర్‌ను సమర్పించాలని సూచన  

సాక్షి, హైదరాబాద్‌: సమ్మక్క సాగర్‌ ప్రాజెక్టు సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌)ను కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) రాష్ట్ర ప్రభుత్వానికి తిప్పి వెనక్కి పంపించింది. ప్రాజెక్టు కింద ప్రతిపాదించిన కమాండ్‌ ఏరియా వివరాలు అసమగ్రంగా ఉండడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా పలు సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించిన డీపీఆర్‌లను సైతం ఇదే కారణంతో ఆయా రాష్ట్రాలకు సీడబ్ల్యూసీ తిప్పి పంపించింది. ఈ ప్రాజెక్టులన్నింటినీ పరిశీలన, మదింపు జరపాల్సి ఉన్న ప్రాజెక్టుల జాబితా నుంచి తొలగించింది.

ఇందులో సమ్మక్కసాగర్‌ ప్రాజెక్టు సైతం ఉంది. సమ్మక్కసాగర్‌ ప్రాజెక్టు కింద 10 శాతం కమాండ్‌ ఏరియాను మాత్రమే నిర్థారించి 2011లో సీడబ్ల్యూసీకి డీపీఆర్‌ను సమర్పించారు. తప్పనిసరిగా 100 శాతం కమాండ్‌ ఏరియాను సర్వే చేసి ధ్రువీకరించిన ప్రాజెక్టుల డీపీఆర్‌లను మాత్రమే     అనుమతుల కోసం మదింపు జరుపుతామని ఈ సందర్భంగా సీడబ్ల్యూసీ స్పష్టం చేసింది. భౌగోళికంగా ఏదైన ప్రాజెక్టు కింద సాగు, తాగు, ఇతర అవసరాలకు నీటిని సరఫరా చేసే ప్రాంతాలు కమాండ్‌ ఏరియా పరిధిలోకి వస్తాయి.

100 శాతం కమాండ్‌ ఏరియాను సర్వే చేసి ఆ మేరకు సవరించిన డీపీఆర్‌ను మళ్లీ సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ఇక సమ్మక్కసాగర్‌ ప్రాజెక్టుకు సంబంధించిన మొత్తం కమాండ్‌ ఏరియాను సర్వే చేసినట్టు ధ్రువీకరిస్తూ రాష్ట్ర నీటిపారుదల శాఖలోని సెంట్రల్‌ డిజైన్స్‌ ఆర్గనైజేషన్‌ (సీడీఓ) సరి్టఫికెట్‌ జారీ చేయడం పట్ల అభ్యంతరం తెలిపింది. ప్రాజెక్టు కమాండ్‌ ఏరియాలో 500 హెక్టార్లు లేదా 10 శాతం ప్రాంతాన్ని మూడు విభాగాలుగా విభజించి సమగ్రంగా సర్వే చేసినట్టు సరి్టఫికెట్‌లో పేర్కొనడాన్ని తప్పుబట్టింది. కాల్వలకు సంబంధించిన సర్వేలను సైతం 10 శాతమే జరిపినట్టు పేర్కొంది. ప్రాజెక్టుల డీపీఆర్‌ మదింపునకు సంబంధించిన కొత్త మార్గదర్శకాలకు ఇది విరుద్ధమని స్పష్టం చేసింది.  

మళ్లీ సవరించిన డీపీఆర్‌ సమర్పించాలి  
గత అక్టోబర్‌ 15న జారీచేసిన మార్గదర్శకాల ప్రకారం.. ప్రాజెక్టు కమాండ్‌ ఏరియాలో టెయిల్‌ ఎండ్‌ (చివరి ఆయకట్టు) వరకు 100 శాతం ప్రాంతాన్ని సర్వే చేసి నిర్థారణ జరపాలని సీడబ్ల్యూసీ గుర్తు చేసింది. దీనికి తోడు ప్రధాన కాల్వలు, బ్రాంచీ కాల్వలు, డి్రస్టిబ్యూటరీలు, మైనర్లు సహా మిగిలిన అన్ని కాల్వల వ్యవస్థలు, నిర్మాణాల విషయంలో సైతం 100 శాతం సర్వే నిర్వహించాల్సిందేనని తేల్చి చెప్పింది. కొత్త మార్గదర్శకాలను అనుసరిస్తూ మళ్లీ డీపీఆర్‌ను సవరించి సమర్పించాలని కోరింది.

డీపీఆర్‌ తయారీకి సర్వే కోసం డ్రోన్లు, లిడార్, డీజీపీఎస్‌/ఆర్టీకే–జీపీఎస్, హెచ్‌ఆర్‌ఎస్, జీఐఎస్, హైరిజల్యూషన్‌ డిజిటల్‌ ఎలివేషన్‌ వెడల్స్‌ వంటి ఆధునిక సాంకేతికను వినియోగించాలని కోరింది. ప్రాజెక్టు డిజైన్లు, డ్రాయింగ్స్‌లను సీడీఓ ఆమోదిస్తూ జారీ చేసిన సరి్టఫికెట్‌ను జత చేసి మళ్లీ సమర్పించాలని సూచించింది. రూ.9,257 కోట్లతో చేపట్టిన సమ్మక్కసాగర్‌ బరాజ్‌ పనులు 95 శాతం పూర్తయ్యాయి. బరాజ్‌లో నిల్వ చేసిన నీటిని దేవాదుల ఎత్తిపోతల పథకం కింద ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం, వరంగల్‌ జిల్లాల్లోని ఆయకట్టుకు సరఫరా చేయాల్సి ఉంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement