‘ప్రజాబలం’తో సునామీ | CM Revanth Reddy Public Meeting in Kodangal and Lagacharla | Sakshi
Sakshi News home page

‘ప్రజాబలం’తో సునామీ

Nov 10 2026 1:11 AM | Updated on Nov 10 2026 1:11 AM

CM Revanth Reddy Public Meeting in Kodangal and Lagacharla

లగచర్ల రైతు మహాసభ ప్రాంగణంలో వివిధ అభివృద్ధి పనుల శిలాఫలకాలను ఆవిష్కరించిన అనంతరం అభివాదం చేస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి. చిత్రంలో వాకిటి శ్రీహరి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, అజహరుద్దీన్, వివేక్, మహేశ్‌కుమార్‌గౌడ్, భట్టి విక్రమార్క, రామ్మోహన్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వర్‌రావు, దామోదర రాజనర్సింహ, శ్రీధర్‌బాబు, యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, కాలె యాదయ్య, వేం నరేందర్‌రెడ్డి, సుదర్శన్‌రెడ్డి, వీర్లపల్లి శంకర్‌

ఢిల్లీలో ప్రధాని మోదీ.. ఫాంహౌస్‌లో కేడీ.. అందులో కొట్టుకుపోవాలి

లగచర్ల రైతు మహాసభలో సీఎం రేవంత్‌రెడ్డి  

పోలేపల్లి ఎల్లమ్మ మీద ఆన... ఎవరు అడ్డం పడ్డా తొక్కుకుంటూ వెళ్లి కొడంగల్‌ పొలాలు తడిపి తీరుతా.. 

కేసీఆర్‌ చేసిన అప్పులు, తప్పులతో ఏడాదికి రూ.80 వేల కోట్లు వడ్డీకే...  పాలమూరు జిల్లా ప్రాజెక్టులను పదేళ్లు పడావు పెట్టిండు  

సీఎంగా బాధ్యత ఇచ్చినా పాలమూరు జిల్లా గుండెలపై తన్ని గజ్వేల్‌కు పోయిండు 

డిసెంబర్‌ నాటికి కృష్ణా జలాలు తెచ్చి కొడంగల్‌ 

బీడు భూములను తడుపుతాం... ఏడాదికి సరిపడా బియ్యం ఉన్నాయి.. నీళ్లనే పొదుపుగా వాడండి

వికారాబాద్‌: ‘సంక్రాంతి నుంచి నిర్వహించే ప్రజాబలం కార్యక్రమంతో సునామీ సృష్టిస్తా.. ఢిలీల్లోని మోదీ.. ఫామ్‌హౌస్‌లోని కేడీ ఇందులో కొట్టుకుపోవాలి. కొడంగల్‌ ప్రజల ఆశీర్వాదం ఉంటే మోదీనైనా.. కేడీనైనా ఎదిరిస్తా.. తెలంగాణను దేశంలోనే నంబర్‌ వన్‌ రాష్ట్రంగా తీర్చిదిద్దుతా’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. సోమ వారం సాయంత్రం పోలేపల్లి ఎల్లమ్మను దర్శించుకున్న ఆయన ఆలయం నుంచి రెండు కిలోమీటర్ల మేర పాదయాత్రగా వికారాబాద్‌ జిల్లా కొడంగల్‌ పరిధిలోని లగచర్లలో ఏర్పాటు చేసిన రైతు మహాసభకు చేరుకుని మాట్లాడారు.

ఈ సందర్భంగా రూ.9,100 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ‘ఆనాడు పార్లమెంటు ఎన్నికల్లో గెలిపించిన కేసీఆర్‌ పాలమూరు ప్రాజెక్టులు పూర్తి చేస్తారని నమ్మాం.. తెలంగాణ రావాలని.. కష్టాలు తీరాలని కనిపించిన దేవుడికల్లా దండం పెట్టాం.. తెలంగాణ వచి్చనా.. ముఖ్యమంత్రిగా బాధ్యత ఇచ్చినా పాలమూరు జిల్లా గుండెలపై తన్ని గజ్వేల్‌కు పోయిండు.

భుజాలపై మోసిన పాలమూరు జిల్లా ప్రాజెక్టులను పదేళ్లు పడావు పెట్టిండు. కక్షగట్టి పాలమూరు అభివృద్ధిని అడ్డుకున్నాడు. కేసీఆర్‌ చేసిన అప్పులకు, తప్పులకు ప్రతీ సంవత్సరం రూ.80 వేల కోట్లు చెల్లిస్తున్నాం. 34 నెలల్లో రూ.2 లక్షల కోట్లకుపైగా వడ్డీ  చెల్లించాం’ అని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.  

మాట్లాడాలి రమ్మంటే కేసీఆర్‌ రాడు.. 
‘కేసీఆర్‌ మాట్లాడదాం అంటే రాడు.. ఆయన తింటే బకాసురుడు.. పంటే కుంభకర్ణుడు.. మక్తల్‌–నారాయణపేట–కొడంగల్‌ ఎత్తిపోతల పనులు మేం మొదలుపెడితే.. కేసీఆర్, కేటీఆర్‌ అడ్డుకుంటామంటున్నారు. ఆనాడు కొడంగల్‌ బిడ్డలు చదువుకోవాలంటే పక్క జిల్లాలకు, పక్క రాష్ట్రాలకు వెళ్లాల్సి ఉండేది... ఉపాధి కోసం పుణే, ముంబైకి వలసలు వెళ్లేవారు.

ఇవాళ కొడంగల్‌ను ఎడ్యుకేషన్‌ హబ్‌గా చేసి.. ఉన్నత చదువులకు కొడంగల్‌ వచ్చేలా చేసుకుంటున్నం. కొడంగల్‌ అభివృద్ధి జరుగుతుంటే కొందరు ఏడుపులు మొదలు పెట్టిండ్రు.. ఇవాళ రూ.9 వేల కోట్లతో కొడంగల్‌లో అభివృద్ధి పనులు ప్రారంభించుకున్నం. రాబోయే రోజుల్లో వేల కోట్ల పెట్టుబడులు తెచ్చి అభివృద్ధి పథంలో నడిపిస్తాం’ అని రేవంత్‌రెడ్డి చెప్పారు. జర్నలిస్టులు అధైర్యపడొద్దని, మీ సమస్యలు, సాదకబాదకాలు తనకు తెలుసని వాటిని పరిష్కరించే బాధ్యత తనదేనని సీఎం హామీ ఇచ్చారు.  

ముక్కోటి దేవతల ఆశీస్సులతో..  
‘ఇన్నేళ్లు ఏ దేవుడూ మన కష్టాలు వినలేదు... 2023లో ముక్కోటి దేవతల ఆశీస్సులతో.. కొడంగల్‌ బిడ్డల ఆత్మగౌరవాన్ని నిలబెట్టే అవకాశం దక్కింది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన క్షణం నుంచి ఏ ఒక్కరోజైనా సెలవు తీసుకోలేదు. పదేళ్లలో కేసీఆర్‌ రూ.8 లక్షల 11 వేల కోట్లు అప్పు పెట్టి ఫామ్‌హౌస్‌లో పడుకున్నడు. నాకు అప్పు చేసే అలవాటు లేదు.. అబద్ధాలు చెప్పే అలవాటు అసలే లేదు.. ప్రభుత్వ ఉద్యోగుల కష్టాలు చూసి 11 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులకు మొదటి తారీఖున జీతాలు ఇవ్వాలని ఆలోచన జేసినం. 2024 జనవరి నుంచి ప్రతీ నెల మొదటి తారీఖున జీతాలు పడుతున్నాయి’ అని రేవంత్‌రెడ్డి చెప్పారు.  

మీకెందుకు కడుపు మంట 
‘మేం లిఫ్ట్‌ ఇరిగేషన్‌ పనులు చేసుకుంటే మీకు కడుపుమంట ఎందుకు? డిసెంబర్‌ నాటికి కృష్ణా జలాలు తెచ్చి కొడంగల్‌ బీడు భూములను తడుపుతాం. కొడంగల్‌ భూముల్లో పచ్చని పంటలు పండేలా చేసే బాధ్యత నాది.. ఇది పోలేపల్లి ఎల్లమ్మతల్లిపై ఆన.. ఎవరు అడ్డమొచ్చినా.. అడ్డు వచ్చిన వారిని తొక్కుకుంటూ కొడంగల్‌కు కృష్ణా జలాలు తెస్తాం.. లక్ష ఎకరాల రైతు భూములు పారిస్తాం’ అరని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.

‘జెడ్పీటీసీ చేసిన.. ఎమ్మెల్సీ చేసిన.. ఎమ్మెల్యే చేసిన .. జెడ్పీటీసీ నుండి సీఎం వరకు నా ప్రజలు నాకు అన్నీ ఇచ్చారు.. ఇక తిరిగి ఇచ్చే బాధ్యత నాది.. వారికి కష్టాలు తీరుస్తా.. అండగా ఉంటా.. వారికి కావాల్సినవన్నీ ఇచ్చి వారి రుణం తీర్చుకుంటా. బూర్గుల రామకృష్ణారావు నుంచి ఇప్పటివరకు ఎంతో మంది పాలమూరు జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించినా ఈ ప్రాంతంలో వలసలు ఆగలేదు.

మన ప్రాజెక్టులు పూర్తి కాలేదు. మన పొలాలకు నీళ్లు అందించలేదు. ఈ 75 ఏళ్లలో ఒకరిని అడిగే పరిస్థితే తప్ప కావాల్సింది చేసే సమయం రాలేదు‘ అని సీఎం తెలిపారు. ఎల్‌నినోను కలిసి కట్టుగా ఎదుర్కొందామని, ఎవరు అధైర్య పడవద్దని పిలుపునిచ్చారు. కరువు కాలంలో మీతో ఉంటా.. ప్రతి నియోజకవర్గంలో ఇలాంటి మీటింగులు పెడతానని చెప్పారు. ఏడాదికి సరిపడా బియ్యం మనకు అందుబాటులో ఉన్నాయని, నీళ్లనే కాస్త పొదుపుగా వాడుకోవాలని సూచించారు.  
 
కొడంగల్‌లో మహాద్భుతం జరుగుతుంది: భట్టి 
‘దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా తెలంగాణలో అభివృద్ది జరుగుతోంది. సంక్షేమంలో దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాం. పేదలకు 8 లక్షల ఇళ్లు నిర్మించాం. పేదలందరికీ సన్నబియ్యం ఇస్తున్నాం. 27 లక్షల మంది విద్యార్థులకు బ్రేక్‌ఫాస్ట్‌ పథకం అమలు చేస్తున్న ప్రభుత్వం కేవలం మా ప్రజా ప్రభుత్వమే’ అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చెప్పారు.

కొడంగల్‌లోనే అన్ని రకాల విద్యాసంస్థలు.. జూరాల నుంచి కృష్ణా జలాలు.. లక్షల ఎకరాలతోపాటు పరిశ్రమలకు కూడా నీళ్లిచ్చే కార్యక్రమం శరవేగంగా సాగుతోంది. కొడంగల్‌లో మహాద్భుతం జరుగుతుంది.. ఒక విజనరీగా పనులు సాగుతున్నాయి. భవిషత్తులో లక్షల పెట్టుబడులు రానున్నాయి. ఇది రాబోయే తరాలకు ఎంతో మేలు చేస్తుంది’ అని భట్టి చెప్పారు.  

చరిత్రలో నిలిచిపోయే ఘట్టం: స్పీకర్‌ 
‘కొడంగల్‌ గడ్డపై రూ.9,500 కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు ప్రారం¿ోత్సవాలు జరగడం చాలా ఆనందంగా ఉంది. ఇది కదా అభివృద్ధి. ఇది కొడంగల్‌ చరిత్రలో నిలిచిపోయే ఘట్టం. రాష్ట్ర అభివృద్ధి కోసం, అన్ని వర్గాల సంక్షేమం కోసం, మన ముఖ్యమంత్రి అహరి్నశలు కష్టపడుతున్నారు. ఈ మాదిరిగా ప్రజల కోసం కష్టపడే ముఖ్యమంత్రుల్లో అనాడు వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డిని చూశాను. ఇవాళ రేవంత్‌ రెడ్డిని చూస్తున్నాను. ఆనాడు వైఎస్‌ పేదల కోసం అనేక పథకాలు అమలు చేస్తే.. ఇయ్యాల రేవంత్‌ రెడ్డి కూడా అనేక పథకాలను అమలు చేస్తున్నాడు’ అని శాసనసభ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ కుమార్‌ చెప్పారు.

మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావ్‌ మాట్లాడుతూ.. అస్తవ్యస్తం, నిరీ్వర్యం, నిర్లక్ష్యం చేసిన తెలంగాణాను ఇప్పుడు గాడిలో పెడుతుంటే ఓర్వలేక నాశనం చేసిన వాళ్లే ఇప్పుడు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని విమర్శించారు. మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. ‘రైతులకు అన్యాయం జరగకూడదని ఎన్ని ఇబ్బందులు వచ్చినా రుణమాఫీ చేసినం.. నూతన టెక్నాలజీతో వ్యవసాయానికి అధునాతన సాంకేతికత అద్దుతున్నాం. రైతు పండించిన ప్రతి పంటకు మద్దతు ధర అందిస్తున్నాం’ అని చెప్పారు.

పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌ మాట్లాడుతూ ‘రేవంత్‌రెడ్డి మీ కొడంగల్‌ బిడ్డగా మీకు ఉద్యోగావకాశాలు.. ఉపాధి అవకాశాలు.. విద్యా, వైద్యవకాశాలు కల్పించి మంచి పేరు తెచ్చుకుంటున్నారు’ అని చెప్పారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, అజహరుద్దీన్, వివేక్, ఎమ్మెల్యేలు రామ్మోహన్‌రెడ్డి, మనోహర్‌రెడ్డి, యాదయ్య తదితరులు పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement