కీస‌ర పోలీస్ స్టేష‌న్‌లో ఎందుకిలా? | Why Keesara Police Station Officials Trapped in ACB | Sakshi
Sakshi News home page

2 నెల‌ల్లో ముగ్గురు పోలీసులు అరెస్ట్‌!

Nov 9 2026 8:09 PM | Updated on Nov 9 2026 8:26 PM

Why Keesara Police Station Officials Trapped in ACB

తెలంగాణ‌లోని ఒకే పోలీస్ స్టేషన్‌లోని అధికారులు వరుసగా అవినీతి కేసుల్లో ఇరుక్కోవ‌డం పోలీస్ శాఖలో కలకలం రేపుతోంది. మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కీసర పోలీస్ స్టేషన్‌లో ప‌నిచేస్తున్న ముగ్గురు ఉన్న‌తాధికారులు ఇటీవ‌ల కాలంలో లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్క‌డం సంచ‌ల‌నంగా మారింది. దీంతో కీసర పోలీస్ స్టేషన్ పేరు మ‌రోసారి వార్త‌ల్లో నిలిచింది. ఈ పోలీస్ స్టేషన్‌కు చెందిన శ్రీ‌నివాస్ అనే ఎస్ఐ రూ. 2 ల‌క్ష‌లు లంచం తీసుకుంటూ తాజాగా ఏసీబీకి ప‌ట్టుబ‌డ్డారు.

2 నెల‌లు కూడా గ‌డ‌వ‌క‌ముందే..
అవినీతి ఆరోప‌ణ‌ల‌తో కీసర పోలీస్ స్టేషన్ వార్త‌ల్లోకి ఎక్క‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. సెప్టెంబ‌ర్ రెండో వారంలో జ‌రిగిన ఏసీబీ దాడుల్లో అప్ప‌టి సీఐ ఆంజనేయులు, ఎస్‌ఐ జ్ఞానేందర్‌రెడ్డి ప‌ట్టుబ‌డ్డారు. ఓ కేసులో నిందితుడికి బెయిల్‌ ఇప్పించేందుకు రూ.10 లక్షలు డిమాండ్ చేయ‌డంతో వీరిద్ద‌రినీ ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. 2 నెల‌లు కూడా గ‌డ‌వ‌క‌ముందే ఇప్పుడు ఎస్‌ఐ శ్రీనివాస్ కూడా ఏసీబీకి దొరికిపోవ‌డంతో కీసర పోలీస్ స్టేషన్ పేరు మ‌ళ్లీ వార్త‌ల్లోకి వ‌చ్చింది. ఒకే పోలీస్ స్టేషన్‌లోని అధికారుల‌పై వరుసగా అవినీతి ఆరోపణలు రావ‌డం పోలీస్ శాఖలో కలకలం రేపుతోంది.

ఇదీ చ‌ద‌వండి: కీసర పోలీస్ స్టేషన్‌లో ఏసీబీ మరో ట్రాప్

ఇప్ప‌టికైనా మేలుకుంటారా?
కీసర పోలీస్ స్టేషన్‌లో ప‌నిచేసే ఉన్న‌తాధికారుల‌పై గ‌త కొంత కాలంగా తీవ్ర ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి. త‌మ ద‌గ్గ‌ర‌కు వ‌చ్చే వారిని లంచం కోసం వేధిస్తున్నార‌న్న‌ ఆరోప‌ణ‌లు బాధితుల నుంచి ఎక్కువ‌గా విన్పిస్తున్నాయి. లంచాల కోసం చెండుకు తింటున్నార‌ని బాధితులు వాపోతున్నారు. అలాగే న్యాయం కోసం స్టేష‌న్ మెట్లు ఎక్కినవారిని సిబ్బంది చుల‌క‌న‌గా చూస్తున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. ఇప్ప‌టికైనా ఉన్న‌తాధికారులు జోక్యం చేసుకుని ప‌రిస్థితులను చ‌క్క‌దిద్ద‌క‌పోతే కీసర పోలీస్ స్టేషన్ ప్ర‌తిష్ట‌కు భంగం వాటిల్లే ప్ర‌మాదం ఉంద‌ని అంటున్నారు. ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో పోలీసులు ఉన్న‌తాధికారులు ఎలాంటి చ‌ర్య‌లు చేప‌డ‌తారోన‌ని ప్ర‌జ‌లు ఎదురు చూస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement