1,200 మంది విద్యార్థులకు 10 మందే ఫ్యాకల్టీ! | Kothagudem university faculty shortage: Telangana | Sakshi
Sakshi News home page

1,200 మంది విద్యార్థులకు 10 మందే ఫ్యాకల్టీ!

Nov 10 2026 4:11 AM | Updated on Nov 10 2026 4:11 AM

Kothagudem university faculty shortage: Telangana

కొత్తగూడెం ఎర్త్‌ సైన్సెస్‌ యూనివర్సిటీలో బోధనా సిబ్బంది కొరత 

128 మంది అధ్యాపకులు అవసరం కాగా మంజూరైంది 33 పోస్టులే

పని చేస్తున్నది 15 మందే.. అందులో డిప్యుటేషన్‌పై వెళ్లిన ఐదుగురు 

ప్రైవేటు కాలేజీల గెస్ట్‌ లెక్చరర్లు, సింగరేణి 

నిపుణులతో బోధన     అందుతున్న వైనం 

ప్రభుత్వం దృష్టి పెట్టాలని కోరుతున్న విద్యావేత్తలు

సాక్షి, హైదరాబాద్‌: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో గతేడాది డిసెంబర్‌లో ప్రారంభమైన డాక్టర్‌ మన్మోహన్‌సింగ్‌ ఎర్త్‌ సైన్సెస్‌ యూనివర్సిటీలో ఇప్పటికీ మౌలిక వసతులు, బోధనా సిబ్బంది, పరిపాలనా వ్యవస్థ పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాలేదు. భూవిజ్ఞాన శాస్త్రం, జియోఫిజిక్స్, జియోకెమిస్ట్రీ, పర్యావరణ శ్రస్తాలతోపాటు ఇంజనీరింగ్‌ విభాగాల్లో నాణ్యమైన విద్య అందించాలన్న లక్ష్యంతో దీన్ని ఏర్పాటు చేయగా ప్రస్తుతం అధ్యాపకుల కొరత విద్యా బోధనకు ప్రధాన అడ్డంకిగా మారింది.

యూనివర్సిటీలో ఇంజనీరింగ్, ఎర్త్‌ సైన్సెస్‌ విభాగాల్లో సుమారు 1,200 మంది విద్యార్థులకు బోధించేందుకు 128 మంది అధ్యాపకులు అవసరమని అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. కానీ ప్రస్తుతం మంజూరైన అధ్యాపక పోస్టులు 33 మాత్రమే. వారిలోనూ 15 మందే వర్సిటీలో విధులు నిర్వహిస్తున్నారు. అయితే వారిలో ఐదుగురు కాకతీయ యూనివర్సిటీకి డిప్యుటేషన్‌పై వెళ్లడంతో రెగ్యులర్‌ అధ్యాపకుల సంఖ్య 10కి తగ్గింది. అవసరమైన సిబ్బందితో పోలిస్తే ప్రస్తుతం ఉన్న అధ్యాపకుల సంఖ్య చాలా తక్కువగా ఉండటంతో విద్యార్థులకు నాణ్యమైన బోధన అందించడం సవాల్‌గా మారింది. 

భూవిజ్ఞాన శ్రస్తానికి అధ్యాపకులేరి? 
యూనివర్సిటీలో అత్యంత కీలకమైన భూవిజ్ఞాన శాస్త్ర విభాగానికి ఒక్క అధ్యాపకుడు కూడా లేకపోవడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. ప్రత్యేకంగా ఎర్త్‌ సైన్సెస్‌ విద్యను అందించేందుకు ఏర్పాటు చేసిన సంస్థలోనే సంబంధిత సబ్జెక్టులకు బోధకులు లేకపోవడం విద్యార్థులను ఆందోళన కు గురిచేస్తోంది. ప్రస్తుతం 10 మంది రెగ్యులర్‌ అధ్యాపకులు, ఏడుగురు కాంట్రాక్టు లెక్చరర్లతోనే  వర్సిటీలో బోధన కొనసాగుతోంది.

ప్రైవేటు కళాశాలల నుంచి గెస్ట్‌ లెక్చరర్లు, సింగరేణి కాలరీస్‌ కంపెనీ లిమిటెడ్‌ (ఎస్‌సీసీఎల్‌)కు చెందిన భూవిజ్ఞాన శాస్త్ర నిపుణులు, ప్రభుత్వ విభాగాల సిబ్బందిని బోధనకు వినియోగిస్తున్నారు. ఈ ప్రత్యామ్నాయ ఏర్పాట్లతో విద్యా కార్యక్రమాలు కొనసాగుతున్నప్పటికీ పూర్తిస్థాయి అధ్యాపక వ్యవస్థకు ఇవి ప్రత్యామ్నాయం కాలేవన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఇటీవల పలు వర్సిటీలకు ప్రభుత్వం 500 అధ్యాపక పోస్టుల భర్తీకి అనుమతించింది. అందులో ఎర్త్‌ యూనివర్సిటీకి మాత్రం ఒక్క పోస్టు కూడా ఇవ్వలేదు. పూర్తిస్థాయి పరిపాలనా వ్యవస్థ లేకపోవడంతో విద్యా కార్యక్రమాల నిర్వహణ, నియామకాలు, మౌలిక వసతుల అభివృద్ధి వంటి అంశాల్లో వేగం తగ్గుతోందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. తక్షణమే దీనిపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని విద్యావేత్తలు, విద్యార్థులు కోరుతున్నారు. 

కొత్త దిశ అందించే వర్సిటీ 
అన్ని వనరులున్న ప్రాంతంలో ఎర్త్‌ యూనివర్శిటీని ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. ఇందుకు అనుగుణంగా ఏడాది క్రితం వ్యూహాత్మక విజన్‌ డాక్యుమెంట్‌ ఇచ్చాం. ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్‌ ఉన్న కోర్సులపై సమగ్ర వివరాలు రూపొందించాం. ఈ కోర్సులను పూర్తి స్థాయిలో అందిస్తే విద్యార్థులకు ఉపయుక్తంగా ఉంటుంది. ఇది తెలంగాణాకు దిశా నిర్ధేశం చేసే విశ్వవిద్యాలయం. 
– ప్రొఫెసర్‌ వి. బాలకిష్టారెడ్డి, ఉన్నత విద్యామండలి చైర్మన్‌ 

సీటు వచ్చినా చేరలేదు 
ఎర్త్‌ వర్సిటీలో సీటు వచ్చినా చేరలేకపోయా. ప్రభుత్వం చెప్పింది ఒకటి. వాస్తవంగా అక్కడ ఉన్న పరిస్థితి వేరు. వర్సిటీలో మౌలిక వసతులు, బోధకులు లేరు. ఈ పరిస్థితుల్లో విద్యా సంవత్సరం వృథా అవుతుందనే ఉద్దేశంతోనే చేరలేదు.  
– సుమంత వర్మ, విద్యారి్థ, కొత్తగూడెం  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement