కనీస వేతనాల ఖరారు తర్వాత తొలి వీడీఏ జాడలేదు
ఈ ఏడాది జూన్ నుంచి కొత్త వేతనాలకు ప్రభుత్వం నిర్ణయం... అక్టోబర్ ముగిసినా వీడీఏ ప్రకటించకపోవడంతో కార్మీకుల్లో ఆందోళన
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కార్మీకుల కనీస వేతనాలపై కొత్త విధానం ప్రకటించినా వేరియబుల్ డియర్నెస్ అలవెన్స్ (వీడీఏ)పై స్పష్టత కరువైంది. ఈ ఏడాది జూన్ 1 నుంచి కార్మికులకు కొత్తగా కనీస వేతనాలను అమల్లోకి తెస్తూ ప్రభుత్వం మే 30న జీవో నంబర్ 6 జారీ చేసింది. నాలుగు నైపుణ్య విభాగాలు, మూడు భౌగోళిక జోన్ల ఆధారంగా వేతనాలను నిర్ణయించింది. అయితే ఈ కొత్త వేతనాలకు అనుసంధానంగా ఆరు నెలలకోసారి సవరించాల్సిన కరువు భత్యం జాడ లేదు. అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రావాల్సిన తొలివిడత వీడీఏ నవంబర్ వచ్చినా ప్రకటించకపోవడంతో కార్మీకులు ఆందోళన చెందుతున్నారు.
నిత్యావసరాలు, ఇంధనం, రవాణా, ఇంటి అద్దెల ధరలు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో ధరల పెరుగుదల ప్రభావం కార్మికులపై పడకుండా ఉండేందుకు వేతనాలకు అదనంగా కరువు భత్యాన్ని చెల్లిస్తారు. అదే వీడీఏ. వినియోగదారుల ధరల సూచీ (సీపీఐ)లో నమోదయ్యే మార్పుల ఆధారంగా దీన్ని లెక్కిస్తారు. సాధారణంగా ప్రతి ఏటా ఏప్రిల్ 1, అక్టోబర్ 1 నుంచి వీడీఏ సవరణలు అమల్లోకి వస్తాయి.
తెలంగాణ ప్రభుత్వ జీవో నంబర్ 6లోనూ ఏప్రిల్, అక్టోబర్‌లలో ఆరు నెలలకోసారి జీవన వ్యయ భత్యాన్ని ప్రకటించాలని స్పష్టం చేసింది. ఇందుకోసం డిసెంబర్, జూన్‌తో ముగిసే ఆరు నెలల కాలానికి సంబంధించిన సగటు ధరల సూచీ పెరుగుదలను పరిగణనలోకి తీసుకోవాలి. జనవరి–జూన్ సూచీ ఆధారంగా అక్టోబర్ విడత భత్యాన్ని నిర్ణయించాలి. కానీ అక్టోబర్ నెల దాటినా కనీసం వీడీఏపై ప్రభుత్వంలో కనీస సమీక్ష జరగకపోవడం గమనార్హం.
కార్మీకులకు నష్టం...
వీడీఏ సకాలంలో ప్రకటించకపోతే తీవ్రంగా నష్టపోయేది కార్మీకులే. రాష్ట్రంలో 1.15 కోట్ల మంది కార్మీకులున్నట్లు కార్మీక శాఖ గణాంకాలు చెబుతున్నాయి. ప్రతి ఆరు నెలలకోసారి వీడీఏ ప్రకటించకపోతే మార్కెట్లో ధరలు పెరిగినా కార్మీకుల వేతనాల్లో దానికి అనుగుణమైన సవరణ ఉండదు. దీంతో వారి వాస్తవ ఆదాయం, కొనుగోలు శక్తి తగ్గిపోయే ప్రమాదం ఉంటుంది. అసంఘటిత రంగ కార్మీకులు, పారిశ్రామిక కార్మీకులు, భవన నిర్మాణ రంగం, భద్రతా సిబ్బంది, పారిశుద్ధ్య కార్మీకులు, దుకాణాలు, వాణిజ్య సంస్థల్లో పనిచేసే ఉద్యోగులపై ఈ ప్రభావం తీవ్రంగా పడుతుంది.
వీడీఏ పెంపు ఆలస్యమైతే కార్మీక కుటుంబాల ఆర్థిక పరిస్థితిపై ప్రభావం పడుతుంది. మరోవైపు కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ విధానంలో పనిచేసే వారి విషయంలోనూ కనీస వేతనాల అమలుపై స్పష్టత అవసరం. ఈ నేపథ్యంలో వీడీఏ సవరణను వెంటనే ప్రకటించాలని కార్మీక సంఘాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి. ధరల సూచీ ఆధారంగా పెరగాల్సిన భత్యాన్ని సకాలంలో చెల్లించేలా శాశ్వత విధానం రూపొందించాలని.. ఆరు నెలలకోసారి ఉత్తర్వులు విడుదలయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాయి.


