జనవరి 25 నుంచి జనగణన | Telangana Caste Census to Begin from January 25 2027 | Sakshi
Sakshi News home page

జనవరి 25 నుంచి జనగణన

Nov 10 2026 4:33 AM | Updated on Nov 10 2026 4:33 AM

Telangana Caste Census to Begin from January 25 2027

స్వీయ గణనకు జనవరి 10 నుంచి 24 వరకు అవకాశం 

ఫిబ్రవరి 28తో ముగియనున్న ఇళ్ల వారీ జనాభా లెక్కింపు 

2027 మార్చి 1 జనాభా ప్రామాణికం

సాక్షి, హైదరాబాద్‌: జనగణన–2027 రెండోదశ నిర్వహణకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. రాష్ట్రంలో 2027 జనవరి 25 నుంచి ఫిబ్రవరి 28 వరకు ఇళ్ల వారీగా జనగణన చేపట్టనున్నారు. కేంద్ర హోంశాఖ పరిధిలోని భారత రిజిస్ట్రార్ జనరల్, జనగణన కమిషనర్‌ జారీ చేసిన నోటిఫికేషన్‌ను రాష్ట్ర ప్రభుత్వం పునఃప్రచురించింది. ఈ మేరకు ప్రభుత్వం సాధారణ పరిపాలన విభాగం జీఓ నంబర్‌ 155ను సోమవారం విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ను రాష్ట్ర గెజిట్‌లో ప్రచురిస్తారు.  

⇒ జనగణన–2027లో భాగంగా ప్రజలకు స్వయంగా తమ వివరాల ను నమోదు చేసుకునే అవకాశాన్ని కేంద్రం కల్పించింది. 2027 జన వరి 10 నుంచి 24 వరకు స్వీయ గణన నమోదుకు గడువిచ్చింది.  

⇒ జనవరి 25 నుంచి జనగణన సిబ్బంది ఇంటింటికి తిరిగి వివరాలు సేకరిస్తారు. ఈ ప్రక్రియ వచ్చే ఫిబ్రవరి 28 వరకు కొనసాగుతుంది. 
⇒ వివరాల సవరణలు, మిగిలిపోయిన గణన ప్రక్రియను పూర్తి చేసేందుకు మార్చి 1 నుంచి 5 వరకు రివిజినల్‌ రౌండ్‌ నిర్వహిస్తారు. 
మార్చి 1 అర్ధరాత్రి 12 గంటలే ప్రామాణికం జనగణనకు సంబంధించి 2027 మార్చి 1వ తేదీ అర్ధరాత్రి 12 గంటలను ప్రామాణిక సమయంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆ సమయానికి దేశంలో ఉన్న జనాభాను ప్రామాణికంగా తీసుకుంటారు. జనగణన చట్టం–1948, జనగణన నిబంధనలు–1990లోని సంబంధిత నిబంధనల ప్రకారం కేంద్ర ప్రభుత్వం ఈ తేదీలను ప్రకటించింది. 

⇒ మణిపూర్‌ (తదుపరి ప్రకటన వెలువడే వరకు), గోవా, ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, లడఖ్, హిమాచల్‌ప్రదేశ్, జమ్మూకశ్మీర్‌లోని మంచు ప్రభావిత ప్రాంతాలకు ఈ షెడ్యూల్‌ నుంచి మినహాయింపు ఇచ్చారు. తెలంగాణలో మాత్రం ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారమే జనాభా గణన జరుగుతుంది.  

రెండు విడతల్లో సెన్సెస్‌  
దేశంలో జనగణన రెండు విడతల్లో జరుగుతోంది. ఫేజ్‌–1లో హౌస్‌ లిస్టింగ్, హౌస్‌ సెన్సెస్‌ ఈ ఏడాది మే 11 నుంచి జూన్‌ 9 వరకు నిర్వహించారు. ఫేజ్‌–1లో భవనాలు, భవనాల్లో ఇళ్ల సంఖ్యను గుర్తించారు. వాటిని మార్కింగ్‌ చేయడంతోపాటు ఇంటి యజమాని, సభ్యులు, జంటలు, ఇంటిస్ట్రక్చర్, టెలిఫోన్, సెల్‌ఫోన్, గదుల సంఖ్య, ఎల్పీజీ, ట్యాప్, కరెంటు వసతులు, వనరులు, టూవీలర్, సైకిల్, త్రీ అండ్‌ ఫోర్‌ వీలర్, ఇంటర్నెట్, టాయిలెట్, బాత్‌రూమ్, తదితర 34 రకాల ప్రశ్నలకు సమాధానాలు స్వీకరించారు.  

⇒ ఫేజ్‌–1 తర్వాత డి్రస్టిక్ట్‌ సెన్సెస్‌ హ్యాండ్‌బుక్‌ రూపొందించారు. జిల్లా పరిధిలోని మండలాలు, గ్రామాలు, మున్సిపాలిటీలు, మున్సిపల్‌ డివిజన్ల వారీగా వసతులు, వనరులు, ప్రాజెక్టులు, ఇతర అంశాలతో కూడిన వివరాలు ఈ బుక్‌లో పొందుపర్చారు.  

⇒ తాజాగా ఫేజ్‌–2 ప్రక్రియ నిర్వహించేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. ఫేజ్‌–1లో ఇళ్లు, జనాభా ఆధారంగా ఎన్యుమరేషన్‌ బ్లాకులు విభజించారు. ఒక బ్లాక్‌లో గరిష్టంగా 800 జనాభాగా ఖరారు చేశారు. ఇప్పటికే ఫేజ్‌–1 పూర్తి చేసిన నేపథ్యంలో ఫేజ్‌–2 ప్రక్రియ సులభంగా పూర్తవుతుందని అధికారులు చెబుతున్నారు. ఈ ప్రక్రియలో 40 రకాల ప్రశ్నలున్నాయి. ఎన్యూమరేటర్లు ఇంటింటికి తిరిగి ఈ సమాచారాన్ని సేకరిస్తారు. ఈసారి జనగణన క్రతువును ‘స్మార్ట్‌’సెన్సెస్‌గా కేంద్రం ప్రకటించింది. 

జనగణన ప్రక్రియలో గతంలో కాగితాల్లో సమాచార సేకరణ ఉండేది. ఇప్పుడు ఎన్యూమరేటర్‌ మొబైల్‌ ఫోన్‌లో వివరాలు సేకరిస్తారు. ఇందుకోసం ప్రత్యేక యాప్‌/పోర్టల్‌ ద్వారా ప్రశ్నలకు సమాధానాలు స్వీకరిస్తారు. రాష్ట్రంలో ఫేజ్‌–2 సెన్సెస్‌ కోసం 80 వేల మంది టీచర్ల సేవలు వినియోగించుకోనున్నారు. 6–7 మంది ఎన్యూమరేటర్లకు ఒక సూపర్‌ వైజర్‌ ఉంటారు.  

సీఎస్‌ అధ్యక్షతన కోఆర్డినేషన్‌ కమిటీ  
జనగణన ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించేందుకు రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన ప్రత్యేక కమిటీ ఏర్పాటైంది. జనగణన కోసం జనరల్‌ అడ్మినిస్ట్రేషన్‌ డిపార్ట్‌మెంట్‌ ముఖ్య కార్యదర్శి నోడల్‌ అధికారిగా వ్యవహరిస్తున్నారు. ప్రతి జిల్లాలో కలెక్టర్‌ సెన్సెస్‌ అధికారిగా కొనసాగుతున్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో జీహెచ్‌ఎంసీ కమిషనర్, మండలాల్లో తహసీల్దార్‌ చార్జ్‌ ఆఫీసర్‌గా, పట్టణ ప్రాంతాల్లో మున్సిపల్‌ కమిషన్‌ చార్జ్‌ ఆఫీసర్‌గా వ్యవహరిస్తారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement