వరి సాగులో మీథేన్‌ ఉద్గారాలకు చెక్‌ | Curbing methane emissions in paddy cultivation | Sakshi
Sakshi News home page

వరి సాగులో మీథేన్‌ ఉద్గారాలకు చెక్‌

Oct 25 2026 3:56 AM | Updated on Oct 25 2026 3:56 AM

Curbing methane emissions in paddy cultivation

ఐసీఏఆర్‌ శాస్త్రవేత్తలు రూపొందించిన మిథనోట్రోఫ్స్‌ బ్యాక్టీరియాతో అద్భుత ఫలితాలు 

వరి సాగులో 40% మీథేన్‌కు కళ్లెం.. 3% అధిక దిగుబడి కూడా!

సాక్షి, స్పెషల్‌ డెస్క్‌  :  వాతావరణ మార్పులకు ప్రధాన కారణమవుతున్న గ్రీన్‌హౌస్‌ వాయువుల్లో మీథేన్‌ ఒకటి. దేశంలో నీరు నిల్వ గట్టే వరి పొలాల నుంచి ఏటా సుమారు 43 లక్షల మెట్రిక్‌ టన్నుల మీథేన్‌ వాతావరణంలోకి విడుదలవుతోంది. భూతాపం పెరుగుదలలో కార్బన్‌ డయాక్సైడ్‌ కంటే మీథేన్‌ ప్రభావం దాదాపు 28 రెట్లు ఎక్కువగా ఉంటోంది. దీన్ని కొంత వరకు తగ్గించడానికి పొలంలో నీరు నిరవధికంగా నిల్వగట్టకుండా ఆరుతడి (తడపటం, ఆరబెట్టటం) పద్ధతిలో సాగు చేస్తుంటారు. అయితే భారీ వర్షాలు, సరైన డ్రైనేజీ లేని పల్లపు ప్రాంతాల్లో ఈ పద్ధతిని అమలు చేయడం రైతులకు సాధ్యం కావట్లేదు. 

చింతపండు–తుమ్మబంకలతో తయారీ 
ఈ సమస్యకు పరిష్కారంగా మిథనోట్రోఫ్స్‌ (మీథేన్‌ను గ్రహించే బ్యాక్టీరియా) శాస్త్రవేత్తలు అద్భుత ప్రత్యామ్నాయాన్ని తెరపైకి తెచ్చారు. ఒడిశాలోని కేంద్ర వరి పరిశోధనా సంస్థ (ఐసీఏఆర్‌–సీఆర్‌ఆర్‌ఐ) శాస్త్రవేత్తలు చింతపండు–తుమ్మబంక ఆధారంగా ఎంటీ–22 అనే మిథనోట్రోఫ్‌ బ్యాక్టీరియా మిశ్రమాన్ని అభివృద్ధి చేశారు. ఈ బయో–ఉత్పత్తిని అంతర్జాతీయ వరి పరిశోధనా సంస్థ (ఐఆర్‌ఆర్‌ఐ), ప్రదాన్‌ సంస్థలు సంయుక్తంగా మధ్యప్రదేశ్‌లోని దిండోరి జిల్లాలో ఉన్న రైతుల పొలాల్లో ప్రయోగాత్మకంగా పరీక్షించాయి. 2025 ఖరీఫ్‌ సీజŒన్‌లో భారీ వర్షాల వల్ల ఆరుతడి పద్ధతి ద్వారా కేవలం 16 శాతమే మీథేన్‌ తగ్గింది. నీరు నిల్వ ఉన్న వరి పొలాల్లో మిథనోట్రోఫ్స్‌ బ్యాక్టీరియా మిశ్రమాన్ని ఇసుకలో కలిపి చల్లడం ద్వారా ఏకంగా 40 శాతం వరకు మీథేన్‌ ఉద్గారాలు తగ్గినట్లు పరిశోధకులు గుర్తించారు. 

లోతట్టు, ముంపు ప్రాంతాల రైతులకు మేలు  
ఉద్గారాలను తగ్గించడమే కాకుండా సాధారణ సాగుతో పోలిస్తే పంట దిగుబడిలో సుమారు 3 శాతం పెరుగుదల నమోదైంది. పొలంలో నీటిని ఆరబెట్టే అవకాశం లేని లోతట్టు, ముంపు ప్రాంతాల రైతులకు అదనపు పెట్టుబడి, శ్రమ లేకుండా ఈ పద్ధతి ఎంతో ప్రయోజనకరంగా మారనుంది. దక్షిణాసియా, ఆగ్నేయాసియా దేశాల్లోని డెల్టా ప్రాంతాలు, ముంపు పల్లపు భూముల్లో వరి సాగుకు ఈ విధానం విస్తృత ప్రయోజనాలను చేకూరుస్తుందని వ్యవసాయ నిపుణులు పేర్కొంటున్నారు. 

మీథేన్‌ను బ్యాక్టీరియా ఎలా అరికడుతుంది? 
మిథనోట్రోఫ్స్‌ సహజంగా నేలలో ఉండే సూక్ష్మజీవులు. ఇవి మీథేన్‌ వాయువును తమ ఆహారంగా, శక్తి వనరుగా వినియోగించుకుంటాయి. వరి పొలాల్లో నీరు నిరంతరం నిల్వ ఉండటం వల్ల నేలలో ప్రాణవాయువు లోపిస్తుంది. ఈ స్థితిలో నేలలోని ఇతర బ్యాక్టీరియా (మిథనోజె¯న్స్‌) సేంద్రియ పదార్థాన్ని కుళ్లింపజేస్తూ మీథేన్‌ వాయువును ఉత్పత్తి చేస్తాయి. తాజాగా శాస్త్రవేత్తలు రూపొందించిన మిథనోట్రోఫ్‌ బ్యాక్టీరియా మిశ్రమాన్ని పొలంలో వెదజల్లితే మీథేన్‌ను సాధారణ కార్బన్‌ రూపంలోకి మార్చడం ద్వారా వాతావరణ కాలుష్యాన్ని, ఉష్ణోగ్రత పెరుగుదలను గణనీయంగా అడ్డుకుంటుంది. 

ఈ బ్యాక్టీరియా నేలలోని సేంద్రియ సమతుల్యతను కాపాడటంతోపాటు కొన్ని రకాల పోషకాల లభ్యతను సులభతరం చేస్తుంది. దీనివల్ల వేర్ల వ్యవస్థ బలోపేతమై ధాన్యం దిగుబడి కూడా పెరుగుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ బ్యాక్టీరియాను పంట కాలంలో రెండుసార్లు ఎకరానికి కిలో చొప్పున పది కిలోల ఇసుకలో కలిపి చల్లాలి. ధర ఇంకా ఖరారు కానప్పటికీ కిలో రూ. 150–300 మధ్య ఉండొచ్చని అంచనా.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement