పర్యావరణానికి వరం
ఐఐటీ–బాంబే వినూత్న ఆవిష్కరణ
సాక్షి స్పెషల్ డెస్క్ : దైనందిన జీవితంలో ప్యాకింగ్ కవర్ల నుంచి కార్ల భాగాల వరకు ప్లాస్టిక్ నిత్యావసరంగా మారింది. అయితే, శతాబ్దాల తరబడి నశించిపోకుండా ఉండే ఈ సింథటిక్ ప్లాస్టిక్.. పర్యావరణానికి పెద్ద శాపంగా మారింది. ఈ సమస్యకు ఐఐటీ–బాంబే పరిశోధకులు అద్భుతమైన పర్యావరణ అనుకూల పరిష్కారాన్ని కనుగొన్నారు. అదే.. ‘గడ్డి ప్లాస్టిక్’. సాధారణంగా దొరికే అడవి గడ్డి, గరిక (బెర్ముడా గ్రాస్) సాయంతో అత్యంత బలమైన, చవకైన, ‘జీవ విచ్ఛిన్నం చెందే’ ప్లాస్టిక్‌ను అభివృద్ధి చేశారు.
కెమికల్స్ లేని సహజ బలం
గతంలోప్రకృతి సిద్ధమైన పీచును ప్లాస్టిక్‌తో కలపడానికి విషపూరిత రసాయనాలను వాడేవారు. కానీ ప్రొఫెసర్ అపర్ణ సింగ్ నేతృత్వంలోని బృందం ఎలాంటి సంక్లిష్ట రసాయనాలు లేకుండా, మన పరిసరాల్లో పెరిగే ‘ముంజా గడ్డి’, ‘గరిక’నారలను ప్లాస్టిక్‌తో విజయవంతంగా అనుసంధానించారు. వేగంగా పెరిగే గరికలోని పీచు స్వభావం ప్లాస్టిక్‌కు గట్టి తన్యత బలాన్ని (తెగిపోకుండా సాగే) ఇస్తుంది. ఇది పారిశ్రామికంగా వాడే ఖరీదైన సింథటిక్ గ్లాస్ ఫైబర్‌కు ఏమాత్రం తీసిపోదు.
3డీ ప్రింటింగ్‌లో...
హైడెన్సిటీ పాలిథిలిన్ (హెచ్‌డీపీఈ) ప్లాస్టిక్ చల్లబడేటప్పుడు వంకర్లు తిరుగుతుంది కాబట్టి దానితో 3డీ ప్రింటింగ్ చేయడం చాలా కష్టం. ఐఐటీ బాంబే బృందం ముంజా గడ్డి నారను (5 నుండి 40 శాతం వరకు) కలిపి వంకర్లు తిరగని 3డీ ప్రింటింగ్ ఫిలమెంట్‌ను తయారు చేసి ఈ సమస్యను పరిష్కరించింది.
‘గడ్డి ప్లాస్టిక్’ ఉపయోగాలు
» కార్లలో ఉపయోగించే ఫ్యూయల్ ట్యాంకులు, డాష్‌బోర్డ్‌లు, బంపర్లు, లోపలి ప్యానెల్స్ తయారీకి ఇది అనుకూలం. బరువు తక్కువగా ఉండి, ఎక్కువ బలాన్ని ఇస్తుంది.
» చెదలు పట్టని, తేమకు కుళ్లిపోని ఎకో–ఫ్రెండ్లీ బిల్డింగ్ ప్యానెల్స్, కుర్చీలు, టేబుల్స్ తయారీలో వాడొచ్చు.
» పర్యావరణానికి హాని చేసే సింగిల్–యూజ్ ప్లాస్టిక్ స్థానంలో రీసైకిల్ చేయగల ఈ కాంపోజిట్లను సులభంగా ఉపయోగించవచ్చు.
» వ్యర్థాలను తగ్గించి, ఉత్పత్తి ఖర్చును తగ్గించే ఈ ‘గడ్డి ప్లాస్టిక్’సుస్థిర తయారీ రంగంలో ఒక కొత్త అధ్యాయానికి నాంది పలకబోతోంది!


