సాగుబడి
వాతావరణ సంక్షోభం ముంగిట సాగు రంగం
భూతాపం ఇంకా పెరిగితే ఆహార భద్రతకే ముప్పు
తక్షణమే కట్టడి చేయకపోతే ఈ శతాబ్దంలో ఉష్ణోగ్రతలు 2.6–3.1 డిగ్రీల సెల్సియస్ వరకు పెరిగే ప్రమాదం
ఉద్గారాల్లో మూడింట ఒక వంతు వ్యవసాయందే.. ‘తగ్గింపులోనూ కీలక పాత్ర
ఐరాస పర్యావరణ విభాగం ‘ఎమిషన్స్ గ్యాప్ రిపోర్ట్ 2026’ హెచ్చరిక
భూతాపం పెరుగుదల, వాతావరణ మార్పుల తీవ్రత వ్యవసాయ రంగాన్ని పెను సంక్షోభంలోకి నెడుతున్నాయని ఐక్యరాజ్యసమితి పర్యావరణ విభాగం (యూఎన్ ఈపీ) తాజాగా వెలువరించిన ‘ఉద్గారాల వ్యత్యాస నివేదిక–2026’ (ఎమిషన్స్ గ్యాప్ రిపోర్ట్) హెచ్చరించింది. ప్రపంచవ్యాప్తంగా కర్బన ఉద్గారాల విడుదలను తక్షణమే కట్టడి చేయకపోతే ఈ శతాబ్దంలో ఉష్ణోగ్రతలు 2.6 నుంచి 3.1 డిగ్రీల సెల్సియస్ వరకు పెరిగే ప్రమాదం ఉందని స్పష్టం చేసింది.
ఈ పరిణామం వర్షపాత గతిని మార్చి, కరవులు, ఆకస్మిక వరదలను పెంచి చిన్న, సన్నకారు రైతుల ఉత్పాదకతను తీవ్రంగా దెబ్బతీస్తుందని పేర్కొంది. అదే సమయంలో, కర్బన ఉద్గారాల కట్టడిలో భూ యాజమాన్యం, సుస్థిర వ్యవసాయ పద్ధతులు అత్యంత కీలక పాత్ర పోషించగలవని నివేదిక వెల్లడించింది.
మీథేన్‌తో ముప్పు
యూఎన్‌ఈపీ ‘ఉద్గారాల వ్యత్యాస నివేదిక–2026’ ఇంకా ఏం చెబుతోందంటే.. ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న ఉద్గారాలలో వ్యవసాయం, భూ వినియోగ మార్పుల వాటా సుమారు మూడో వంతుగా ఉంది. ప్రపంచవ్యాప్త వ్యవసాయ రంగం నుంచి ఏటా సుమారు 6.5 గిగాటన్నుల ఉద్గారాలు వెలువడుతున్నాయి. ఇందులో పశువుల జీర్ణక్రియ ద్వారా వెలువడే మీథేన్, వరి పొలాల్లో నిల్వ ఉండే నీటి ద్వారా ఉత్పన్నమయ్యే మీథేన్, రసాయన ఎరువుల (యూరియా వంటివి) మితిమీరిన వాడకం వల్ల గాల్లోకి చేరే నైట్రస్ ఆక్సైడ్ ప్రధానమైనవిగా గుర్తించారు. పంటలకు విచ్చలవిడిగా రసాయనాలు వాడటం, అడవుల నరికివేత వల్ల భూమి తన సహజ కర్బన నిల్వ సామర్థ్యాన్ని కోల్పోతోందని నివేదిక పేర్కొంది.
పరిష్కారం ప్రకృతి ఆధారిత సాగులోనే
వాతావరణ మార్పులను అడ్డుకోవటానికి అటవీ సంరక్షణ, భూ యాజమాన్య పద్ధతులు, వ్యవసాయ రంగంలో మార్పుల ద్వారా 2030 నాటికి గణనీయమైన స్థాయిలో ఉద్గారాలను తగ్గించే అవకాశం ఉందని నివేదిక వివరించింది. అడవుల నరికివేతను పూర్తిగా నిలువరించటం, వ్యవసాయ భూముల్లో సేంద్రియ కర్బనాన్ని పెంచే పద్ధతులు చేపట్టటం, పశుగ్రాస నాణ్యతను మెరుగుపరచటం ద్వారా మీథేన్ శాతాన్ని తగ్గించవచ్చని స్పష్టం చేసింది. వాతావరణ మార్పుల ధాటిని తట్టుకునేందుకు ప్రపంచ దేశాలు తమ విధానాల్లో వ్యవసాయ రంగానికి ఆర్థిక తోడ్పాటు, సాంకేతిక సహకారం అందించాలని యూఎన్ ఈపీ సూచించింది.
భూమిని చల్లబరిచేది సుస్థిర సేద్యమే
పంట వ్యర్థాలను తగులబెట్టకుండా భూమిలోనే కలియదున్నటం, ఆచ్ఛాదన (మల్చింగ్) వేయం ద్వారా వాతావరణంలోని కర్బనాన్ని నేలలో శాశ్వతంగా స్థిరీకరించవచ్చు. రసాయనిక నత్రజని ఎరువుల వాడకాన్ని తగ్గించి పచ్చిరొట్ట పైర్లు, జీవన ఎరువులు, వర్మీ కంపోస్టు వాడటం వల్ల నేల ఆరోగ్యం మెరుగుపడి నైట్రస్ ఆక్సైడ్ ఉద్గారాలు ఆగుతాయి. పంట పొలాల గట్ల వెంబడి బహువార్షిక చెట్లు, పండ్ల తోటలను పెంచే వ్యవసాయ–అటవీ విధానాల (ఆగ్రోఫారెస్ట్రీ)ను అనుసరిస్తే రైతులకు అదనపు ఆదాయం సమకూరటంతో పాటు కర్బన ఉద్గారాలు తగ్గుముఖం పడతాయి.
వరి సాగు, పశుపోషణలో మీథేన్ కట్టడి ఇలా..
వరి పొలాల్లో నిరంతరం నీరు నిల్వ ఉంచకుండా, నేల ఆరిన తర్వాత అవసరం మేరకు మళ్లీ తగు మాత్రంగా నీరు పెట్టే ‘తడి–పొడి’ (ఏడబ్ల్యూడీ) పద్ధతి వల్ల మీథేన్ విడుదలను 30 నుంచి 40 శాతం వరకు తగ్గించవచ్చు. ఈ ఆరుతడి వరి పాగు పద్ధతి భూగర్భ జలాలను ఆదా చేయటంతో పాటు వేరు వ్యవస్థను బలోపేతం చేస్తుంది.
పశువులకు ఇచ్చే దాణాలో పచ్చిగడ్డి, బలవర్ధకమైన పోషక దినుసులు, తగిన మిశ్రమాలు చేర్చడం ద్వారా జీర్ణక్రియ సులువై మీథేన్ ఉద్గారాలు తగ్గుతాయి. పశువుల వ్యర్థాలు, పేడను ఆరుబయట వదలకుండా బయోగ్యాస్ ΄్లాంట్ల ద్వారా ఇంధనం తయారు చేసుకోవాలి. ఈ ΄్లాంట్ల నుంచి వెలువడే స్లర్రీని జీవన ఎరువులుగా మార్చుకోవాలని ఐరాస నిపుణులు సూచించారు.
నిర్వహణ: పంతంగి రాంబాబు, సాక్షి సాగుబడి డెస్క్
ఇదీ చదవండి: వాట్సాప్ వారి... గెస్ట్ కాలింగ్


