కత్తిలాంటి తోక ఉండే చేపలు.. వాటి వర్చువల్‌ డేటింగ్‌ గేమ్‌ ఇదే.. | Scientists create virtual dating game for green swordtail fish | Sakshi
Sakshi News home page

కత్తిలాంటి తోక ఉండే చేపలు.. వాటి వర్చువల్‌ డేటింగ్‌ గేమ్‌ ఇదే..

Oct 10 2026 4:46 PM | Updated on Oct 10 2026 5:08 PM

Scientists create virtual dating game for green swordtail fish
  • 9 తరాల చేపలపై పరిశోధన.. మగ చేపల అభిరుచిలో మార్పు లేదు!
  • ఆడ చేపల విషయంలో మగ చేపలది ఒకే రకమైన అభిరుచి

కత్తిలా ఉండే తోకతో ప్రత్యేకంగా కనిపించే పచ్చని కత్తితోక చేపలు తమ జతను ఎంపిక చేసుకునే విధానంపై శాస్త్రవేత్తలు నిర్వహించిన పరిశోధనలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. వరుసగా 9 తరాల పాటు చేపలకు తమకు నచ్చిన జతను ఎంచుకునే అవకాశం ఇవ్వగా.. మగ చేపలు ప్రతిసారీ పెద్ద పరిమాణంలో ఉన్న ఆడ చేపలనే ఎక్కువగా ఇష్టపడ్డాయి. మరోవైపు, ఆడ చేపల అభిరుచులు మాత్రం ఒకే విధంగా లేకుండా మారుతూ వచ్చాయి.  

ఇంగ్లాండ్‌లోని ఎక్సెటర్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు ఈ ప్రయోగాన్ని నిర్వహించారు. ఇందులో నిజమైన చేపలను జతలుగా కలపకుండా, తెరలపై కనిపించే డిజిటల్ చేపలను ఉపయోగించారు. చేపలు తమకు నచ్చిన జతకు సమీపంలో గడిపిన సమయాన్ని ఆధారంగా చేసుకుని వాటి అభిరుచులను గుర్తించారు.

చేపల అభిరుచులను ఎలా గుర్తించారు?
ఈ ప్రయోగంలో 11 ఆడ చేపలు, 12 మగ చేపలను విడివిడిగా పరీక్షించారు. ప్రతి చేపకు ఎదురెదురుగా రెండు వైపులా సంభావ్య జతల (చేపలు తమకు జతగా ఎంచుకోవడానికి అవకాశం ఉన్న ఇతర చేపలు) చిత్రాలను తెరపై చూపించారు. చేపలు 3 నిమిషాల పాటు ట్యాంకులో స్వేచ్ఛగా ఈదేందుకు అవకాశం ఇచ్చారు. ట్యాంకును మూడు భాగాలుగా విభజించారు. మధ్య భాగాన్ని తటస్థ ప్రాంతంగా, మిగిలిన రెండు భాగాలను డిజిటల్ చేపలకు సమీప ప్రాంతాలుగా నిర్ణయించారు.

ఏ చేపకు సమీపంలో ఎక్కువ సమయం గడిపితే, దానినే ఆ చేప ఎంచుకున్న జతగా పరిగణించారు. అనంతరం జన్యు అల్గారిథమ్‌లను ఉపయోగించి, ఎంపికైన చేప లక్షణాలతో పాటు యాదృచ్ఛికంగా ఎంపిక చేసిన మరో విజేత చేప లక్షణాలను కలిపి కొత్త డిజిటల్ చేపలను రూపొందించారు. ఈ విధానాన్ని 9 తరాల పాటు కొనసాగించారు.

మగ చేపలకు పెద్ద ఆడ చేపలే ఇష్టం
పచ్చని మగ కత్తితోక చేపలు పెద్ద ఆడ చేపలనే ఎంచుకున్నాయి. ఈ అభిరుచి తరతరాలకు కొనసాగడంతో, డిజిటల్ ఆడ చేపల పరిమాణం కూడా పెరుగుతూ వచ్చింది. ఇక్కడ నిజమైన చేపలు పెరిగాయని కాదు. కంప్యూటర్‌లో రూపొందించిన చేపల చిత్రాల పరిమాణం పెరిగిందని అర్థం. అంటే మగ చేపలు పెద్ద ఆడ చేపలను ఎంచుకోవడంతో, తర్వాతి తరాల కోసం కంప్యూటర్‌లో రూపొందించిన ఆడ చేపల చిత్రాల పరిమాణాన్ని పరిశోధకులు క్రమంగా పెంచారు. చివరి తరం చేపలు, మొదటి తరం చేపలతో పోలిస్తే సగటున 24 శాతానికి పైగా పెద్దవిగా మారాయి.

పెద్ద ఆడ చేపలు ఎక్కువ సంతానాన్ని ఉత్పత్తి చేయగలగడం ఈ అభిరుచికి కారణమై ఉండవచ్చని పరిశోధకులు భావించారు. ఆడ చేపల ఎంపిక మాత్రం భిన్నంగా ఉంది. కొన్ని చేపలు పొడవైన తోకలు ఉన్న మగ చేపలను, మరికొన్ని ప్రకాశవంతమైన రంగులు కలిగిన చేపలను ఇష్టపడ్డాయి. ఒక ఆడ చేప క్రమంగా ఆడ చేపలను పోలిన రూపం ఉన్న జతలను ఎంచుకోవడం ప్రారంభించింది. అయితే, ఈ అభిరుచికి కారణం ఏమిటనేది ఇంకా స్పష్టంగా తెలియలేదు.

జంతువుల జత ఎంపికపై కొత్త పరిశోధనా విధానం
కార్న్‌వాల్‌లోని పెన్రిన్ ప్రాంగణంలో ఉన్న ఎక్సెటర్ విశ్వవిద్యాలయ పర్యావరణ శాస్త్ర, పరిరక్షణ కేంద్రానికి చెందిన కాథరిన్ బుల్లో మాట్లాడుతూ.. “జంతువుల్లో జత ఎంపికను అధ్యయనం చేయడం కష్టం. ఎందుకంటే, ప్రయోగాల్లో వాటికి పరిమిత సంఖ్యలోనే సంభావ్య జతలను చూపించగలం” అని వివరించారు.

మధ్య అమెరికాలో సహజంగా కనిపించే పచ్చని కత్తితోక చేపల మగ చేపలకు కత్తిలాంటి తోక ఉండటంతో వాటికి ఆ పేరు వచ్చింది. ఇతర చేపల దృశ్యాలకు స్పందించడం, పిల్లల సంరక్షణలో తల్లిదండ్రుల పాత్ర లేకపోవడం వంటి లక్షణాల కారణంగా పరిశోధకులు వీటిని ఎంచుకున్నారు. డాక్టర్ లారా కెల్లీ అభిప్రాయం ప్రకారం.. ఈ చేపలు తమ సంతానానికి మంచి జన్యువులు అందించగల జతలను ప్రధానంగా ఎంచుకుంటాయి. ఈ డిజిటల్ విధానం ద్వారా జంతువుల అభిరుచులు తరతరాలుగా ఎలా మారతాయో పరిశీలించవచ్చు. భవిష్యత్తులో ఇతర జంతువుల జత ఎంపికను అధ్యయనం చేయడంలోనూ ఈ పద్ధతి ఉపయోగపడే అవకాశముంది.

ఇదీ సంగతి: అందుకే జంతర్‌ మంతర్‌ వద్ద ఆందోళనలు: నితిన్‌ నబీన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement