సూర్యుడిపై మహా విస్ఫోటనం.. భూమిని తాకనున్న సోలార్‌ సునామీ! | Solar Tsunami Alert: Sun Erupts Earth Braces for Geomagnetic Storms | Sakshi
Sakshi News home page

సూర్యుడిపై మహా విస్ఫోటనం.. భూమిని తాకనున్న సోలార్‌ సునామీ!

Oct 9 2026 1:19 PM | Updated on Oct 9 2026 1:20 PM

Solar Tsunami Alert: Sun Erupts Earth Braces for Geomagnetic Storms

సూర్యుడిపై షరా మాములుగా భారీ పేలుడు సంభవించింది. కాకపోతే కాస్త ఎక్కువ తీవ్రతతో!. దాని నుంచి వెలువడిన శక్తిమంతమైన తరంగం సూర్యుడి వాతావరణం అంతటా విస్తరించగా.. మరోవైపు వేడెక్కిన ప్లాస్మా, అయస్కాంత క్షేత్రాలతో కూడిన పదార్థం అంతరిక్షంలోకి దూసుకొచ్చింది. ఇప్పుడు వీటి ప్రభావం భూమిపై ఎలా ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది. మరో మూడు రోజుల్లో  సౌర ఉద్గారాలు భూమి అయస్కాంత క్షేత్రాన్ని తాకే అవకాశం ఉందని అంచనాలు నెలకొన్నాయి. దీంతో భూ అయస్కాంత తుపాన్లు ఏర్పడవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. మరి ఈ సౌర కల్లోలంతో భూమిపై ఏం జరగనుంది?

అక్టోబర్‌ 8న సన్‌స్పాట్‌ 4549 ప్రాంతంలో మరోసారి భారీ విస్ఫోటనం సంభవించింది. దీని నుంచి ఎం6.7 తరగతికి చెందిన సౌర జ్వాల (సోలార్‌ ఫ్లేర్‌) వెలువడింది. ఈ తరహా జ్వాలలు సూర్యుడి నుంచి ఒక్కసారిగా పెద్ద మొత్తంలో శక్తిని విడుదల చేస్తాయి. వీటి వల్ల కొన్ని పరిస్థితుల్లో రేడియో సమాచార వ్యవస్థల్లో అంతరాయాలు ఏర్పడవచ్చు. ఈ పేలుడుతోపాటు సూర్యుడి వాతావరణంలో ‘సోలార్‌ సునామీ’గా పిలిచే మోరెటన్‌ తరంగం కూడా ఏర్పడింది. ఇది భూమిపై సముద్రాల్లో వచ్చే సునామీలా కాదు. సూర్యుడి వాతావరణంలో వేగంగా విస్తరించే వేడైన ప్లాస్మా, అయస్కాంత శక్తితో కూడిన భారీ తరంగం. గంటకు పది లక్షల మైళ్లకు పైగా వేగంతో ప్రయాణించగల ఈ తరంగం సూర్యుడి కనిపించే ఉపరితలంలో విస్తృత ప్రాంతాన్ని ప్రభావితం చేసింది.

భూమి వైపు దూసుకొస్తున్నది ఏమిటి?
సౌర జ్వాల నుంచి వెలువడే కాంతి, ఎక్స్‌-కిరణాలు భూమిని త్వరగా చేరగలవు. అయితే కరోనా మాస్‌ ఇజెక్షన్లు (సీఎంఈలు) అని పిలిచే భారీ ప్లాస్మా ఉద్గారాలు భూమిని చేరేందుకు కొన్ని గంటల నుంచి కొన్ని రోజుల వరకు పట్టొచ్చు. తాజా అంచనాల ప్రకారం, అక్టోబర్‌ 8న వెలువడిన ఉద్గారం అక్టోబర్‌ 11న భూమిని తాకవచ్చు. మరో రెండు ఉద్గారాలు కూడా ప్రభావం చూపే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

ఎలాంటి ప్రభావం ఉండొచ్చు?
సీఎంఈలు భూమిని చేరినప్పుడు మన గ్రహం చుట్టూ ఉండే అయస్కాంత క్షేత్రం అల్లకల్లోలానికి గురవుతుంది. దీన్నే భూ అయస్కాంత తుపాను అంటారు. ఈ ప్రభావం ఎంత తీవ్రంగా ఉంటుందనేది సౌర ఉద్గారాల స్వభావంపై ఆధారపడి ఉంటుంది. అమెరికా జాతీయ సముద్ర, వాతావరణ పరిపాలన సంస్థ (నోవా) ప్రకారం.. ఇలాంటి తుపాన్లు ఉపగ్రహాల పనితీరు, జీపీఎస్‌ నావిగేషన్‌, రేడియో సమాచార వ్యవస్థలు, విద్యుత్‌ గ్రిడ్‌లపై ప్రభావం చూపవచ్చు.

అయితే ప్రతి సౌర తుపానూ భారీ నష్టాన్ని కలిగించాలన్న గ్యారెంటీ లేదు. స్వల్ప స్థాయి తుపాన్ల వల్ల ఉపగ్రహాల కార్యకలాపాల్లో చిన్నపాటి సమస్యలు లేదంటే విద్యుత్‌ గ్రిడ్‌లలో స్వల్ప హెచ్చుతగ్గులు ఏర్పడవచ్చు. బలమైన తుపాన్ల సమయంలో కొన్ని ప్రాంతాల్లో రేడియో, నావిగేషన్‌ వ్యవస్థలకు అంతరాయాలు కలగవచ్చు. ప్రస్తుతం అంచనా వేస్తున్న ప్రభావాల తీవ్రతను బట్టి ప్రపంచవ్యాప్తంగా విద్యుత్‌ సరఫరా నిలిచిపోతుందని చెప్పడానికి ఆధారాలు లేవు.

ఆకాశంలో రంగుల వెలుగులు!
ఈ సౌర ఉద్గారాల వల్ల మరో అద్భుతమైన దృశ్యం ఆవిష్కృతమయ్యే అవకాశముంది. సూర్యుడి నుంచి వచ్చిన ఆవేశిత కణాలు(Charged particles) భూమి వాతావరణంలోని వాయువులతో పరస్పర చర్య జరిపినప్పుడు ఆకుపచ్చ, ఎరుపు, ఊదా వంటి రంగుల్లో అరోరాలు కనిపిస్తాయి. సాధారణంగా ధ్రువ ప్రాంతాల వద్ద కనిపించే ఈ కాంతులు.. తుపాను బలంగా ఉన్నప్పుడు మరింత దక్షిణం లేదా ఉత్తరాన ఉన్న ప్రాంతాలకూ విస్తరించవచ్చు. అయితే అవి ఎక్కడ కనిపిస్తాయనేది తుపాను తీవ్రత, అయస్కాంత క్షేత్రాల దిశపై ఆధారపడి ఉంటుంది.

శాస్త్రవేత్తలు ఏం చెబుతున్నారు?
ఆస్ట్రేలియా అంతరిక్ష వాతావరణ కేంద్రం తాజా అంచనాల ప్రకారం.. అక్టోబర్‌ 8న వెలువడిన ఎం6.7 తరగతి సౌర జ్వాల తర్వాత ఒక కరోనా మాస్‌ ఇజెక్షన్‌ నమోదైంది. ఇది అక్టోబర్‌ 11న భూమిని పాక్షికంగా తాకే అవకాశం ఉందని నమూనాలు సూచిస్తున్నాయి. ఈ మధ్యలో మరిన్ని సౌర జ్వాలలు వెలువడే అవకాశమూ ఉందని అంచనా. అయితే భూమిపై వాస్తవ ప్రభావం ఎంత ఉంటుందనేది ఉద్గారాలు చేరిన తర్వాతే స్పష్టమవుతుంది.

మొత్తానికి.. సూర్యుడిపై సంభవించిన భారీ పేలుడు అంతరిక్ష వాతావరణాన్ని ప్రభావితం చేసే అవకాశమున్నా, భూమిపై ఏదో పెను విపత్తు తప్పదని భావించాల్సిన అవసరం లేదు. రాబోయే రోజుల్లో సౌర ఉద్గారాల గమనాన్ని శాస్త్రవేత్తలు పర్యవేక్షించనున్నారు. వాటి వేగం, అయస్కాంత లక్షణాలే భూమిపై ప్రభావం ఎంత ఉంటుందో నిర్ణయించనున్నాయి.

గమనిక: సోలార్‌ సునామీ తరంగం నేరుగా భూమిని ఢీకొంటుందని కాదు. సూర్యుడి వాతావరణంలో ఏర్పడిన ఆ తరంగం, దాని వెంట వెలువడిన ప్లాస్మా ఉద్గారం వేర్వేరు అంశాలు. భూమిపై ప్రభావం ప్రధానంగా భూమి దిశగా వచ్చే సీఎంఈల వేగం, సాంద్రత, వాటి అయస్కాంత క్షేత్రాల దిశపై ఆధారపడి ఉంటుంది.

ఇదీ చదవండి: కాల్చి చంపేటప్పుడు లైవ్‌లో చూపించడం సబబేనా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement