అమెరికాలో సంచలనం రేపిన ఓ సైనిక స్థావరంపై కాల్పుల కేసులో ట్రంప్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. 2009లో టెక్సాస్‌లోని ఫోర్ట్ హుడ్ సైనిక స్థావరంలో 13 మందిని కాల్చి చంపిన మాజీ ఆర్మీ మానసిక వైద్యుడు నిడాల్ హసన్‌కు మరణశిక్ష అమలు చేసే ముహూర్తం ఖరారు చేశారు. అంతేకాదు.. అతడిని ఫైరింగ్ స్క్వాడ్‌తో కాల్చి చంపే ప్రక్రియను లైవ్‌స్ట్రీమింగ్ చేయనున్నట్లు పెంటగాన్ ప్రకటించింది.
నిడాల్ హసన్‌కు డిసెంబర్ 3, 2026న గురువారం మధ్యాహ్నం 1 గంటకు అమెరికా సెంట్రల్ టైమ్ ప్రకారం (భారత కాలమానం ప్రకారం డిసెంబర్ 4న అర్ధరాత్రి 12:30 గంటలకు) మరణశిక్ష అమలు చేయనున్నారు. టెక్సాస్‌లోని ఫోర్ట్ హుడ్ సైనిక స్థావరంలో ఫైరింగ్ స్క్వాడ్(తుపాకీతో కాల్చి చంపడం) ద్వారా శిక్ష అమలు చేయాలని నిర్ణయించారు. అమెరికాలో మరణశిక్షను ప్రత్యక్ష ప్రసారం చేయడం ఇదే తొలిసారి కానుంది. అయితే.. ఈ నిర్ణయం వెనుక శిక్ష తీవ్రతను ప్రజలకు చాటాలనే ఉద్దేశం ఉందని రక్షణ మంత్రి పీట్ హెగ్‌సెత్ వ్యాఖ్యలు సూచిస్తున్నాయి. అదే సమయంలో లైవ్ టెలికాస్టింగ్‌పై న్యాయపరమైన ప్రశ్నలతోపాటు నైతిక చర్చ కూడా మొదలైంది.
రక్షణ మంత్రి హెగ్‌సెత్ ఈ నిర్ణయాన్ని సమర్థిస్తూ.. ఇలాంటి చర్యలకు తీవ్రమైన పరిణామాలు ఉంటాయనే విషయాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలని చెప్పారు. ఫోర్ట్ హుడ్‌లో గురువారం మధ్యాహ్నం ఒంటి గంటకు శిక్ష అమలు చేయాలని నిర్ణయించడం కూడా యాదృచ్ఛికం కాదని ఆయన వ్యాఖ్యానించారు. 2009లో హసన్ కాల్పులకు తెగబడిన రోజు, సమయం, అదే స్థావరాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
అసలు నిడాల్ హసన్ ఎవరు?
నిడాల్ హసన్ (56) గతంలో అమెరికా సైన్యంలో మానసిక వైద్యుడిగా పనిచేశారు. 2009 నవంబర్ 5న టెక్సాస్‌లోని ఫోర్ట్ హుడ్ సైనిక స్థావరంలో ఉన్న వైద్య కేంద్రంలోకి వెళ్లి తుపాకీతో కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 13 మంది మరణించగా, మరో 32 మంది గాయపడ్డారు. మృతుల్లో గర్భిణీ సైనికురాలు కూడా ఉన్నారు. కాల్పుల సమయంలో హసన్ సెమీ ఆటోమేటిక్ హ్యాండ్‌గన్ ఉపయోగించినట్లు నివేదికలు వెల్లడించాయి.
ఈ దాడి జరిగినప్పుడు హసన్ మరికొద్ది వారాల్లో ఆఫ్ఘనిస్తాన్‌కు విధులపై వెళ్లాల్సి ఉంది. అమెరికా ముస్లిం దేశాల్లో చేపట్టిన యుద్ధాలకు ప్రతీకారంగానే దాడి చేసినట్లు ఆయన పేర్కొన్నారని వార్తా కథనాలు తెలిపాయి. అరెస్టు చేసే సమయంలో పోలీసులు కాల్పులు జరపడంతో హసన్ పాక్షికంగా పక్షవాతానికి గురయ్యారు. అప్పటి నుంచి వీల్‌చైర్‌కే పరిమితమయ్యారు.
2013లోనే మరణశిక్ష విధింపు
ఈ కేసులో సైనిక న్యాయస్థానం 2013 ఆగస్టులో హసన్‌ను దోషిగా తేల్చింది. ముందస్తు ప్రణాళికతో హత్యలు చేయడం, హత్యాయత్నాలకు పాల్పడటం కలిపి 45 అభియోగాల్లో ఆయన దోషిగా తేలారు. అనంతరం సైనిక జ్యూరీ మరణశిక్ష విధించాలని సిఫార్సు చేసింది. అప్పటి నుంచి ఆయన మరణశిక్ష ఖైదీగా ఉన్నారు.
అమెరికా సైనిక చట్టాల ప్రకారం సైనికుడికి మరణశిక్ష అమలు చేయడానికి అధ్యక్షుడి ఆమోదం తప్పనిసరి. రక్షణ మంత్రి హెగ్‌సెత్ సిఫార్సు మేరకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫైరింగ్ స్క్వాడ్ ద్వారా శిక్ష అమలుకు ఆమోదం తెలిపినట్లు పెంటగాన్ వెల్లడించింది. డిసెంబర్ 3న టెక్సాస్‌లోని అదే ఫోర్ట్ హుడ్ స్థావరంలో మధ్యాహ్నం ఒంటి గంటకు శిక్ష అమలు చేయాలని సైన్యం ప్రకటించింది.
అమెరికా చరిత్రలోనే అరుదైన పరిణామం
అమెరికాలో మరణశిక్షలను టెలివిజన్‌లో ప్రసారం చేయాలంటూ గతంలో మీడియా సంస్థలు ప్రయత్నించినప్పటికీ, కోర్టుల ద్వారా అడ్డంకులు ఎదురయ్యాయి. ఇప్పుడు సైనిక స్థావరంలో అమలు చేయబోయే శిక్షను లైవ్‌స్ట్రీమింగ్ చేయాలన్న నిర్ణయం చట్టపరమైన, నైతికపరమైన ప్రశ్నలకు దారితీస్తోంది. అమెరికాలో చివరిసారిగా చట్టబద్ధంగా బహిరంగంగా మరణశిక్ష అమలు చేసింది 1936లో. అప్పట్లో వేలాది మంది ప్రేక్షకుల సమక్షంలో ఉరిశిక్ష అమలు చేశారు. అప్పటి నుంచి అమెరికాలో మరణశిక్షలు సాధారణంగా ప్రజలకు కనిపించకుండా, నిర్దిష్ట ప్రదేశాల్లోనే అమలు చేస్తున్నారు.
ఫైరింగ్ స్క్వాడ్ ద్వారా అమెరికా సైన్యం చివరిసారిగా 1945లో మరణశిక్ష అమలు చేసింది. రెండో ప్రపంచ యుద్ధం సమయంలో సైనిక విధుల నుంచి పారిపోయిన ఎడ్డీ స్లోవిక్‌ను ఫ్రాన్స్‌లో కాల్చి చంపారు. అయితే, అమెరికా సైన్యంలో చివరిసారిగా మరణశిక్ష అమలైంది 1961లో. ఆ సందర్భంలో జాన్ బెన్నెట్‌కు ఉరిశిక్ష విధించారు. అందువల్ల హసన్‌కు శిక్ష అమలైతే, 1945 తర్వాత అమెరికా సైన్యంలో ఫైరింగ్ స్క్వాడ్ ద్వారా మరణశిక్ష విధించిన తొలి వ్యక్తిగా ఆయన నిలుస్తారు.
న్యాయ నిపుణుల అభ్యంతరాలు
ఈ నిర్ణయంపై న్యాయ నిపుణులు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. యేల్ లా స్కూల్‌లో ఉపన్యాసాలు ఇచ్చే సైనిక న్యాయ నిపుణుడు యూజీన్ ఫిడెల్.. మరణశిక్షను ప్రత్యక్ష ప్రసారం చేయడం అత్యంత అసాధారణమని వ్యాఖ్యానించారు. ఈ అంశంపై అమెరికా సుప్రీంకోర్టు ఇప్పటివరకు స్పష్టమైన తీర్పు ఇవ్వలేదని తెలిపారు. హసన్ తన మరణాన్ని ప్రజలకు ప్రదర్శించడాన్ని అడ్డుకోవాలనుకుంటే ఫెడరల్ కోర్టును ఆశ్రయించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
సైనిక న్యాయ చరిత్రకారుడు జోనాథన్ లూరీ కూడా ఈ నిర్ణయాన్ని ప్రశ్నించారు. మరణశిక్షను బహిరంగంగా చూపించడం వల్ల ఏమి ప్రయోజనం ఉంటుందనే సందేహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం శిక్షను ప్రజలకు చూపించడం ద్వారా నేరాలపై భయం కలిగించాలని భావిస్తున్నప్పటికీ, అది అవసరమా అనే చర్చ మొదలైంది.
మరణశిక్ష విధానాలపై మళ్లీ చర్చ
ప్రస్తుతం అమెరికాలో కొన్ని రాష్ట్రాలు ఫైరింగ్ స్క్వాడ్ ద్వారా మరణశిక్ష అమలుకు అనుమతిస్తున్నాయి. డెత్ పెనాల్టీ ఇన్ఫర్మేషన్ సెంటర్ ప్రకారం.. కనీసం ఐదు రాష్ట్రాల్లో ఈ విధానం చట్టబద్ధంగా ఉంది. 2025లో దక్షిణ కరోలినా 15 ఏళ్ల విరామం తర్వాత ఫైరింగ్ స్క్వాడ్ ద్వారా మరణశిక్ష అమలు చేసిన తొలి రాష్ట్రంగా నిలిచింది. మరోవైపు, ప్రాణాంతక ఇంజెక్షన్ల కోసం అవసరమైన మందులు లభించడంలో ఇబ్బందులు ఎదురవుతున్న నేపథ్యంలో అమెరికా ప్రభుత్వం ఫైరింగ్ స్క్వాడ్, కరెంట్ షాకివ్వడం, విషవాయువుతో ఊపిరాడకుండా చేయడం వంటి పద్ధతులను కూడా చేర్చింది. ఇటీవల టెన్నెసీలో క్రిస్టా పైక్ అనే మహిళకు ప్రాణాంతక ఇంజెక్షన్ ద్వారా మరణశిక్ష అమలు చేసే ప్రయత్నం విఫలమవడం కూడా ఈ చర్చకు మరింత ప్రాధాన్యం తెచ్చింది. ఇంజెక్షన్ ప్రక్రియలో సమస్యలు తలెత్తడంతో ఆమెను ఆస్పత్రికి తరలించారు.
ప్రపంచవ్యాప్తంగా చట్టబద్ధమైన మరణశిక్షలను ప్రత్యక్ష ప్రసారం చేయడం అత్యంత అరుదైన విషయం. ఇటీవలి కాలంలో బహిరంగ మరణశిక్షలు అమలు చేసిన దేశాలుగా ఇరాన్, తాలిబన్ల పాలనలోని ఆఫ్ఘనిస్తాన్ పేర్లు వినిపిస్తున్నాయి. ఇప్పుడు అమెరికా సైన్యం కూడా ఈ దిశగా అడుగువేస్తుండటంతో.. నేరాలకు శిక్ష విధించే విధానం, దాని ద్వారా ప్రజలకు ఏ సందేశం ఇవ్వాలనే అంశాలపై అంతర్జాతీయంగా చర్చ జరిగే అవకాశం ఉంది. మొత్తానికి.. 13 మందిని చంపిన కేసులో నిడాల్ హసన్‌కు మరణశిక్ష విధించడం కొత్త విషయం కాదు. కానీ ఆ శిక్షను ఫైరింగ్ స్క్వాడ్ ద్వారా అమలు చేయడంతోపాటు ప్రజలు ప్రత్యక్షంగా చూడగలిగేలా ప్రసారం చేయాలన్న నిర్ణయమే ఇప్పుడు అమెరికాలో కొత్త వివాదానికి కేంద్రంగా మారింది.
ఇదీ చదవండి: ఎన్నారైలే టార్గెట్.. ట్రంప్ బిగ్ స్కెచ్


