సీబీఐ తనిఖీల్లో బయటపడ్డ నగదు, నగలు
న్యూఢిల్లీ: సెంట్రల్ గూడ్స్ అండ్ సర్విసెస్ ట్యాక్స్ (సీజీఎస్‌టీ) సూపరింటెండెంట్ నివాసంలో సోదా లు జరిపిన సీబీఐ అధికారులు రూ.1.86 కోట్ల విలువైన నగదుతోపాటు బంగారు, వెండి నగలు, వస్తు వులను స్వా«దీనం చేసుకున్నారు. హరియాణాలోని పంచ్‌కులలో పనిచేసే లవ్‌కుశ్ కుమార్ రూ.10 లక్ష లు లంచం తీసుకుంటూ ఈ నెల 19వ తేదీన సీబీఐ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు.
ఓ ప్రైవేట్ సంస్థకు అనుకూలంగా వ్యవహరించేందుకు గాను లంచం డిమాండ్ చేసినందుకు ఈయనపై కేసు నమోదు చేసి, అరెస్ట్ చేశారు. శుక్రవారం ఈ అధికారి ఇంట్లో సీబీఐ బృందం తనిఖీలు చేపట్టింది. ఈ సందర్భంగా రూ.24.29 లక్షల నగదును, మరో రూ.15.65 లక్షల విలువచేసే విదేశీ కరెన్సీని స్వా«దీనం చేసుకున్నారు. వీటితోపాటు, రూ.1.46 కోట్ల విలువైన బంగారు అభరణాలు, బంగారం బిస్కెట్లు, వెండి వస్తువులను సీజ్ చేశారు. వీటన్నిటి మొత్తం విలువ రూ.1.86 కోట్లని సీబీఐ అధికారి ఒకరు వివరించారు.
ఇవికాకుండా, ఆరు బ్యాంకు అకౌంట్లు, పెట్టుబడులు, జీవిత బీమా పాలసీలు, పలు స్థిరాస్తులు, అధికారితోపాటు ఆయన కుటుంబ సభ్యుల వాహనాల డాక్యుమెంట్లు, ఆర్థిక లావాదేవీల పత్రాలు కూడా బయటపడ్డాయన్నారు. ‘తమ ప్రైవేట్ సంస్థపై భారీ పెనాల్టీలు విధించకుండా, ఇకపై డిమాండ్ నోటీసులు పంపకుండా ఉండాలంటే రూ.50 లక్షలు ముడుపుగా ఇవ్వాలంటూ జీఎస్టీ సూపరింటెండెంట్ లవ్‌కుశ్ కుమార్ డిమాండ్ చేశారని ఫిర్యాదుదారు మా దృష్టికి తీసుకువచ్చారు. పలుమార్లు ఆయనతో చర్చలు జరిపిన ఫిర్యాదీదారు చివరకు రూ.20 లక్షలకు బేరం కుదుర్చుకున్నారు. ముందుగా రూ.10 లక్షలు ముట్టజెప్పేందుకు కూడా అంగీకరించారు. దీనిపై ఆయన మాకు ఉప్పందించారు. మా పరిశీలనలో ఇది నిజమేనని నిర్ధారణయింది. ఫిర్యాదీదారు సాయంతో మేం వలపన్ని రూ.10 లక్షలు లంచం తీసుకుంటుండగా లవ్‌కుశ్ కుమార్‌ను పట్టుకున్నాం’అని ఆ అధికారి వివరించారు.


