హాంగ్ కాంగ్ సిక్సెస్ 2026 టోర్నీలో ఆస్ట్రేలియా వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. మోంగ్ కోక్‌లోని మిషన్ రోడ్ గ్రౌండ్ వేదికగా జరిగిన గ్రూపు-ఎ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ను 38 పరుగుల తేడాతో ఆసీస్ చిత్తు చేసింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు నిర్ణీత 6 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి ఏకంగా 159 పరుగులు చేసింది.
బ్రయంట్ మెరుపు హాఫ్ సెంచరీ
ఆసీస్ బ్యాటర్లలో ఓపెనర్ మాక్స్ బ్రయంట్, ఫస్ట్ డౌన్ బ్యాటర్ నిక్ హాబ్సన్ మెరుపు హాఫ్ సెంచరీలతో చెలరేగారు. ఇన్నింగ్స్ ఆరంభం నుంచే ఇంగ్లండ్ బౌలర్లపై విరుచుకుపడిన బ్రయంట్.. కేవలం 9 బంతుల్లోనే తన అర్ధ శతకాన్ని పూర్తి చేసుకున్నాడు. అతడు ఓవరాల్‌గా కేవలం 11 బంతుల్లో 2 ఫోర్లు, 8 సిక్సర్లతో 56 పరుగులు చేసి విధ్వంసం సృష్టించాడు.
నిక్ హాబ్సన్ 11 బంతుల్లో 3 ఫోర్లు, 6 సిక్సర్లతో 50 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. వీరిద్దరితో పాటు జాక్ వుడ్ 11 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్సర్లతో 40 పరుగులు చేసి రిటైర్డ్ అవుట్‌గా వెనుదిరిగాడు. ఇంగ్లండ్ బౌలర్లలో నాథన్ గిల్‌క్రిస్ట్ 2 వికెట్లు పడగొట్టాడు.
అనంతరం 160 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ నిర్ణీత 6 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 121 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఓపెనర్ జాన్ సింప్సన్ 12 బంతుల్లోనే 1 ఫోర్, 8 సిక్సర్లతో 54 పరుగులు చేసి రిటైర్డ్ నాటౌట్‌గా నిలిచాడు. అతడితో పాటు మార్టిన్ ఆండర్సన్ 22 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సర్లతో 50 పరుగులు చేసినప్పటికీ, జట్టును విజయ తీరాలకు చేర్చలేకపోయాడు.


