జెర్సీ నెంబ‌ర్ '45' మిస్ట‌రీ గుట్టువిప్పిన రోహిత్ శ‌ర్మ‌! | Rohit Sharma Reveals Reason-Behind Wearing Jersey No45-Team India | Sakshi
Sakshi News home page

జెర్సీ నెంబ‌ర్ '45' మిస్ట‌రీ గుట్టువిప్పిన రోహిత్ శ‌ర్మ‌!

Oct 31 2026 7:15 AM | Updated on Oct 31 2026 7:58 AM

Rohit Sharma Reveals Reason-Behind Wearing Jersey No45-Team India

Photo Credit: BCCI Twitter

టీమిండియా సీనియ‌ర్ ఆట‌గాడు రోహిత్ శ‌ర్మ న్యూజిలాండ్‌తో వ‌న్డే సిరీస్ ఆడేందుకు సిద్ధ‌మ‌వుతున్నాడు. 2027 వ‌న్డే వ‌ర‌ల్డ్‌క‌ప్ ప్ర‌యాణం త‌న చివ‌రి మ‌జిలీ అని ఇంత‌క‌ముందే చెప్పిన రోహిత్ అప్ప‌టిదాకా ఫామ్‌లో ఉండేందుకు తెగ క‌ష్ట‌ప‌డుతున్నాడు. ఇప్ప‌టికే వ‌న్డే సిరీస్ కోసం న్యూజిలాండ్ వ‌చ్చిన రోహిత్ ఆక్లాండ్‌లో ప్రాక్టీస్ కూడా షురూ చేశాడు. ఈ విష‌యం ప‌క్క‌న‌బెడితే.. టీమిండియా క్రికెట‌ర్లు ధ‌రించే జెర్సీ నెంబ‌ర్ల‌లో అన్నీ గుర్తుండ‌క‌పోయినా.. స‌చిన్‌, కోహ్లి, ధోని, రోహిత్ లాంటి క్రికెట‌ర్ల జెర్సీ నెంబ‌ర్లు మాత్రం మ‌న నోటిమీదే ఆడుతుంటాయి.

ఉదాహ‌ర‌ణ‌కు స‌చిన్ జెర్సీ నెంబ‌ర్ చెప్ప‌మంటే.. '10' అని, అలాగే కోహ్లి జెర్సీ నెంబ‌ర్ '18' అని, ధోని జెర్సీ నెంబ‌ర్ '7' అని.. ఇక రోహిత్ శ‌ర్మ జెర్సీ నెంబ‌ర్ చెప్ప‌మంటే ట‌క్కున వ‌చ్చే స‌మాధానం '45'. ఒక్కొక్క‌రి జెర్సీ నెంబ‌ర్ వెనుక ఒక్కో క‌థ ఉన్న‌ట్లే.. రోహిత్ నెంబ‌ర్ 45 వెనుక కూడా క‌థ దాగుంది. తాజాగా రోహిత్ శ‌ర్మ త‌న జెర్సీ నెంబ‌ర్ 45 వెనుక క‌థ‌ను పంచుకున్నాడు.

తాను హోస్ట్‌గా వ్యవహరిస్తున్న 'ఫ్యామిలీ ఫుల్ హౌస్ విత్ రోహిత్ శర్మ' అనే గేమింగ్ రియాలిటీ షోలో ఈ విషయాన్ని వెల్లడించాడు. ఈ జెర్సీ నెంబర్‌ను ఎంచుకోవడం వెనుక తన తల్లి పాత్ర కీలకమని రోహిత్ తెలిపాడు. ఈ షోలో నటుడు రాహుల్ లోహాని.. "సర్, 45 నెంబర్ జెర్సీ చూడగానే హిట్ మ్యాన్ వచ్చాడని అందరికీ అర్థమవుతుంది. కానీ మీరు ఈ నెంబర్‌నే ఎందుకు ఎంచుకున్నారు?" అని ప్రశ్నించారు.

దీనిపై రోహిత్ శ‌ర్మ స్పందిస్తూ.. ''తొలినాళ్లలో అండర్-19 ఆడుతున్నప్పుడు నాకు 19వ నెంబర్ జెర్సీ కేటాయించారు. ఆ నెంబ‌ర్‌తో జెర్సీ ధ‌రించి ఎంతో ఇష్టంతో ఆడాను. కానీ ఆ తర్వాత సీనియర్ జట్టులోకి వస్తే ఆ నెంబర్‌ను కొనసాగించలేవని ఒకరు చెప్పిన‌ట్లు గుర్తు. ఎందుకంటే అప్పట్లో టీమిండియా కెప్టెన్‌గా ఉన్న రాహుల్ ద్రవిడ్ జెర్సీ నెంబ‌ర్ 19 కావ‌డం గ‌మ‌నార్హం. అందుకే ఆ నెంబర్‌ను వదులుకోవాల్సి వచ్చింది. 

జాతీయ జ‌ట్టుకు ఎంపిక‌య్యాకా 19 నెంబ‌ర్‌తో ఆడలేనని తెలియగానే, వెంటనే హోటల్‌కు వెళ్లి మా అమ్మకు ఫోన్ చేశాను. ఏ నెంబర్ తీసుకోవాలో చెప్పమని అడిగాను. అప్పుడు అమ్మ 'న్యూమరాలజీ ప్రకారం 9 వచ్చేలా చూసుకో, నీకు మంచిది' అని సలహా ఇచ్చింది. అయితే 9వ నెంబర్ అప్పటికే వేరొకరు తీసుకున్నారని, 27 (2+7=9) తీసుకోవడం ఇష్టం లేదని చెప్పాను. 

అయితే అదే సమయంలో 4, 5 అంకెలు పక్కపక్కన ఉంటే బాగుంటుందనిపించింది. ఈ విషయాన్ని అమ్మకు చెప్పి, 4+5 కలిపితే 9 వస్తుంది కదా అని ఒప్పించాను. అలా '45' నెంబర్‌ను ఎంచుకున్నాను" అంటూ రోహిత్ శ‌ర్మ‌ తన జెర్సీ వెనుక ఉన్న మిస్ట‌రీని బ‌య‌ట‌పెట్టాడు.

ఇక రోహిత్ శ‌ర్మ టీమిండియా కెప్టెన్‌గా 2024 టీ20 ప్ర‌పంచ‌క‌ప్ సాధించాడు. స‌మ‌కాలీన క్రికెట‌ర్ల‌లో బెస్ట్ ఓపెన‌ర్‌గా పేరు పొందిన రోహిత్ శ‌ర్మ 291 వ‌న్డేల్లో 12,120 ప‌రుగులు, 67 టెస్టుల్లో 4,301 ప‌రుగులు, 159 టీ20ల్లో 4,231 ప‌రుగులు సాధించాడు. ఇందులో వ‌న్డేల్లో 36 సెంచ‌రీలు, టెస్టుల్లో 12 సెంచ‌రీలు, టీ20ల్లో 5 సెంచ‌రీలు ఉన్నాయి.

ఇదీ చదవండి: 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement