Photo Credit: BCCI Twitter
న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌ను 3-2తో సొంతం చేసుకున్నప్పటికీ, టీమిండియాలో ఇంకా ఏదో వెలితి మాత్రం కనిపిస్తోంది. ఎందుకంటే భారత్ పూర్తిస్థాయిలో న్యూజిలాండ్‌పై ఆధిపత్యాన్ని ప్రదర్శించడంలో విఫలమైందని చెప్పొచ్చు. తొలి నాలుగింటిలో మూడు మ్యాచ్‌ల్లో ఛేదనలో విజయం సాధించిన భారత్ నాలుగో టీ20లోనూ ఛేదనకు దిగినప్పటికీ ఓటమి ఎదురైంది.
ఇక చివరి టీ20లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్‌కు ఓటమి తప్పలేదు. వరుసగా మూడు మ్యాచ్‌లు గెలిచి సిరీస్ మనం సొంతం కావడంతో భారత్ ఆటతీరుపై పెద్దగా విమర్శలు రాలేదు. కానీ ఒకవేళ తొలి మూడింటిలో ఒక్కదానిలో ఓడినా ఇవాళ పరిస్థితి వేరుగా ఉండేదేమో. ఈ నేపథ్యంలో వైభవ్ సూర్యవంశీ ప్రస్తావన మరోసారి తెరమీదకు వచ్చింది.
గాయంతో ఇషాన్ కిషన్ దూరమవ్వడంతో వైభవ్ సూర్యవంశీ రెండు, మూడు టీ20 మ్యాచ్‌లు ఆడిన సంగతి తెలిసిందే. రెండో టీ20లో విఫలమైనప్పటికీ, మూడో టీ20లో మాత్రం 19 బంతుల్లో 45 పరుగులతో దనాధన్ ఇన్నింగ్స్‌తో అలరించాడు. మళ్లీ నాలుగో టీ20కి ఇషాన్ కిషన్ అందుబాటులోకి రావడంతో వైభవ్ చివరి రెండు టీ20లకు మరోసారి బెంచ్‌కే పరిమితమయ్యాడు. ఇక్కడే కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, హెడ్‌కోచ్ గౌతమ్ గంభీర్‌లపై విమర్శలు వచ్చాయి.
ఎలాగూ టీ20 సిరీస్ నెగ్గాము కాబట్టి సంజూ సామ్సన్‌కు రెస్ట్ ఇచ్చి వైభవ్ సూర్యవంశీని ఆడిస్తే బాగుండేదని సోషల్ మీడియాలో అభిమానులు కామెంట్లు పెట్టారు. అంతేకాదు, కెప్టెన్‌గా అయ్యర్.. కోచ్‌గా గంభీర్ ఉన్నంతకాలం వైభవ్‌కు తుదిజట్టులో అవకాశాలు రావడం కష్టమేనని విమర్శించారు. ఎందుకంటే గంభీర్ ప్రత్యక్షంగానే వైభవ్ గురించి మాట్లాడాడు.
వైభవ్ వయసు దృష్ట్యా అతడికి చాలా సమయముందని, జట్టుతో పాటు ఉన్నా అతడు ఎక్కువగా బెంచ్‌కే పరిమితం కావాల్సి ఉంటుందని తెలిపాడు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కూడా గంభీర్ బాటలోనే నడుస్తున్నాడు. ఇది కొందరి అభిమానులకు రుచించడం లేదు. వీళ్లిద్దరూ ఉన్నంత కాలం వైభవ్ టీమిండియాకు ఆడలేడని, ఆ ఇద్దరిలో ఒకరు వెళ్లిపోతేనే వైభవ్‌కు జట్టులో ఆడేందుకు మార్గం సుగమమవుతుందని కొందరు బాహంటగానే విమర్శలు చేశారు.
అయితే సోషల్ మీడియాలో వచ్చే వార్తలను తాను పట్టించుకోనని, అందరినీ సంతోషపెట్టడం తన పని కాదని గంభీర్ ఐదో టీ20కి ముందు మీడియాతో మాట్లాడుతూ.. పరోక్షంగా అభిమానులనుద్దేశించి ఘాటుగా వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.
ఇదీ చదవండి: తొలి బౌలర్‌గా రికార్డు.. ఆఫ్గన్ చేతిలో జింబాబ్వే క్లీన్‌స్వీప్


