14 మంది సభ్యులతో ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేసిన క్రీడా శాఖ
న్యూఢిల్లీ: సమర్థవంతమైన నిర్వహణతో పాటు ఆర్థికంగా స్వయం సమృద్ధి సాధించే క్రీడా లీగ్‌లను అభివృద్ధి చేయడానికి ఒక సమగ్ర విధానాన్ని రూపొందించేందుకు కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ నడుంబిగించింది. దీని కోసం బుధవారం 14 మంది సభ్యులతో కూడిన ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో బీసీసీఐ సీఈఓ, ఐపీఎల్ సీఓఓ హేమంగ్ అమీన్‌తో పాటు భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) సీఈవో రఘురామ్ అయ్యర్ ప్రధాన సభ్యులుగా ఉన్నారు. జాతీయ క్రీడా సమాఖ్యలు, లీగ్ నిర్వాహకులు, పెట్టుబడిదారులు, స్పోర్ట్స్ టెక్నాలజీ సంస్థలతో సంప్రదింపులు జరిపిన అనంతరం ఎనిమిది వారాల్లోగా ఈ కమిటీ... కేంద్ర క్రీడా శాఖకు సిఫార్సులు సమర్పించాల్సి ఉంటుంది.
దేశంలో కొన్ని క్రీడా లీగ్‌లు అంచనాలకు మించి విజయవంతమైనప్పటికీ... మరి కొన్ని మాత్రం ఆరంభ ధశలో ఆర్థికపరమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ నేపథ్యంలో ప్రస్తుత క్రీడా లీగ్ వ్యవస్థలోని లోపాలను, అవరోధాలను గుర్తించడంతో పాటు ఒలింపిక్ క్రీడలు, మహిళల క్రీడలు, యువజన క్రీడలు, దేశీయ క్రీడలకు ప్రాధాన్యతనిస్తూ... వాటికి తగిన కార్యాచరణ నమూనాలను ఈ కమిటీ సూచించనుంది. అలాగే కార్పొరేట్ పెట్టుబడులు, ఫ్రాంచైజీ యాజమాన్యం, స్పాన్సర్‌షిప్‌లు, ప్రసార హక్కులు, సీఎస్‌ఆర్ నిధులను ఆకర్షించే మార్గాలను అన్వేషించనుంది.
అంతేకాకుండా క్షేత్రస్థాయిలో క్రీడలను ప్రోత్సహించేందుకు పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, స్థానిక క్లబ్‌లను లీగ్‌లతో అనుసంధానం చేసే వ్యూహాలను ప్రతిపాదించనుంది. ప్రస్తుతం దేశంలో క్రికెట్, బ్యాడ్మింటన్, కబడ్డీ, హాకీ, రెజ్లింగ్, ఆర్చరీ తదితర క్రీడల్లో లీగ్‌లు ప్రేక్షకాదరణ సాధించాయి. అయితే వీటిలో కొన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఇలాంటి సమయంలో ఈ కమిటీ ఏర్పాటుతో అన్నీ క్రీడా సమాఖ్యలకు ప్రయోజనం చేకూరనుంది. కొత్త విధానం ద్వారా క్రీడా ప్రతిభ వెలుగులోకి రావడమే కాకుండా స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్, బ్రాడ్‌కాస్టింగ్, టెక్నాలజీ ఈవెంట్స్ రంగాల్లో ప్రైవేట్ పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని మంత్రిత్వ శాఖ ఆశాభావం వ్యక్తం చేసింది.
కన్వినర్‌గా కునాల్...
ఈ కమిటీకి క్రీడా మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి (గవర్నెన్స్) కునాల్ కన్వినర్‌గా వ్యవహరించనుండగా... సంయుక్త కార్యదర్శి (ఖేలో ఇండియా) వినీల్ కృష్ణ, రఘురామ్ అయ్యర్ (ఐఓఏ సీఈఓ), బి. శ్రీనివాసన్ (రిలయన్స్ ఇండస్ట్రీస్), హేమంగ్ అమీన్ (బీసీసీఐ సీఈఓ, ఐపీఎల్ సీఓఓ), పి.కె.ఎస్.వి. సాగర్ (జీఎంఆర్ స్పోర్ట్స్), సంజయ్ అడేసర (అదానీ స్పోర్ట్స్‌లైన్), దివ్యాన్షు సింగ్ (జేఎస్‌డబ్ల్యూ స్పోర్ట్స్), ఇషాన్ ఛటర్జీ (జియో హాట్‌స్టార్), రాజేష్ కౌల్ (సోనీ పిక్చర్స్), అనుపమ్ స్వరూప్ (డీడీ స్పోర్ట్స్), పరాగ్ దరాడే (జీ ఎంటర్‌టైన్‌మెంట్), అభిజిత్ భట్టాచార్య (బీవీఎల్), న్యాయవాది నందన్ కామత్ సభ్యులుగా నియమితులయ్యారు.


